
సాక్షి, హైదరాబాద్ : మక్కా మసీద్ బాంబు పేలుళ్ల కేసులో సంచలన తీర్పును వెలువరిచిన అనంతరం కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల్లో ఐదుగురు నిర్దోషులు అంటూ సోమవారం ఉదయం తీర్పు ప్రకటించిన ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు జడ్జి జస్టిస్ రవీందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం తీర్పు వెలువరించిన కొద్దిసేపటికే రవీందర్ రెడ్డి రాజీనామ లేఖను హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు పంపించారు. అయితే తీర్పు తరువాత బెదిరింపు కాల్స్ వచ్చాయని రవీందర్ రెడ్డి తన మిత్రులకు చెప్పినట్లు సమాచారం.
రెండేళ్ల క్రితం ఏపీకి చెందిన వారిని తెలంగాణ జడ్జిలుగా నియమించొద్దంటూ తెలంగాణకు చెందిన 11 మంది న్యాయమూర్తులు ఆందోళనలు చేశారు. ఆ సమయంలో సస్పెండ్ అయిన 11 మందిలో ఆయన ఒకరు. అనంతరం తెలంగాణ ప్రత్యేక హైకోర్టు కోసం గతంలో రాజీనామా సైతం చేశారు. అయితే మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసులో తీర్పు వెలువరించిన గంటల వ్యవధిలో రవీందర్ రెడ్డి రాజీనామా న్యాయవ్యవస్థలో తీవ్ర చర్చనీయాంశం, సంచలనంగా మారింది.
ఎన్‌ఐఏ జడ్జిగా రాజీనామా చేసిన రవీందర్ రెడ్డి స్వస్థలం కరీంనగర్ జల్లా. ప్రస్తుతం ఆయన తెలంగాణ జ్యుడీషియరీ అధికారుల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మరో రెండు నెలల్లో ఆయన పదవీ కాలం ముగియనుంది. అయితే ఈ రాజీనామాకు కారణం ఒత్తిల్లేనని భావిస్తున్నారు. అయితే ఆయన గత కొంతకాలంగా తీవ్ర మనోవ్యధతో ఉన్నారని సన్నిహితులు చెబుతున్నా అసలు కారణం మాత్రం తెలియరాలేదు.
Comments
Please login to add a commentAdd a comment