మక్కా మసీదు పేలుడు కేసులో ట్విస్ట్
హైదరాబాద్: మక్కా మసీదు బాంబు పేలుడు కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో సాక్షిగా ఉన్న జార్ఖండ్ వ్యవసాయ శాఖ మంత్రి రణధీర్ కుమార్ సింగ్ మాట మార్చారు. నాంపల్లి కోర్టులో ఈ నెల 18న వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసులో నిందితుడు కీలక సునీల్ జోషి ఎవరో తనకు తెలియదని కోర్టుకు తెలిపారు. సీబీఐ అధికారులు బలవంతపెట్టి గతంలో స్టేట్ మెంట్ తీసుకున్నారని చెప్పారు. దేవేందర్ గుప్తా అనే నిందితుడు ముస్లిం వ్యతిరేకి కాదని రణధీర్ పేర్కొన్నారు.
మక్కా మసీదులో 2007 మే 18న మధ్యాహ్నం 1.18 గంటల ప్రాంతంలో బాంబు పేలడంతో 9 మంది మృతి చెందారు. 50 మందిపైగా గాయపడ్డారు. ఈ కేసులో జోషి, గుప్తాతో పాటు తొమ్మిది మందిని నిందితులుగా సీబీఐ పేర్కొంది. తర్వాత ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ చేశారు.
'సునీల్ జోషి, దేవేందర్ గుప్తా తనకు తెలుసునని రణధీర్ చెప్పినట్టు సీబీఐ మొదటి చార్జిషీటులో పేర్కొంది. వారిద్దరూ తనకు సన్నిహితులని, తనింటికి తరచూ వస్తుండేవారని తెలిపారని వెల్లడించింది. గుప్తా చాలా ఆవేశపరుడని, ముస్లింల పట్ల అతడికి వ్యతిరేకభావం ఉందని కూడా అన్నట్టు తెలిపింది. అయితే జోషి ఎవరో తనకు తెలియదని, స్టేట్ మెంట్ పై సీబీఐ బలవంతంగా తనతో సంతకాలు పెట్టించిందని రణధీర్ తాజాగా పేర్కొన్నారు. అజ్మీర్ దర్గా పేలుడు కేసులోనూ గతేడాది ఆయన ఇదేవిధంగా మాట మార్చారు. జార్ఖండ్ వికాస్ మోర్చా నుంచి నిరుడు బీజేపీలో చేరిన ఆయన తర్వాత మంత్రి అయ్యారు.