లంచం తీసుకుంటుండగా శ్రీధర్‌ను పట్టుకున్న ఏసీబీ అధికారులు
కొణిజర్ల : ఆయన పేరు పాలడుగు శ్రీధర్. కొణిజర్ల మండలంలోని దిద్దుపూడి పంచాయతీ ఇన్‌చార్జ్ సెక్రటరీ. ఈయన.. అవినీతి తిమింగలంగా మారాడు. పంచాయతీలో ఫైలు కదలాలంటే చేతిలో డబ్బు ముట్టచెప్పాల్సిందే. ఇతని బాధితుడొకరు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో, ఆ సెక్రటరీ అవినీతి దందాకు తెర పడినట్టయింది. ఏసీబీ వరంగల్ డిప్యూటీ డైరెక్టర్ సుదర్శన్ తెలిపిన వివరాలు...
- కొణిజర్ల మండలం దిద్దుపూడికి చెందిన అయిలూరి శ్రీనివాసరెడ్డి, తనకున్న 18 కుంటల భూమిలోగల 613 గజాల స్థలంలో ఇంటి నిర్మాణం కోసం రెవెన్యూ శాఖ నుంచి అనుమతికి దరఖాస్తు చేశారు. అనుమతి కావాలంటే 65వేల రూపాయలకు డీడీ తీయాలని దిద్దుపూడి పంచాయతీ ఇన్‌చార్జ్ సెక్రటరీ పాలడుగు శ్రీధర్ చెప్పాడు. పంచాయతీలో అంత మెత్తం ఉండటమేమిటని శ్రీనివాసరెడ్డి కుమారుడైన అయిలూరి మహేష్‌రెడ్డి (జూనియర్ అడ్వకేట్) ప్రశ్నించారు. ఇద్దరి మధ్య వాదులాట సాగింది.
- చివరకు, చలానా తగ్గించాలంటే తనకు 15వేల రూపాయలు ఇవ్వాలని అసలు విషయాన్ని శ్రీధర్ బయటపెట్టాడు. మహేష్‌రెడ్డి సరేననడంతో చలానాను 30,150 రూపాయలకు తగ్గించాడు.
- ఈ మొత్తానికి ట్రెజరీలో చలానా చెల్లించిన తరువాత మహేష్ రెడ్డి తిరిగొచ్చారు. అనుమతి పత్రం ఇవ్వాలని కోరారు. రూ.15వేలు ఇస్తేనే ఇంటి నిర్మాణ అనుమతి పత్రం ఇస్తానని శ్రీధర్ చెప్పాడు.
- సుమారు నెల రోజులపాటు తిప్పించుకున్నాడు. దీనిని భరించలేని మహేష్‌రెడ్డి, ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అధికారులు పథకం వేశారు.
- బుధవారం ఉదయం పాలడుగు శ్రీధర్‌కు మహేష్‌రెడ్డి ఫోన్ చేశారు. తన వద్ద ప్రస్తుతం రూ10వేలే ఉన్నాయని, మిగిలినవి రెండు మూడు రోజుల్లో ఇస్తానని అన్నారు. శ్రీధర్ సరేనన్నాడు. తాను తనికెళ్ల పంచాయతీ కార్యాలయంలో ఉన్నానని, అక్కడకు రావా లని అన్నాడు. మహేష్‌రెడ్డి అక్కడకు వెళ్లి, రూ.10వేలు ఇస్తుండగా ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ సుదర్శన్, ఇన్‌స్పెక్టర్లు రమణమూర్తి, రామలింగారెడ్డి, సతీష్, క్రాంతికుమార్, పదిమంది సిబ్బంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నా రు. ఆ కార్యదర్శి వద్ద డబ్బును, రికార్డులను స్వాధీనపర్చుకున్నారు. అతడిని ఖమ్మం ఏసీబీ కార్యాలయానికి తరలించారు.
ఇబ్బందులను తట్టుకోలేకనే...
‘‘ఇంటి నిర్మాణ అనుమతి కోసం వెళితే, ఎల్‌ఆర్‌ఎస్ పేరు చెప్పి డబ్బులు కట్టిస్తున్నాడు. ఇదేమిటని ప్రశ్నిస్తే లంచం కావాలంటున్నాడు. ఇలా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టాడు. అందుకే ఏసీబీ అధికారులను ఆశ్రయించాను’’ అని చెప్పారు మహేష్‌రెడ్డి.
ప్రజలు సమాచారమివ్వాలి
అవినీతికి సంబంధించిన ఏ సమాచారాన్నైనా తమకు ఇవ్వాలని ప్రజలను ఏసీబీ డీడీ సుదర్శన్ రెడ్డి కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఏడు పంచాయతీలకు ఇన్‌చార్జ్ సెక్రటరీగా పాలడుగు శ్రీధర్ ఉన్నాడని, అన్నిచోట్ల నుంచి ఆయనపై ఫిర్యాదులు అందాయని చెప్పారు. వీటిని సమగ్రం విచారించి చర్యలు తీసుకుంటామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment