
సాక్షి, హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీలో అధికారులు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోలేదని హైకోర్టు ఆక్షేపించింది. తాము తదుపరి ఉత్తర్వులిచ్చేంత వరకు పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులివ్వొద్దని హైకోర్టు బుధవారం ఆదేశించింది. అయితే పోస్టుల భర్తీ ప్రక్రియను కొనసాగించుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ, నియామకపు ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, అధికారులు చట్ట నిబంధనలకు విరు ద్ధంగా వ్యవహరిస్తున్నారని, దీంతో ఈ మొత్తం వ్యవహారంలో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేయాలని కోరుతూ ఖమ్మం జిల్లాకు చెందిన బి.హరీశ్‌కుమార్, మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు సంబంధించి ప్రాథమిక కీపై 70 వేల మంది అభ్యంతరం వ్యక్తం చేశారన్నారు. అయితే వాటిని పట్టించుకో కుండా తుది కీ విడుదల చేయకుండా, అభ్యర్థుల ర్యాంకులు, మార్కులు వెల్లడించకుండానే ఎంపికైన వారి జాబితాను ప్రచురించారన్నారు.
జాబితాలో ఒకే హాల్‌టికెట్ నంబర్ రెండు మూడు సార్లు పునరావృతమైందని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి, రిజర్వ్ కేటగిరీ, స్థానిక కేటగిరీల వారీగా మెరిట్ జాబితాను ప్రచురించలేదని వివరించారు. చట్ట నిబంధనలకు, సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా రిజర్వేషన్లు 50% మించాయని తెలిపారు. జనరల్ అభ్యర్థులకు 45%, రిజర్వ్‌డ్ అభ్యర్థులకు 55% రిజర్వేషన్లు కల్పించారన్నారు. ప్రభుత్వ తరఫు అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ, ఇప్పటికే నియామకపు ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ఒకరిద్దరు అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వ్యాజ్యాలు దాఖలు చేసినంత మాత్రాన మొత్తం ప్రక్రియను నిలిపేయాల్సిన అవసరం లేదని, మధ్యంతర ఉత్తర్వులివ్వాల్సిన అవసరం లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, జూ.పంచా యతీ కార్యదర్శుల పోస్టుల భర్తీలో అధికారులు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోలేదని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు మేర కు రిజర్వేషన్లు 50% దాటడానికి వీల్లేదని గుర్తుచేశారు. దీంతో తాము తదుపరి ఉత్తర్వులిచ్చేంత వరకు పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులివ్వొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అయితే పోస్టుల భర్తీ ప్రక్రియను కొనసాగించుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment