panchayathi secretory
-
పంచాయతీ సెక్రటరీలకూ బదిలీల పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలకు ఉద్యోగుల విభజనలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యదర్శుల బదిలీల ప్రక్రియ మలుపులు తిరుగుతోంది. కొన్ని జిల్లాల్లో పనిచేస్తున్న కార్యదర్శులకు ఒకలా, మరికొన్ని జిల్లాల్లో ఇంకోలా కేటాయింపులు, పోస్టింగ్‌లు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రాంతాలకు పోస్టింగుల వల్ల కుటుంబాలకు దూరమై వ్యయ, దూరభారాలు ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోతున్నారు. మే, జూన్‌ల్లో సాధారణ బదిలీలు చేసే దాకా పాత స్థానాల్లోనే డిప్యూటేషన్‌పై కొనసాగేలా ఉత్తర్వులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కొన్నిజిల్లాల్లో ఔట్సోర్సింగ్ కార్యదర్శుల ఔట్ ఉమ్మడి మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లా ల్లోని పలువురు పంచాయతీ సెక్రటరీలను సాధారణ బదిలీలు జరిగే దాకా పాత జిల్లాల్లోనే డిప్యూటేషన్‌పై పనిచేసేలా తాజాగా ఉత్తర్వులిచ్చారు. అయితే ఇప్పటివరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న పలువురిని నిజామాబాద్, తదితర జిల్లాలకు బదిలీ చేయడంతో కుటుంబాలకు దూరంగా తాము ఇబ్బందిపడుతున్నామని వారు వాపోతున్నారు. మరోవైపు దాదాపు ఏడాది కిందట వివిధ జిల్లాల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 800 మంది వరకు గ్రామ పంచాయతీ సెక్రటరీలను నియమించగా వీళ్లలో నిజామాబాద్ జిల్లాలో70 మంది, నిర్మల్ జిల్లాలో 40 మందిని తాజాగా తొలగించారు. ప్రస్తుత బదిలీలు, కేటాయింపుల్లో భాగంగా వీళ్లు పనిచేస్తున్న పంచాయతీల్లో పలువురు గ్రేడ్–1, 2, 3 సెక్రటరీలను నియమించినట్లు తెలుస్తోంది. గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శులను గ్రేడ్–1 గ్రామాలకు కాకుండా ఔట్ సోర్సింగ్ సెక్రటరీలు పనిచేస్తున్న గిరిజన తండాలు, మారుమూల ప్రాంతాలకు బదిలీ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. -
ఈ సర్కార్ నౌకరీ మాకొద్దు!
పెద్దపల్లిరూరల్: పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాన్ని సంపాదించామన్న ఆనందాన్ని చాలా మంది ఉద్యోగులు నిలుపుకోలేక వాటికి రాజీనామాలు చేసి ఇతర ఉద్యోగాల వైపు చూస్తున్నారు. ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల పదవులను ప్రభుత్వం భర్తీ చేయడంతో అర్హత గల వారంతా ఆయా ఉద్యోగాలను దక్కించుకున్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం అమలయ్యే నిబంధనలు కఠినతరంగా ఉండడం, విధులు నిర్వహణలో ఒత్తిడి అధికం కావడంతో వాటిని వదులుకునేందుకే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో 263 పంచాయతీలు ఉండగా, ఇందులో 57 మంది రెగ్యూలర్ పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. వీటికి తోడు 198 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా విధుల్లో చేరారు. అందులో 20 మంది పంచాయతీ కార్యదర్శులు తమ అవసరాలను బట్టీ పదవులను వదులుకుంటున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు రాజీనామా లేఖలను సమర్పించారు. ఆన్లైన్ అనుమతులతో అవస్థలు.. నూతన పంచాయతీరాజ్ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఆన్లైన్ పద్ధతినే అనుమతులు ఇవ్వాల్సి ఉండడం కూడా ఇబ్బందులకు కారణంగా పేర్కొంటున్నారు. గ్రామపంచాయతీ జనాభా కొత్తగా ఇళ్లు నిర్మించే స్థలం తదితర వివరాలకు అనుగుణంగా ఆన్లైన్లో అనుమతులను ఇవ్వాల్సి ఉంటుందని ఈ విషయమై జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా చేరిన తమకు అవగాహన పెంచేలా శిక్షణ తరగతుల ను నిర్వహించాల్సిన అవసరం ఉంటుందన్నా రు. గ్రామంలో వార్డుసభ్యుడు మొదలు సర్పం చ్, ఎంపీటీసీతోపాటు రాజకీయ పార్టీల నాయకులు, గ్రామపెద్దలు తమ తమ అవసరాల నిమిత్తం పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడిని పెంచి తాము చెప్పినట్టే మసులుకోవాలని హుకూం జారీ చేస్తున్నారని వాపోతున్నారు. ఒత్తిడిని తట్టుకోలేక రాజీనామాలు.. పంచాయతీరాజ్ కొత్త చట్టం అమలుతో బాధ్యతలు పెరగడంతోపాటు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఒత్తిడిలు విపరీతంగా పెరగడంతో ఈ ఉద్యోగాన్ని వదిలి మరో ఉద్యోగం చూసుకోవడం మేలంటూ కుటుంబీకుల నుంచి సూచనలు అందుతున్న కారణంగానే పలువురు పంచాయతీ కార్యదర్శులు ఇతర ఉద్యోగాల్లో చేరేందుకు రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తుంది. గ్రామాల్లో అనేక రకాల సమస్యలు, సవాళ్లు ఒకేసారి చుట్టు ముట్టుతుండడంతో వాటిని తట్టుకోలేక మానసిక ఇబ్బందులకు గురవుతున్నారని కొద్దిరోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డ స్రవంతి ఉదంతమే ఇందుకు నిదర్శనంగా పలువురు పేర్కొంటున్నారు. 20 మంది కార్యదర్శుల రాజీనామా... జిల్లాలో పంచాయతీ కార్యదర్శులుగా చేరిన వారిలో 20 మంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. వారిలో చాలా మంది ఇతర శాఖల్లో ఉద్యోగాలు రావడంతో పనిభారం అధికంగా ఉండడంతోపాటు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఒత్తిడి తట్టుకోలేక తమ ఉద్యోగాలను వదులుకున్నట్లు తెలుస్తోంది. పెద్దపల్లి మండలంబ్రాహ్మణపల్లి, పెద్దబొంకూరు గ్రామపంచాయతీ కార్యదర్శులతోపాటు అంతర్గాం మండలం ఎల్లంపల్లి, ఎలిగేడు మండలంలోని లాలపల్లి, కాల్వశ్రీరాంపూర్ మండలం చినరాత్పల్లి, సుల్తానాబాద్ మండలం కందునూరిపల్లి, మంథని మండలం గోపాల్పూర్, నాగెపల్లి, అక్కెపల్లి, కన్నాల, ముత్తారం మండలం దర్యాపూర్, కమ్మంపల్లి, ఓదెల మండలం గుంపుల, గుండ్లపల్లి, కొలనూర్, పాలకుర్తి మండలం జయ్యారం, రామగిరి మండలం సుందిళ్ల, చందనాపూర్, ఆదివరంపేటకు చెందిన కార్యదర్శులు తమ పదవులకు రాజీనామా చేశారు. శిక్షణ ఇవ్వకుండానే విధులా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని అమలులోకి తెచ్చి వాటి నిర్వహణ బాధ్యతలను పంచాయతీ సర్పంచ్, కార్యదర్శులకే కట్టబెట్టడం సమంజసం కాదని పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు పేర్కొంటున్నారు. కొత్తగా విధుల్లో చేరిన తమకు తమ విధులు, బాధ్యతల గురించి ఏమాత్రం అవగాహన లేదని, తమకు వృత్యంతర శిక్షణను ఇప్పించి నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని కోరుతున్నారు. పంచాయతీ కార్యదర్శి గ్రామ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అనుసం ధాన కర్తగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. ప్రజలతో పాటు ప్రజాప్రతినిధుల ఒత్తిడిలతోపాటు ఉన్నతాధికారులు కూడా తమనే బాధ్యులుగా చేస్తుండడంతో విధి నిర్వహణలో తాము ఉక్కిరిబిక్కిరి కావాల్సి వస్తుందని పలువురు పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు. -
కలెక్టరేట్ ఎదుట పంచాయితీ సెక్రటరీల బైఠాయింపు
సాక్షి, నాగర్‌కర్నూల్: రోజూ తమతోపాటు విధుల్లో పాల్గొన్న సహ ఉద్యోగిని అచేతన స్థితిలో పడి ఉండడాన్ని పంచాయతీ కార్యదర్శులు జీర్ణించుకోలేపోయారు. తమ సహ ఉద్యోగిని కుటుంబానికి న్యాయం చేయాలంటూ కదంతొక్కా రు. నాగర్‌కర్నూల్‌కు చెందిన స్రవంతి తిమ్మాజిపేట మండలంలో గుమ్మకొండ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తుంది. ఈ క్రమంలో పని ఒత్తిడి తట్టుకోలేక పురుగు మందుతాగి చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందింది. కాగా శనివారం సాయంత్రం స్రవంతి మృతదేహాన్ని నాగర్‌కర్నూల్‌కు అంబులెన్స్‌లో తీసు కువచ్చారు. అప్పటికే డీపీఓ కార్యాలయం వద్ద వేచి ఉన్న జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు ఆమె మృతదేహంతో కలెక్టరేట్‌కు వెళ్లి ధర్నా నిర్వహించారు. అంతకు ముందు పంచాయతీ కార్యదర్శులు మండల పరిషత్ కార్యాలయం నుండి డీపీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి డీపీఓ సురేష్‌మోహన్‌కు వినతిపత్రం అందజేశారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి, పిల్లల పోషణ ప్రభుత్వమే భరించాలని వినతిలో కోరారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా స్రవంతి మృతదేహాన్ని తీసుకువచ్చిన అంబు లెన్స్, అనాథలుగా మారిన స్రవంతి పిల్లలను కలెక్టరేట్ ఎదుట పెట్టి పంచాయతీ కార్యదర్శులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు టీఎన్జీఓ నాయకులు, పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు మద్దతు తెలిపారు. దాదా పు రెండు గంటలపాటు ధర్నా నిర్వహించినా ఒక్క అధికారి కూడా స్పందించలేదు. అయితే కలెక్టర్ సీసీ అక్కడికి వచ్చి కలెక్టర్ ఆదేశాల మేరకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఒప్పుకోలేదు. కలెక్టర్, డీపీఓ స్వయంగా రావాలంటూ నినాదాలు చేశారు. కొద్దిసేపటి తర్వాత డీఆర్ఓ మధుసూదన్‌నాయక్ అక్కడికి వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కుటుంబాన్ని ఆదుకుంటా మని, పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలలో చదివిస్తాని చెప్పినా పంచాయతీ కార్యదర్శులు ఒప్పుకోలేదు. ఎక్స్‌గ్రేషియా విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. రాత్రి 10.15 గంటల ప్రాంతంలో జేసీ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్ఓ వచ్చి ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే టీఎన్జీఓ తరఫున రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. దిక్కులేని వారైన పిల్లలు స్రవంతి మృతితో తన ఇద్దరు పిల్లలు దిక్కులేని వారయ్యారు. స్రవంతి భర్త గత 8 నెలల క్రితమే నాగర్‌కర్నూల్ పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అనంతరం పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించిన స్రవంతి పిల్లలు రోహన్ (రెండో తరగతి), అనుకృతి (మూడో తరగతి)ని చదివిస్తుంది. ఈ క్రమంలో స్రవంతి మృతిచెందడంతో పిల్లలు అనాథలుగా మారారు. కలెక్టరేట్ ముందు పిల్లలతో ధర్నా చేస్తుండడంతో ఏం జరగుతుందో తెలియని పసిపిల్లల ముఖాలు చూసిన ప్రతిఒక్కరి మనసు కలచివేసింది. -
రెండు ఉద్యోగాలు సాధించిన నెమ్మికల్ వాసి
ఆత్మకూర్ (ఎస్) : మండల పరిధిలోని నెమ్మికల్ గ్రామానికి చెందిన మహిళ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో రెండు ఉద్యోగాలు సాధించి తన సత్తాచాటింది. గ్రామానికి చెందిన జటంగి సువర్ణ ఎంఎస్సీ, బీఈడీ చేసింది. అయితే గత ఏడాది జరిగిన గురుకుల సైన్స్ టీచర్, పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు దరఖాస్తు చేసి పరీక్షలు రాసింది. అయితే ఆమె రాసిన రెండు ఉద్యోగాలకు ఎంపిక కావడం గమనార్హం. ఈమె 1నుంచి 12వ తరగతి వరకు నెమ్మికల్‌లో, డిగ్రీ సూర్యాపేటలో, ఎంఎస్సీ, బీఈడీ ఉస్మానియా యూనివర్సిటీలో చేసింది. గ్రామానికి చెందిన సువర్ణ ఒకేసారి రెండు ఉద్యోగాలకు ఎంపిక కావడంతో గ్రామస్తులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఇక పల్లెల్లోనే వివాహ రిజిస్ట్రేషన్లు
భైంసాటౌన్(ముథోల్): ఇప్పటివరకు వివాహ రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. పట్టణాలతో పాటు మారుమూల గ్రామాల్లో జరిగే వివాహాలను సైతం ఈ కార్యాలయాల్లోనే నమోదు చేసుకోవాల్సి వచ్చేది. దీంతో వారికి దూరభారంతోపాటు వ్యయభారం తప్పేది కాదు. దీంతో చాలామంది వివాహ నమోదు చేసుకునేవారు కాదు. అయితే తెలంగాణ ప్రభుత్వం షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాలను ప్రవేశపెట్టిన తరువాత చాలామంది వివాహ నమోదుకు ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే ఈ పథకాల కింద అందిస్తున్న ఆర్థిక సాయం పొందాలంటే లబ్ధిదారులు ఖచ్చితంగా వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జతచేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వారు వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కోసం రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇకపై గ్రామాల్లోనూ వివాహాల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. పంచాయతీ కార్యదర్శులే వివాహ నమోదు చేయాలని ఈ మేరకు ఆదేశించింది. గ్రామాల్లో జరిగే ప్రతీ వివాహాన్ని రిజిస్టర్ చేయాలన్న కొత్త పంచాయతీరాజ్ చట్టం నిబంధనల మేరకు ఈనెల నుంచి కొత్త విధానం అమలులోకి రానుంది. దీంతో గ్రామవాసులకు వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ సులభంగా అందనుంది. పెళ్లయిన మరుసటి రోజే.. కొత్త పంచాయతీ రాజ్ చట్ట నిబంధనల నేపథ్యంలో మార్చి నుంచి ఈ కొత్త విధానం అమలులోకి రానుంది. గ్రామపరిధిలో జరిగే ప్రతీ వివాహాన్ని రిజిస్టర్ చేయాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులకు కట్టబెట్టారు. ఇదివరకు గ్రామ కార్యదర్శులు ఆ గ్రామంలో జరిగే వివాహాలు నమోదు చేసుకుని తెల్ల కాగితాలపై ధ్రువపత్రం జారీ చేసేవారు. దీని ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహ ధ్రువపత్రం జారీ చేసేవారు. కానీ ఇకపై గ్రామాల్లోనే వివాహ సర్టిఫికెట్ జారీ చేసేలా చర్యలు చేపడుతున్నారు. ఏదైనా వివాహం జరిగిన మరుసటి రోజే సర్టిఫికెట్ జారీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు పంచాయతీ కార్యాలయాల్లో ఇందుకోసం ఒక విభాగం ఏర్పాటు చేయనున్నారు. పం చాయతీ కార్యదర్శులకు సైతం శిక్షణ ఇవ్వనున్నారు. పెళ్లయిన జంట వారి ఆధార్‌కార్డు, వివాహ ఆహ్వాన పత్రిక, ఫొటోలు, ముగ్గురు సాక్షుల సంతకాలతో పంచాయతీ కార్యాలయంలో సంప్రదిస్తే పంచాయతీ కార్యదర్శి పరిశీలించి వివాహ సర్టిఫికెట్ జారీ చేస్తారు. బాల్యవివాహాలకు అడ్డుకట్ట గ్రామాల్లోనే వివాహ రిజిస్ట్రేషన్ చేయాలన్న నిర్ణయంతో ప్రధానంగా బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడనుంది. కల్యాణలక్ష్మి పథకం కింద లబ్ధి పొందాలంటే వివాహ నమోదు తప్పనిసరి. 18ఏళ్లు నిండని మైనర్లకు పెళ్లి చేస్తే అధికారులు వివాహ నమోదు చేయరు. దీంతో కల్యాణలక్ష్మి పథకానికి వారు అనర్హులవుతారు. ప్రభుత్వం అందించే ఆర్థికసాయానికి దూరమవుతారు. దీని వల్ల బాల్యవివాహాలకు అడ్డుకట్టు పడే అవకాశం ఉంది. 396కు 74 మందే కార్యదర్శులు జిల్లావ్యాప్తంగా 396 గ్రామపంచాయతీలు ఉండగా కేవలం 74 మంది మాత్రమే పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. దీంతో వారికి ఈ బాధ్యతలు అదనం. రాష్ట్రప్రభుత్వం ఇటీవలే పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు రాతపరీక్షలు నిర్వహించి ఎంపిక చేసినా.. ఇంకా భర్తీ ప్రక్రియ జరగలేదు. దీంతో ఒక్కొక్కరికి ఐదు పంచాయతీల బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది. కొన్ని గ్రామపంచాయతీల్లో ఒకటి నుంచి రెండు అనుబంధ గ్రామాలు సైతం ఉన్నాయి. వచ్చేది పెళ్లిళ్ల సీజన్.. దీంతో వివాహ రిజిస్ట్రేషన్లలో పంచాయతీ కార్యదర్శుల కొరత కారణంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదు. పనిభారంతో.. జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు కొరత కారణంగా ఇప్పటికే ఒక్కొక్కరికి ఐదు పంచాయతీల చొప్పున బాధ్యతలు అప్పగించారు. ఆయా గ్రామపంచాయతీల పరిధిలో ఇంకుడుగుంతల నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణం, పన్నుల వసూలు, జనన, మరణాల నమోదు, ఆదాయ, వ్యయాలు, గ్రామసభలు, పంచాయతీ సమావేశాలు నిర్వహించడం, నీటిసమస్య, మురికికాల్వలు, వీధిదీపాలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి బాధ్యతలతో పంచాయతీ కార్యదర్శులకు పనిభారం అవుతోంది. దీనికి తోడు వచ్చేది వేసవి కావడంతో ఆయా గ్రామాల్లో మంచినీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఒక్కొక్కరికి ఐదేసి పంచాయతీల బాధ్యతలు ఉండడంతో వారికి పనిభారం తప్పేలా లేదు. ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులకు వివాహ రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగించడంతో మరింత పనిభారం పడుతుందని వారు పేర్కొంటున్నారు. నమోదుకు చర్యలు తీసుకుంటాం గ్రామాల్లోనే వివాహ రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశించింది. ప్రస్తుతం జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల కొరత ఉంది. ప్రభుత్వం ఇదివరకే పంచాయతీ కార్యదర్శుల భర్తీకి పరీక్షలు నిర్వహించింది. ఎంపికైన నూతన కార్యదర్శులతో భర్తీ చేస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న సిబ్బందికే ఇన్చార్జి బాధ్యతలు అప్పగించాం. గ్రామాల్లోనే వివాహ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. – శ్రీనివాస్, డీపీవో, నిర్మల్ -
పంచాయతీ సెక్రటరీ నియామకాలపై హైకోర్టు సీరియస్
హైదరాబాద్: జూనియర్ పంచాయతీ సెక్రటరీ నియామకాల్లో స్పోర్ట్స్, వికలాంగుల కోటాని విస్మరించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై బుధవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. 95 శాతం స్పోర్ట్స్, వికలాంగుల వాటా సరి చేసిన తర్వాతే మళ్లీ ఫలితాలను విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ సెక్రటరీ నియామకాలపై స్టే ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ప్రశ్నాపత్రంలో దొర్లిన తప్పులపై, 14 ప్రశ్నలను తెలుగులో కాకుండా ఇంగ్లీష్‌లో ఇవ్వడంపై కూడా పూర్తి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. చేసిన తప్పులను ఒప్పుకోకుండా ఎందుకు మేనేజ్ చేస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు అనుమతి లేకుండా నియామక పత్రాలను ఇవ్వవద్దని హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. -
తాగడానికి గుక్కెడు నీరు కరువాయే..!
సాక్షి, గండేడ్: వేసవి రాకముందే పల్లెల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి మొదలయింది. ఏటా మే, జూన్ నెలల్లో తాగునీటి సమస్య ప్రారంభమయ్యేది. కానీ ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురవకపోవడంతో భూగర్భజలాలు తగ్గిపోయి తాగునీటికి తీవ్ర సమస్యలు మొదలయ్యాయి. మండలంలోని 24 పాత గ్రామ పంచాయతీలు ఉండగా మరో 25 నూతన గ్రామపంచాయతీలు ఏర్పడ్డాయి. అలాంటి గ్రామ పంచాయతీల్లో సహితం తాగునీటికి ఎన్నో ఇబ్బందులు ఉన్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకున్న పాపానపోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు. మండలంలోని నంచర్ల, కొంరెడ్డిపల్లి, దేశాయిపల్లి, జూలపల్లి, రుసుంపల్లి, వడ్డెగుడిసెలు, గండేడ్ తదితర గ్రామాల్లో మాత్రం తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో తాగునీటికోసం కాలనీల్లో ఎన్నో బోర్లు వేసినా వాటిలో నీరులేక ఎండిపోయాయి. మండలంలో 150కి పైగా త్రీఫేజ్ బోరుమోటార్లు ఉండగా వాటిలో సగానికి పైగా నీరులేక పనిచేయడంలేదు. ఆయా గ్రామాల్లో సుమారు 400లకు పైగా సింగిల్‌ఫేజ్ బోరుమోటార్లు ఉండగా వాటిలో 250లోపు మాత్రమే పనిచేస్తున్నాయి. దీంతో గ్రామాల్లోని ప్రజలకు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు కలగడంతో వ్యవసాయ బోర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఎంతోదూరం వెళ్లి తాగునీరు, వినియోగించేందుకు తెచ్చుకొని కాలం వెళ్లదీస్తున్నారు. పట్టించుకోని అధికారులు, కార్యదర్శులు సర్పంచ్ల పదవీకాలం ముగిసి మూడునెలలు గడుస్తున్నా.. సంబంధిత ప్రత్యేక అధికారులు గ్రామాల్లోకి వచ్చి సమస్యలు చూసిన పాపానపోవడంలేదని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు. ఇక గ్రామాల్లో ఏ చిన్న సమస్య వచ్చినా గ్రామ కార్యదర్శి దగ్గరుండి చేయించాల్సిందిపోయి వారు కూడా నిర్లక్ష్యం వహిస్తూ డబ్బులు లేవని తేల్చిచెబుతున్నారు. ముఖ్యంగా ఆయా గ్రామాల్లో తాగునీటి సమస్య వచ్చిన వెంటనే దగ్గరుండి పరిష్కరించలేక నెలలు గడుస్తున్నా పట్టించుకోవడంలేదు. తాగునీటి సమస్య ఉన్నచోట వ్యవసాయ బోర్లనుంచి, ట్యాంకర్ల ద్వారా గాని తాగునీరు అందించక విఫలమవుతున్నారని ప్రజలు తెలిపారు. పలుగ్రామాల ప్రజలు మాత్రం గండేడ్ కార్యాలయానికి చేరుకుని తీవ్ర నిరసన తెలిపినా, రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేపట్టిన్నా గ్రామ కార్యదర్శులు స్పందించడం లేదు. సమస్యలు పరిష్కరిస్తాం మండలంలో ఏఏ గ్రామాల్లో తాగునీటి సమస్య ఉన్నా ట్యాంకర్ల ద్వారా, బోర్లు లీజుకు తీసుకొని నీటిని అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. నెలరోజుల్లో మిషన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామానికి తాగునీరు అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. దీం తో గ్రామాల్లో తాగునీటి సమస్య దూరమవు తుంది. చిన్న చిన్న మరమ్మతులు వస్తే సం బంధిత గ్రామ కార్యదర్శులు పరిష్కరించాలి. – దివ్యసంతోషి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, గండేడ్ -
విద్యార్హత డిగ్రీ.. కొత్త జిల్లాలే ప్రాతిపదిక
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్త జిల్లాల ప్రాతిపదికగానే పంచాయతీ కార్యదర్శుల నియామకాలను చేపట్టాలని పంచాయతీరాజ్ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. పంచాయతీ కార్యదర్శులకు కనీస విద్యార్హతను బ్యాచిలర్ డిగ్రీగా ఖరారు చేసింది. రాతపరీక్ష ఆధారంగా, జిల్లాలవారీగా నియామకాలు చేపట్టాలని పేర్కొంది. గ్రామ కార్యదర్శులకు నెలకు రూ. 15 వేల చొప్పున మూడేళ్లపాటు వేతనం ఇవ్వాలని నిర్దేశించిన సబ్ కమిటీ...పనితీరు సరిగా ఉంటేనే మూడేళ్ల తర్వాత వారిని క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కమిటీ సమావేశమైంది. మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎ. ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్న ఈ భేటీలో నూతన పంచాయతీరాజ్ చట్టం అమలు, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకం, వారి బాధ్యతలు, విధులకు సంబంధించిన మార్గదర్శకాలపై కూలంకషంగా చర్చించారు. ప్రతి పంచాయతీకి ఒక గ్రామ కార్యదర్శి నియామకం, జనాభా ప్రాతిపదికన గ్రామంలో ఉద్యోగుల సంఖ్యను ఖరారు చేయాలని సబ్ కమిటీ నిర్ణయించింది. నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి ప్రతి గ్రామానికీ ఒక కార్యదర్శిని నియమించాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మేరకు 9,355 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకం చేపట్టనుంది. నియామకాల్లో వయసుకు వెయిటేజీ! గ్రామ కార్యదర్శిగా ఎంపికైన వారు కచ్చితంగా ఆయా గ్రామాల్లోనే ఉండాలనే నిబంధన పెట్టి కఠినంగా అమలు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. అవసరమైతే నియామకాల్లో వయసుకు కొంత వెయిటేజీ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులను సబ్‌కమిటీ ఆదేశించింది. వారి పదోన్నతుల్లో సీనియారిటీతోపాటు పనితీరును కూడా ప్రాతిపదికగా తీసుకునేందుకు ఉన్న అవకాశాలపైనా సబ్ కమిటీ చర్చించింది. పంచాయతీల్లో పనిచేసే ప్రతి కార్మికుడు, సిబ్బందికి కనీస వేతనం ఇవ్వడంతోపాటు ప్రతి నెలా వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సబ్ కమిటీ ఆదేశించింది. జనాభా ప్రాతిపదికన ఏయే గ్రామానికి ఎంత మంది ఉద్యోగుల అవసరం ఉంటుందన్న సంఖ్యను నిర్దిష్టంగా తేల్చాలని సబ్ కమిటీ నిర్ణయించింది. గ్రామ పంచాయతీలు కూడా ఇష్టానుసారంగా సిబ్బందిని నియమించుకునేందుకు వీలు లేకుండా ఈ నిర్ణయం తీసుకుంది. ఐదు వందల వరకు జనాభా ఉన్న గ్రామానికి ఒక పారిశుద్ధ్య కార్మికుడిని నియమించుకునేలా పంచాయతీలకు వెసులుబాటు ఇచ్చే అంశంపై సమావేశంలో చర్చించారు. వీటితోపాటు గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల ప్రాధాన్యతాక్రమాన్ని కూడా స్పష్టంగా నిర్దేశించాలని నిర్ణయించారు. అలాగే నూతన చట్టానికి అనుగుణంగా జిల్లా పంచాయతీ అధికారులు, డివిజన్ పంచాయతీ అధికారులు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు, కార్యదర్శుల సర్వీస్ రూల్స్‌లోనూ మార్పులు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సబ్ కమిటీ ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం బీసీ గణన చేపట్టాల్సిన అవసరం ఉందని పంచాయతీరాజ్ సబ్ కమిటీ అభిప్రాయపడింది. ఇందుకోసం విధివిధానాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. సమావేశంలో ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శులు శివశంకర్, రామకృష్ణారావు, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో అవినీతి తిమింగలం
కొణిజర్ల : ఆయన పేరు పాలడుగు శ్రీధర్. కొణిజర్ల మండలంలోని దిద్దుపూడి పంచాయతీ ఇన్చార్జ్ సెక్రటరీ. ఈయన.. అవినీతి తిమింగలంగా మారాడు. పంచాయతీలో ఫైలు కదలాలంటే చేతిలో డబ్బు ముట్టచెప్పాల్సిందే. ఇతని బాధితుడొకరు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో, ఆ సెక్రటరీ అవినీతి దందాకు తెర పడినట్టయింది. ఏసీబీ వరంగల్ డిప్యూటీ డైరెక్టర్ సుదర్శన్ తెలిపిన వివరాలు... కొణిజర్ల మండలం దిద్దుపూడికి చెందిన అయిలూరి శ్రీనివాసరెడ్డి, తనకున్న 18 కుంటల భూమిలోగల 613 గజాల స్థలంలో ఇంటి నిర్మాణం కోసం రెవెన్యూ శాఖ నుంచి అనుమతికి దరఖాస్తు చేశారు. అనుమతి కావాలంటే 65వేల రూపాయలకు డీడీ తీయాలని దిద్దుపూడి పంచాయతీ ఇన్చార్జ్ సెక్రటరీ పాలడుగు శ్రీధర్ చెప్పాడు. పంచాయతీలో అంత మెత్తం ఉండటమేమిటని శ్రీనివాసరెడ్డి కుమారుడైన అయిలూరి మహేష్‌రెడ్డి (జూనియర్ అడ్వకేట్) ప్రశ్నించారు. ఇద్దరి మధ్య వాదులాట సాగింది. చివరకు, చలానా తగ్గించాలంటే తనకు 15వేల రూపాయలు ఇవ్వాలని అసలు విషయాన్ని శ్రీధర్ బయటపెట్టాడు. మహేష్‌రెడ్డి సరేననడంతో చలానాను 30,150 రూపాయలకు తగ్గించాడు. ఈ మొత్తానికి ట్రెజరీలో చలానా చెల్లించిన తరువాత మహేష్ రెడ్డి తిరిగొచ్చారు. అనుమతి పత్రం ఇవ్వాలని కోరారు. రూ.15వేలు ఇస్తేనే ఇంటి నిర్మాణ అనుమతి పత్రం ఇస్తానని శ్రీధర్ చెప్పాడు. సుమారు నెల రోజులపాటు తిప్పించుకున్నాడు. దీనిని భరించలేని మహేష్‌రెడ్డి, ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అధికారులు పథకం వేశారు. బుధవారం ఉదయం పాలడుగు శ్రీధర్‌కు మహేష్‌రెడ్డి ఫోన్ చేశారు. తన వద్ద ప్రస్తుతం రూ10వేలే ఉన్నాయని, మిగిలినవి రెండు మూడు రోజుల్లో ఇస్తానని అన్నారు. శ్రీధర్ సరేనన్నాడు. తాను తనికెళ్ల పంచాయతీ కార్యాలయంలో ఉన్నానని, అక్కడకు రావా లని అన్నాడు. మహేష్‌రెడ్డి అక్కడకు వెళ్లి, రూ.10వేలు ఇస్తుండగా ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ సుదర్శన్, ఇన్స్పెక్టర్లు రమణమూర్తి, రామలింగారెడ్డి, సతీష్, క్రాంతికుమార్, పదిమంది సిబ్బంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నా రు. ఆ కార్యదర్శి వద్ద డబ్బును, రికార్డులను స్వాధీనపర్చుకున్నారు. అతడిని ఖమ్మం ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఇబ్బందులను తట్టుకోలేకనే... ‘‘ఇంటి నిర్మాణ అనుమతి కోసం వెళితే, ఎల్ఆర్ఎస్ పేరు చెప్పి డబ్బులు కట్టిస్తున్నాడు. ఇదేమిటని ప్రశ్నిస్తే లంచం కావాలంటున్నాడు. ఇలా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టాడు. అందుకే ఏసీబీ అధికారులను ఆశ్రయించాను’’ అని చెప్పారు మహేష్‌రెడ్డి. ప్రజలు సమాచారమివ్వాలి అవినీతికి సంబంధించిన ఏ సమాచారాన్నైనా తమకు ఇవ్వాలని ప్రజలను ఏసీబీ డీడీ సుదర్శన్ రెడ్డి కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఏడు పంచాయతీలకు ఇన్చార్జ్ సెక్రటరీగా పాలడుగు శ్రీధర్ ఉన్నాడని, అన్నిచోట్ల నుంచి ఆయనపై ఫిర్యాదులు అందాయని చెప్పారు. వీటిని సమగ్రం విచారించి చర్యలు తీసుకుంటామని అన్నారు. -
బానిసలుగా చూస్తే ఐక్య పోరాటం
విజయవాడరూరల్ : గ్రామ పంచాయతీ కార్యదర్శులను బానిసలుగా చూస్తే ఐక్య పోరాటాలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శుల కృష్ణాజిల్లా సంఘం(అమరావతి) హెచ్చరించింది. విజయవాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా పంచాయతీ కార్యదర్శుల సమావేశం విజయవాడ డివిజన్ అధ్యక్షుడు గరిమెళ్ళ వెంకటశ్రీనివాసరావు అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాసరావు మాట్లాడుతూ పనిచేయని పరికరాలతో ప్రజా సాధికారిక సర్వే చేయమనడం సరికాదన్నారు. శాఖాపరమైన విధుల్లో ఉన్న కార్యదర్శులకు అదనపు బాధ్యతలు అప్పజెప్పడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పనిచేయని ట్యాబ్‌లతో సర్వే ఎలా చేయాలని ప్రశ్నించారు. అదనపు విధులతో ఒత్తిడి ఎదుర్కుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 970 గ్రామ పంచాయతీలు ఉండగా 370 మంది కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వీఎస్ఆర్. ఆంజనేయులు, రాష్ట్ర నాయకులు జీటీవీ రమణ, ఉపాధ్యక్షురాలు వెంకటేశ్వరమ్మ, కోశాధికారి కోటేశ్వరరావు, కార్యవర్గం సభ్యురాలు మైధిలి, గౌరవాధ్యక్షుడు ఏసుదాసు, వీఆర్వోల సంఘం రాష్ట్ర నాయకుడు ఆంజనేయకుమార్లు పాల్గొన్నారు. సస్పెండ్ చేస్తే మూకుమ్మడి సెలవు విజయవాడరూరల్/ రామవరప్పాడు : రామవరప్పాడు పరిధిలోని ఎన్‌హెచ్ పక్కన చెత్త నిల్వలు ఉండటంపై పంచాయతీ కార్యదర్శి, విజయవాడ రూరల్ మండల ఈవోఆర్డీలపై ఉన్నతాధికారులు ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. అలాగే ఇబ్రహీంపట్నం గ్రామ కార్యదర్శి, ఈవోఆర్డీలపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అయితే పనిభారంతో సతమతమవుతున్న తమపై ‘చెత్తనిల్వ సాకుతో’ సస్పెన్షన్ వేటు వేస్తే మూకుమ్మడి సెలవులు పెడతామని పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారం కోరుతూ త్వరలో మంత్రులకు వినతిపత్రం అందజేస్తామని ఆయన తెలిపారు.