గ్రామ పంచాయతీల పనితీరు మెరుగుపడాలి
కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి విజయానంద్
హైదరాబాద్: దేశాభివృద్ధిలో కీలకమైన గ్రామాలు తమ పని తీరును మెరుగు పరుచుకోవాలని, అందుకు ప్రభుత్వాలు నిధులు కేటాయించాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి విజయానంద్ పేర్కొన్నారు. టీఎస్ ఐపార్డ్లో (గతంలో ఆపార్డ్) గురువారం పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. పంచాయతీలకు నేరుగా నిధులను కేటాయించే పద్ధతిని కేంద్రం ప్రవేశ పెట్టిందని, ఇందుకు రూ. 2 లక్షల కోట్లు బడ్జెట్లో కేటాయించిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
గ్రామ పంచాయతీలు గ్రామ సభలను నిర్వహించి పారిశుధ్యం, విద్య, ఆరోగ్యం తదితర 22 అంశాలకు నిధులను కేటాయించిపనులను చేపట్టాలని సూచించారు. టీఎస్ ఐపార్డ్ కమిషనర్ అనితా రామచంద్రన్ మాట్లాడుతూ మన ఊరు-మన ప్రణాళిక ప్రవేశపెట్టి అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రం చేపడుతోందన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ పాల్గొన్నారు.