నేడే ‘పంచాయతీ’ పరీక్ష
ఏర్పాట్లు చేసిన అధికారులు
ఉదయం 10:00 గంటలకు మొదటి పేపర్
మధ్యాహ్నం 2 గంటలకు రెండవ పేపర్
హాజరుకానున్న అభ్యర్థులు 23,418 మంది
సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు
ఇందూరు, న్యూస్‌లైన్ :
ఏపీపీఎస్సీ ద్వారా జిల్లాకు మం జూరైన 66 పంచాయతీ కార్యదర్శి పో స్టులకు సంబంధించి పరీక్ష ఆదివారం జరగనుంది. మొదటి పేపర్ ఉదయం 10:00 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:30 గంటలకు ముగుస్తుంది. రెండవ పేపర్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.30గంటలకు ముగుస్తుం ది. మొత్తం 23,418 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. జిల్లాలో కేంద్రంలో తొమ్మిది రూ ట్లుగా విభజించి మొత్తం 51 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో 250 మంది నుంచి 800 మంది వరకు పరీక్ష రాసేవీలుంది.
గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థుల సౌకర్యార్థం ఆర్టీసీ ఉదయం పూట అదనపు బస్సులను నడుపుతుంది. పరీక్ష నిర్వహణ కోసం 1,100 మంది ఇన్విజిలేటర్లను, ప్రతి సెంటర్‌కు ఒకరు చొప్పున మొత్తం 51మంది చీఫ్ సూపరింటెండెంట్లను, ప్రతి మూడు సెంటర్లకు ఒకరు చొప్పున మొత్తం 18 మంది లైజన్ అధికారులను, మరో 54 మంది అసిస్టెంట్ లైజన్ అధికారులను అధికార యంత్రాంగం నియమించింది. జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర రావు, ఏజేసీ శేషాద్రిలతో పాటు ఆర్డీఓలు, ఇతర ఉన్నతాధికారులు పరీక్ష కేంద్రాలను పర్యవేక్షిస్తారు. పరీక్ష జరిగే కేంద్రానికి సంబంధించిన విద్యా సంస్థల యాజమాన్యం, సిబ్బంది, ఇతర వ్యక్తులు ఎవరిని కూడా లోనికి అనుమతించడంలేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. పరీక్షల నిర్వహణ కోసం ప్రభుత్వం జిల్లాకు రూ. 6 లక్షలను కేటాయించింది.అదే విధంగా పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు నిర్వహిస్తోంది.144 సెక్షన్ విధించడంతో పాటు చుట్టు పక్కల జిరాక్స్ సెంటర్లను మూసి వేయాలని ఇది వరకే ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో సెంటర్ వద్ద ఇద్దరు నుంచి ముగ్గురు పోలీసులు విధులు నిర్వహిస్తా రు. ఎస్సైలు, సీఐలు తమ పరిధిలోని కేంద్రాలను పర్యవేక్షిస్తారు. డీఎస్పీలు, జిల్లా ఎస్పీ పరీక్ష కేంద్రాలను పరిశీలిస్తారు. సమస్యాత్మక ప్రాం తాల్లో పోలీసు పికెట్లను ఏర్పాటు చేయనున్నారు.
ప్రత్యేక బస్సులు
నిజామాబాద్ నాగారం : పంచాయతీ కార్యదర్శి పరీక్ష రాసే అభ్యర్థుల సౌకర్యార్థం ఆదివారం 40 బస్సులను అదనంగా నడుపుతున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం కృష్ణకాంత్ తెలిపారు. 36 మండలాలకు ఒక్కో బస్సును కేటాయించామని, అవసరమైన చోట మరో నాలుగు బస్సులు నడుపుతామన్నారు.
ఐదు నిమిషాల వరకు అనుమతి
పంచాయతీ కార్యదర్శి పరీక్ష రాసే అభ్యర్థులు గంట ముందుగానే సంబంధిత పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి సురేశ్బా బు సూచించారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఐదు నిమిషాల వరకు ఎవరైనా ఆలస్యంగా వస్తే లోనికి అనుమతిస్తామన్నారు. ఆ తర్వాత ఎవరికీ లోనికి అనుమతి ఉండదన్నారు.
అభ్యర్థులకు పలు సూచనలు...
ఓఎంఆర్ షీట్‌పై అనవసర రాతలు రాయవద్దు. మరో షీట్ ఇవ్వబడదు.
పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్, కాలుక్యులేటర్ ఇతర ఎలాంటి ఎలాక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లరాదు.
పరీక్ష రాసేందుకు బ్లూ, బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే వాడాలి. జెల్ పెన్ గానీ పెన్సిల్ గాని ఉపయోగించరాదు.
జవాబు పత్రంలో సైడ్-1లో ఇచ్చిన స్థలంలో అభ్యర్థి సంతకం చేయాలి.
మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన వారిపై కేసు నమోదు చేస్తారు.