సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలకు ఉద్యోగుల విభజనలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యదర్శుల బదిలీల ప్రక్రియ మలుపులు తిరుగుతోంది. కొన్ని జిల్లాల్లో పనిచేస్తున్న కార్యదర్శులకు ఒకలా, మరికొన్ని జిల్లాల్లో ఇంకోలా కేటాయింపులు, పోస్టింగ్‌లు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రాంతాలకు పోస్టింగుల వల్ల కుటుంబాలకు దూరమై వ్యయ, దూరభారాలు ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోతున్నారు. మే, జూన్‌ల్లో సాధారణ బదిలీలు చేసే దాకా పాత స్థానాల్లోనే డిప్యూటేషన్‌పై కొనసాగేలా ఉత్తర్వులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
కొన్నిజిల్లాల్లో ఔట్‌సోర్సింగ్ కార్యదర్శుల ఔట్
ఉమ్మడి మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లా ల్లోని పలువురు పంచాయతీ సెక్రటరీలను సాధారణ బదిలీలు జరిగే దాకా పాత జిల్లాల్లోనే డిప్యూటేషన్‌పై పనిచేసేలా తాజాగా ఉత్తర్వులిచ్చారు. అయితే ఇప్పటివరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న పలువురిని నిజామాబాద్, తదితర జిల్లాలకు బదిలీ చేయడంతో కుటుంబాలకు దూరంగా తాము ఇబ్బందిపడుతున్నామని వారు వాపోతున్నారు. మరోవైపు దాదాపు ఏడాది కిందట వివిధ జిల్లాల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 800 మంది వరకు గ్రామ పంచాయతీ సెక్రటరీలను నియమించగా వీళ్లలో నిజామాబాద్ జిల్లాలో70 మంది, నిర్మల్ జిల్లాలో 40 మందిని తాజాగా తొలగించారు. ప్రస్తుత బదిలీలు, కేటాయింపుల్లో భాగంగా వీళ్లు పనిచేస్తున్న పంచాయతీల్లో పలువురు గ్రేడ్–1, 2, 3 సెక్రటరీలను నియమించినట్లు తెలుస్తోంది. గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శులను గ్రేడ్–1 గ్రామాలకు కాకుండా ఔట్ సోర్సింగ్ సెక్రటరీలు పనిచేస్తున్న గిరిజన తండాలు, మారుమూల ప్రాంతాలకు బదిలీ చేయడంపై విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment