సాక్షి, హైదరాబాద్: మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ సంచలన తీర్పు ఇచ్చిన న్యాయాధికారి కె.రవీందర్‌రెడ్డి స్వచ్ఛంద పదవీ విరమణకు హైకోర్టు శుక్రవారం ఆమోదం తెలిపింది. మే 31వ తేదీ నుంచే ఆయన వీఆర్‌ఎస్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
ఇప్పటివరకు ఆయన నిర్వర్తించిన హైదరాబాద్ నాలుగో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి బాధ్యతలను.. 8వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జికి అప్పగించాలని సూచించింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ (ఆర్‌జీ) సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్‌ఎస్ దరఖాస్తు నోటీసు కాలం ముగియక ముందే హైకోర్టు ఆమోదం తెలపడం విశేషం.
తీర్పు వెంటనే రాజీనామా కలకలం
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం జడ్జిగా ఉన్న రవీందర్‌రెడ్డి.. మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తీర్పు ఇచ్చిన గంటలోపే ఆయన తన న్యాయాధికారి పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి (ఎంఎస్‌జే)కి లేఖ పంపడం కలకలం సృష్టించింది. అవినీతి ఆరోపణల వల్లే రవీందర్‌రెడ్డి రాజీనామా చేశారంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
అయితే రాజీనామా చేస్తే పదవీ విరమణ ప్రయోజనాలేవీ దక్కవని సన్నిహితులు చెప్పడంతో రవీందర్‌రెడ్డి పునరాలోచన చేశారు. తన పదవీ విరమణకు కొద్ది నెలలే గడువు ఉండటం, సర్వీసు పొడిగించే అవకాశాలు లేకపోవడంతో రాజీనామాకు బదులుగా... వీఆర్‌ఎస్ కోసం హైకోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని కమిటీ ఇటీవల సమావేశమై.. దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు రవీందర్‌రెడ్డి వీఆర్‌ఎస్‌ను ఆమోదిస్తూ.. ఉత్తర్వులు వెలువడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment