పదేళ్లకోసారి రిజర్వేషన్లు
సాక్షి, హైదరాబాద్: సర్పంచ్ ఎన్నికల పద్ధతి ఎలా ఉంటుందనే ఊగిసలాటకు, చర్చోపచర్చలకు తెరపడింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రస్తుతమున్నట్టుగానే ప్రత్యక్ష పద్ధతిలోనే, పార్టీలతో ప్రమేయం లేకుండా, అంటే పార్టీ గుర్తులరహితంగా జరగనున్నాయి. పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేస్తూ రూపొందించిన పంచాయతీరాజ్ బిల్లును ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. పంచాయతీలుగా తండాలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని ఈ బిల్లు ద్వారా నెరవేరుస్తున్నట్లు చెప్పారు. మహాత్మాగాంధీ గ్రామ స్వరాజ్య నినాదం కొత్త చట్టంతో ఆచరణ రూపు దాలుస్తుందని భావిస్తున్నామన్నారు. బిల్లులో పేర్కొన్న కీలకాంశాలు...
పాలనలో సర్పంచే కీలకం
గ్రామ పాలనలో సర్పంచ్ కీలకం కానున్నారు. రిజర్వేషన్ల విధానంలో మార్పులు తెచ్చారు. ప్రస్తుతం ఐదేళ్లకోసారి మారుతున్న సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు పరిమితిని పదేళ్లకు పెంచారు. గ్రామంలో వంద శాతం ఎస్టీలుంటే సర్పంచ్ పదవిని ఆ వర్గానికే రిజర్వు చేయనున్నారు. పంచాయతీలో ఓటరుగా ఉన్నవారికే సర్పంచ్‌గా, వార్డు సభ్యులుగా పోటీకి అవకాశముంటుంది. పంచాయతీకి ప్రత్యక్ష పద్ధతిలోనే ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు పరోక్ష పద్ధతిలో ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది. సర్పంచ్‌గా పోటీకి 21 ఏళ్లు దాటిన వారు అర్హులు. వారికి ఎలాంటి విద్యార్హతలూ అవసరం లేదు. పదవీకాలం ఐదేళ్లు.
జాయింట్ చెక్ పవర్
పంచాయతీ అభివృద్ధిలో కీలకమైన నిధుల ఖర్చు విషయంలో చెక్‌పవర్ విధానంలో మార్పులు జరిగాయి. ప్రస్తుతం సర్పంచ్, గ్రామ కార్యదర్శికి జాయింట్ చెక్‌పవర్ అధికారాలున్నాయి. బిల్లులో సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు ఈ పవర్ ఇచ్చారు. సర్పంచ్ విధి నిర్వహణలో విఫలమైనట్లు నిరూపితమైనా, నిధుల దుర్వినియోగం చేసినా తొలగించే విషయాన్ని బిల్లులో పేర్కొన్నారు. తొలగింపు అధికారం ఇప్పట్లాగే కలెక్టర్లకే ఉంటుంది. తొలగింపుపై సర్పంచ్‌లు అప్పీలు చేసేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటవుతుంది.
గ్రామసభలో అంశాలు...
- పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణ, మొక్కల పెంపకం, శ్మశాన వాటికల నిర్వహణ, విద్య, కుటుంబ సంక్షేమం, ఆరోగ్యం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, కల్వర్టులు, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్సవాలు, కొత్త పన్నుల పెంపు తదితరాలపై చర్చి స్తారు. పంచాయతీలో అమలు చేసే అభి వృద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలి.
- పథకాల లబ్ధిదారుల జాబితాను అందరికీ తెలిసేలా ప్రదర్శించాలి. కొత్తగా ఎన్నిక య్యే సర్పంచ్‌లకు, వార్డు సభ్యులకు ప్రభు త్వం అవగాహన కల్పిస్తుంది. పాలనాంశాల్లోనూ మార్పులు జరిగాయి. గ్రామంలో ఇంటి నిర్మాణానకి దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోపు అనుమతులివ్వాలి. లే ఔట్ పర్మిషన్లలో నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీసుకునే నిబంధన ఉంది.
గ్రాస సభ కోరం
గ్రామ సభ నిర్వహణకు కనీసం ఎంతమంది హాజరవాలనే (కోరం) విషయంపైనా బిల్లులో స్పష్టత ఇచ్చారు. 300 నుంచి 500 ఓటర్లుండే గ్రామంలో 50 మంది హాజరైతేనే కోరమున్న ట్టు భావించి సభ నిర్వహించాలి. 500– 1,000 ఓటర్లుంటే 75 మంది, 1,000– 3,000 ఉంటే 150 మంది, 3,000–5,000 వరకైతే 200 మంది, 5,000–10,000 వరకు 300 మంది, ఆపైన ఓటర్లుంటే 400 మంది హాజరు తప్పనిసరి.
300 జనాభా ఉన్నా..
కొత్తగా 4,380 గ్రామ పంచాయతీలు ఏర్పాటవుతున్నాయి. వీటిలో 100 శాతం ఎస్టీ జనాభా ఉన్నవి 1,326. దీంతో గ్రామ పంచాయతీల సంఖ్య 12,741కు పెరగనుంది. వార్డు సభ్యుల సంఖ్య గ్రామ జనాభా ఆధారంగా ఉంటుంది. ఇప్పటిదాకా కనీసం 500 జనాభా ఉంటేనే గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసే అవకాశముండేది. ఇకపై 300 జనాభా ఉన్నా అవకాశ మిస్తారు. గురువారం చర్చ అనంతరం బిల్లును సభ ఆమోదించనుంది.
రెండు నెలలకోసారి గ్రామసభ
- ప్రస్తుతం మూడు నెలలకోసారి జరుగుతున్న గ్రామ పంచాయతీ సమావేశాన్ని ప్రతి నెలా నిర్వహించాలి. పాలకవర్గంలోని ఎన్నికైన సభ్యులు ఇందులో పాల్గొంటారు.
- ఎంపీటీసీ సభ్యుడు గ్రామసభకు ఆహ్వానితుడు. ఎంపీటీసీ పరిధిలోని జరిగే అన్ని కార్యక్రమాలకు ఆయన ఆహ్వానితుడే. అయితే పంచాయతీ వ్యవహారాలు వేటిలోనూ ఎంపీటీసీకి ఓటు హక్కుండదు.
- ప్రతి పంచాయతీలో ముగ్గురు కోఆప్షన్ సభ్యులుంటారు. గ్రామాభివృద్ధిపై ఆసక్తి ఉన్నవారు, గ్రామాభివృద్ధి కోసం ఆర్థికంగా చేయూత అందించిన వారిని సభ్యులుగా నియమిస్తారు. వీరు గ్రామసభల్లో పాల్గొంటారు, వీరు అన్ని అంశాలపై చర్చించవచ్చు గానీ ఓటు హక్కుండదు.
- మూణ్నెల్లకోసారి జరుగుతున్న గ్రామ సభ ఇకపై రెండు నెలలకోసారి జరగాలి. ప్రత్యేక సందర్భాల్లో పది రోజుల తర్వాత భేటీ కావచ్చు. సర్పంచ్ లేని సందర్భాల్లో ఉప సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ జరగుతుంది. మండల పరిషత్, జిల్లా పరిషత్, అసెంబ్లీ సభ్యులను సభకు ఆహ్వానించవచ్చు. ఏడాదిలో ఆరుసార్లు కచ్చితంగా గ్రామ సభ నిర్వహించాలి. మహిళలు, వృద్ధులు, వికలాంగుల అంశంపై కనీసం రెండు గ్రామసభల్లో చర్చించాలి. పంచాయతీ నిర్ణయం ప్రకారం గ్రామసభ ఎజెండాలోని అంశాలపై సభ్యులకు గ్రామ కార్యదర్శి సమాచారమివ్వాలి.