తండాలకు మహర్దశ
- గిరిజన పల్లెలు ఇక పంచాయతీలు
- 500 జనాభా పైగా ఉన్న తండాల గుర్తింపు
- జిల్లాలో 142తండాలకు పంచాయతీ హోదా
- ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: నిత్యం సమస్యలతో సతమతమవుతున్న గిరిజన తండాలకు ఇక మహర్దశ కలగనుంది. వాటికి పంచాయతీ హోదా కల్పించడంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేయనున్నారు. ఈ మేరకు గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చుతామన్న ప్రభుత్వ హామీకి అనుగుణంగా జిల్లా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జిల్లాలో 500 మందికిపైగా జనాభా ఉన్న గిరిజన ఆవాసాలను గుర్తించారు. ‘మా తండాలో మా పాలన’ నినాదంతో గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చాలంటూ గిరిజన సంఘాలు డిమాండు చేస్తూ వస్తున్నాయి.
తండాలకు పంచాయతీ హోదా దక్కితే అధికార వికేంద్రీకరణ జరగడంతో పాటు పాలనలో పారదర్శకత సాధ్యమనే భావన వ్యక్తమవుతోంది. జిల్లాలో 1202 గిరిజన ఆవాసాలు ఉండగా, వీటిని మూడు కేటగిరీలుగా అధికారులు వర్గీకరించారు. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని 500 మంది లోపు జనాభా, 500 కంటే ఎక్కువ, వెయ్యి కంటే ఎక్కువ జనాభా కలిగి ఉన్న తండాలను గుర్తించారు.
మహబూబ్‌నగర్ రెవెన్యూ డివిజన్‌లోనే తండాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు నివేదిక వెల్లడిస్తోంది. గ్రామ పంచాయతీ, రెవెన్యూ విభాగాల సహకారంతో నివేదిక సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 1329 గ్రామ పంచాయతీలు, 13566 వార్డులు ఉన్నాయి. జిల్లా జనాభాలో 8.99 శాతంగా ఉన్న గిరిజనులకు 151 గ్రామ పంచాయతీలు, 1384 వార్డులను ప్రత్యేకించారు. 500 జనాభా పైబడిన గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తిస్తే జిల్లాలో 142 గిరిజన తండాలకు పంచాయతీహోదా దక్కుతుంది.
సమస్యలతో సతమతం
జన జీవన స్రవంతికి దూరంగా విసిరేసినట్లు ఉంటున్న గిరిజనతండాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. విద్య, వైద్యం, మురుగు కాల్వలు, విద్యుత్ వంటి మౌలిక సమస్యలు తాండవిస్తున్నాయి. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో నిత్యావసరాల కోసం సమీప గ్రామాలకు కిలోమీటర్ల కొద్దీ నడవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమల్లో ఉన్నా జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తుండటంతో కొద్ది సంఖ్యలో జనాభా వున్న తండాలను పట్టించుకునే పరిస్థితి లేదు. నిధుల వినియోగంలోనూ పారదర్శకత ఉండటం లేదనే విమర్శలొస్తున్నాయి. పట్టణాలకు దగ్గరలో ఉండే గిరిజన తండాల వైపు మాత్రమే అధికారులు దృష్టి సారిస్తున్నారు. తండాలు పంచాయతీలుగా మారితే ‘స్థానిక’ పరిపాలనలో తమ భాగస్వామ్యం పెరుగుతుందన్న ఆశ గిరిజనల్లో వ్యక్తమవుతోంది. తండాల వారీగా గిరిజన జనాభా వివరాలను ప్రభుత్వానికి పంపించామని..పంచాయతీగా మార్చే నిర్ణయం ప్రభుత్వం చేతిలోనే ఉందని డీపీఓ రవీందర్ ‘సాక్షి’తో అన్నారు.