భైంసాటౌన్(ముథోల్): ఇప్పటివరకు వివాహ రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. పట్టణాలతో పాటు మారుమూల గ్రామాల్లో జరిగే వివాహాలను సైతం ఈ కార్యాలయాల్లోనే నమోదు చేసుకోవాల్సి వచ్చేది. దీంతో వారికి దూరభారంతోపాటు వ్యయభారం తప్పేది కాదు. దీంతో చాలామంది వివాహ నమోదు చేసుకునేవారు కాదు. అయితే తెలంగాణ ప్రభుత్వం షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాలను ప్రవేశపెట్టిన తరువాత చాలామంది వివాహ నమోదుకు ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే ఈ పథకాల కింద అందిస్తున్న ఆర్థిక సాయం పొందాలంటే లబ్ధిదారులు ఖచ్చితంగా వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జతచేయాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో వారు వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కోసం రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇకపై గ్రామాల్లోనూ వివాహాల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. పంచాయతీ కార్యదర్శులే వివాహ నమోదు చేయాలని ఈ మేరకు ఆదేశించింది. గ్రామాల్లో జరిగే ప్రతీ వివాహాన్ని రిజిస్టర్ చేయాలన్న కొత్త పంచాయతీరాజ్ చట్టం నిబంధనల మేరకు ఈనెల నుంచి కొత్త విధానం అమలులోకి రానుంది. దీంతో గ్రామవాసులకు వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ సులభంగా అందనుంది.
పెళ్లయిన మరుసటి రోజే..
కొత్త పంచాయతీ రాజ్ చట్ట నిబంధనల నేపథ్యంలో మార్చి నుంచి ఈ కొత్త విధానం అమలులోకి రానుంది. గ్రామపరిధిలో జరిగే ప్రతీ వివాహాన్ని రిజిస్టర్ చేయాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులకు కట్టబెట్టారు. ఇదివరకు గ్రామ కార్యదర్శులు ఆ గ్రామంలో జరిగే వివాహాలు నమోదు చేసుకుని తెల్ల కాగితాలపై ధ్రువపత్రం జారీ చేసేవారు. దీని ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహ ధ్రువపత్రం జారీ చేసేవారు. కానీ ఇకపై గ్రామాల్లోనే వివాహ సర్టిఫికెట్ జారీ చేసేలా చర్యలు చేపడుతున్నారు. ఏదైనా వివాహం జరిగిన మరుసటి రోజే సర్టిఫికెట్ జారీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు పంచాయతీ కార్యాలయాల్లో ఇందుకోసం ఒక విభాగం ఏర్పాటు చేయనున్నారు. పం చాయతీ కార్యదర్శులకు సైతం శిక్షణ ఇవ్వనున్నారు. పెళ్లయిన జంట వారి ఆధార్‌కార్డు, వివాహ ఆహ్వాన పత్రిక, ఫొటోలు, ముగ్గురు సాక్షుల సంతకాలతో పంచాయతీ కార్యాలయంలో సంప్రదిస్తే పంచాయతీ కార్యదర్శి పరిశీలించి వివాహ సర్టిఫికెట్ జారీ చేస్తారు.
బాల్యవివాహాలకు అడ్డుకట్ట
గ్రామాల్లోనే వివాహ రిజిస్ట్రేషన్ చేయాలన్న నిర్ణయంతో ప్రధానంగా బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడనుంది. కల్యాణలక్ష్మి పథకం కింద లబ్ధి పొందాలంటే వివాహ నమోదు తప్పనిసరి. 18ఏళ్లు నిండని మైనర్లకు పెళ్లి చేస్తే అధికారులు వివాహ నమోదు చేయరు. దీంతో కల్యాణలక్ష్మి పథకానికి వారు అనర్హులవుతారు. ప్రభుత్వం అందించే ఆర్థికసాయానికి దూరమవుతారు. దీని వల్ల బాల్యవివాహాలకు అడ్డుకట్టు పడే అవకాశం ఉంది.
396కు 74 మందే కార్యదర్శులు
జిల్లావ్యాప్తంగా 396 గ్రామపంచాయతీలు ఉండగా కేవలం 74 మంది మాత్రమే పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. దీంతో వారికి ఈ బాధ్యతలు అదనం. రాష్ట్రప్రభుత్వం ఇటీవలే పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు రాతపరీక్షలు నిర్వహించి ఎంపిక చేసినా.. ఇంకా భర్తీ ప్రక్రియ జరగలేదు. దీంతో ఒక్కొక్కరికి ఐదు పంచాయతీల బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది. కొన్ని గ్రామపంచాయతీల్లో ఒకటి నుంచి రెండు అనుబంధ గ్రామాలు సైతం ఉన్నాయి. వచ్చేది పెళ్లిళ్ల సీజన్.. దీంతో వివాహ రిజిస్ట్రేషన్లలో పంచాయతీ కార్యదర్శుల కొరత కారణంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదు.
పనిభారంతో..
జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు కొరత కారణంగా ఇప్పటికే ఒక్కొక్కరికి ఐదు పంచాయతీల చొప్పున బాధ్యతలు అప్పగించారు. ఆయా గ్రామపంచాయతీల పరిధిలో ఇంకుడుగుంతల నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణం, పన్నుల వసూలు, జనన, మరణాల నమోదు, ఆదాయ, వ్యయాలు, గ్రామసభలు, పంచాయతీ సమావేశాలు నిర్వహించడం, నీటిసమస్య, మురికికాల్వలు, వీధిదీపాలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి బాధ్యతలతో పంచాయతీ కార్యదర్శులకు పనిభారం అవుతోంది. దీనికి తోడు వచ్చేది వేసవి కావడంతో ఆయా గ్రామాల్లో మంచినీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఒక్కొక్కరికి ఐదేసి పంచాయతీల బాధ్యతలు ఉండడంతో వారికి పనిభారం తప్పేలా లేదు. ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులకు వివాహ రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగించడంతో మరింత పనిభారం పడుతుందని వారు పేర్కొంటున్నారు.
నమోదుకు చర్యలు తీసుకుంటాం
గ్రామాల్లోనే వివాహ రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశించింది. ప్రస్తుతం జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల కొరత ఉంది. ప్రభుత్వం ఇదివరకే పంచాయతీ కార్యదర్శుల భర్తీకి పరీక్షలు నిర్వహించింది. ఎంపికైన నూతన కార్యదర్శులతో భర్తీ చేస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న సిబ్బందికే ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించాం. గ్రామాల్లోనే వివాహ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం.
– శ్రీనివాస్, డీపీవో, నిర్మల్
Comments
Please login to add a commentAdd a comment