పంచాయతీ ‘ఉప’ ఎన్నికలకు రెడీ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: వివిధ కారణాలతో గత ఏడాది జూన్‌లో ఎన్నికలు నిలిచిపోయిన రెండు గ్రామ పంచాయతీలకు ఈ నెల 18న ఎన్నికలకు జరగనున్నాయి. ఈ మేరకు జిల్లా పంచాయతీ కార్యాలయం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు పూర్తి చేసింది. మరణాలు, రాజీనామాలతో ఖాళీగా ఉన్న 21 పంచాయతీ వార్డులకు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఈ ఎన్నికలకు ఈ నెల మూడో తేదీ నుంచి ఆరు వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
పంచాయతీ పోరు ఇప్పుడెందుకంటే...
గత ఏడాది జూన్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సంగారెడ్డి మండలం చింతల్‌పల్లి పంచాయతీ సర్పంచ్ పదవిని ఎస్టీలకు రిజర్వు చేశారు. అయితే అర్హులైన ఎస్టీ ఓటర్లు ఎవరూ పంచాయతీ పరిధిలో సర్పంచ్ పదవికి నామినేషన్లు దాఖలు కాలేదు. కౌడిపల్లి మండ లం రాయిలాపూర్‌లో సర్పంచ్ పదవికి ఇద్దరు నామినేషన్లు వేసినా పరిశీలనలో అవి తిరస్కరణకు గురయ్యాయి. ఇక రాయిలాపూర్‌లో 5వ వార్డులు, చింతపల్లిలో ఒక వార్డుకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఇటీవలి కాలంలో జిల్లాలోని ముగ్గురు వార్డు సభ్యులు మరణించగా, మరో ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో జిల్లాలో మొత్తం 21 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. కలెక్టర్ స్మితా సబర్వాల్ పరిశీలనలో వున్న ఫైలు ఆమోదం పొందిన వెంటనే మూడో తేదీన నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది.