Panchayat Secretaries post
-
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకాలపై స్టే
సాక్షి, హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీలో అధికారులు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోలేదని హైకోర్టు ఆక్షేపించింది. తాము తదుపరి ఉత్తర్వులిచ్చేంత వరకు పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులివ్వొద్దని హైకోర్టు బుధవారం ఆదేశించింది. అయితే పోస్టుల భర్తీ ప్రక్రియను కొనసాగించుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ, నియామకపు ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, అధికారులు చట్ట నిబంధనలకు విరు ద్ధంగా వ్యవహరిస్తున్నారని, దీంతో ఈ మొత్తం వ్యవహారంలో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేయాలని కోరుతూ ఖమ్మం జిల్లాకు చెందిన బి.హరీశ్‌కుమార్, మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు సంబంధించి ప్రాథమిక కీపై 70 వేల మంది అభ్యంతరం వ్యక్తం చేశారన్నారు. అయితే వాటిని పట్టించుకో కుండా తుది కీ విడుదల చేయకుండా, అభ్యర్థుల ర్యాంకులు, మార్కులు వెల్లడించకుండానే ఎంపికైన వారి జాబితాను ప్రచురించారన్నారు. జాబితాలో ఒకే హాల్‌టికెట్ నంబర్ రెండు మూడు సార్లు పునరావృతమైందని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి, రిజర్వ్ కేటగిరీ, స్థానిక కేటగిరీల వారీగా మెరిట్ జాబితాను ప్రచురించలేదని వివరించారు. చట్ట నిబంధనలకు, సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా రిజర్వేషన్లు 50% మించాయని తెలిపారు. జనరల్ అభ్యర్థులకు 45%, రిజర్వ్డ్ అభ్యర్థులకు 55% రిజర్వేషన్లు కల్పించారన్నారు. ప్రభుత్వ తరఫు అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ, ఇప్పటికే నియామకపు ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ఒకరిద్దరు అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వ్యాజ్యాలు దాఖలు చేసినంత మాత్రాన మొత్తం ప్రక్రియను నిలిపేయాల్సిన అవసరం లేదని, మధ్యంతర ఉత్తర్వులివ్వాల్సిన అవసరం లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, జూ.పంచా యతీ కార్యదర్శుల పోస్టుల భర్తీలో అధికారులు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోలేదని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు మేర కు రిజర్వేషన్లు 50% దాటడానికి వీల్లేదని గుర్తుచేశారు. దీంతో తాము తదుపరి ఉత్తర్వులిచ్చేంత వరకు పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులివ్వొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అయితే పోస్టుల భర్తీ ప్రక్రియను కొనసాగించుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. -
‘తప్పులతడక’కు బాధ్యులెవరు..!
ఇందూరు : జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితా తప్పుల తడకగా మారింది. అధికారుల నిర్లక్ష్యం మూలంగా తాము ఉద్యోగం కోల్పోయామని ఇద్దరు అభ్యర్థులు మంగళవారం జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయానికి వచ్చి డీపీఓ సురేశ్‌బాబును కలిసి, ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరి కొన్ని విషయాలు బహిర్గతమయ్యాయి. చేసిం దంతా చేసి పైగా తమ తప్పేం లేదని పంచాయ తీ శాఖ అధికారులు పేర్కొనడం గమనార్హం. ఏపీపీఎస్సీ నుంచి నేరుగా వచ్చిన మెరిట్ మా ర్కుల జాబితాను ప్రదర్శించామని, ఆ జాబి తానే తప్పుగా ఉందంటూ ఏపీపీఎస్సీని తప్పుబ ట్టారు. మరో మాటగా అభ్యర్థులు కూడా దరఖా స్తు చేసుకునే సమయంలో తప్పుగా భర్తీ చేయ డం మూలంగా కూడా ఇలా జరిగిందని, వారు చేసిన తప్పుకు తామెందుకు బాధ్యత వహించాలన్నట్లుగా డీపీఓ సురేశ్‌బాబు ‘సాక్షి’తో ఫోన్లో చెప్పారు. మహిళకు సంబంధించిన కేటగిరిలో మహేష్ కూమార్ అనే అభ్యర్థి ఎంపికైనట్లు జాబితాలో చేర్చడం ఏంటని ప్రశ్నించగా, సదరు అభ్యర్థి దరఖాస్తు చేసుకునే సమయంలో తన జెండర్‌ను ఫిమెయిల్‌గా ఎంచుకుని ఉండవచ్చని, కాగా ఫొటోను కూడా గుర్తు పట్టలేకపోయామని సమాధానం ఇచ్చారు. ఇటు ఓసీకి చెందిన బి. నవనీత అనే అభ్యర్థినికి బీసీ-ఏ కేటగిరిలో ఎలా ఎంపిక చేస్తారని అడగ్గా ఏపీపీఎస్సీ నుంచి అలా తప్పుగా వచ్చిందని చెప్పారు.దీంతో ఇంతకు ఎవరు తప్పు చేశారో.. దీనికి ఎవరు బాధ్యత వహించాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఈ విషయం సదరు అభ్యర్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా మళ్లీ డీపీఓ సురేశ్‌బాబుకు రిఫర్ చేశారు. కసరత్తులో అధికారులు ఏం చేసినట్లు..? అభ్యర్థుల ఎంపిక జాబితాలో జరిగిన తప్పులకు తమ తప్పేం లేదని ఏపీపీఎస్సీ అధికారులపై, ఇటు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులే కారణమని ఆరోపిస్తున్న అధికారులు మరీ ఇన్ని రోజులుగా చేసిన కసరత్తులో ఏం చేసినట్లు..? గత నాలుగైదు నెలలుగా కసరత్తు పేరుతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఆలస్యం చేసిన అధికారులు ఎంపిక విషయంలో పక్కాగా ఎందుకు చేపట్టలేకపోయారు..? దీని వెనుక ఏమైనా ప్రలోభాలున్నాయా...? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మెరిట్ జాబితా ప్రకటించిన అనంతరం మార్కులు, రోస్టర్ పాయింట్‌ను కలుపుకుని అభ్యర్థులను ఎంపిక చేసిన అధికారులు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఒకటికి రెండు సార్లు చూసుకుని, జల్లెడ పట్టి మరీ అసలైన అభ్యర్థులను ఎంపిక చేయాల్సిన కసరత్తులో పెద్ద తప్పులు ఎలా దొర్లాయో అంతుచిక్కడం లేదు. బాధిత అభ్యర్థులు తమకు అన్యాయం జరిగింది మహాప్రభో అని అధికారులకు మొరపెట్టుకుంటే తప్ప, అసలు విషయం తెలియలేదా...? అని బాధిత అభ్యర్థులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేసిన తరువాత జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని డీపీఓ సురేశ్‌బాబు తెలిపారు.