పంచాయతీలకు నిధులు విడుదల
సాక్షి, గుంటూరు :రెండున్నరేళ్లుగా నిధుల విడుదల నిలిచిపోయి సమస్యలతో కునారిల్లుతున్న పంచాయతీలకు శుభవార్త. వివిధ గ్రాంట్ల కింద జిల్లాలోని పంచాయతీలకు మొత్తం రూ.25.49 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులన్నీ ఇప్పటికే సబ్ట్రెజరీల్లోని పంచాయతీల ఖాతాలకు జమయ్యాయి. ఇక గ్రామాల్లో పనులు మొదలు పెట్టడమే తరువాయి. జిల్లాలో మొత్తం 1010 పంచాయతీలున్నాయి. ఇందులో 110 మేజర్ పంచాయతీలు, 900 మైనర్ పంచాయతీలు. వీటన్నింటికీ కిందటి జూలైలో ఎన్నికలు జరిగాయి. ఆగస్టు రెండో తేదీ నుంచి కొత్త సర్పంచులు పదవీ బాధ్యతలు చేపట్టారు. గ్రామాల్లో నెలకొన్న వివిధ రకాల సమస్యల్ని పరిష్కరించేందుకు ముందుకొచ్చిన సర్పంచులు ఖాళీ ఖజానాలను చూసి విస్మయానికి గురయ్యారు. వీధిలైట్లు, పారిశుద్ధ్యం, అంతర్గత రోడ్లు, తాగునీటి సమస్యల్ని పరిష్కరించేందుకు చేతిలో చిల్లిగవ్వలేక కొత్త సర్పంచులు మౌనం వహించారు.
ఆగస్టు 12 నుంచి ఎన్జీవోల సమైక్య సమ్మె. అప్పటి నుంచి ఇప్పటి వరకూ గ్రామాల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. వర్షాలకు దెబ్బతిన్నరోడ్లు, దయనీయంగా మారిన పారిశుద్ధ్యం, తాగునీటి సమస్య, వీధిలైట్లు వెలగక గ్రామీణ జనం నానా ఇక్కట్లకు గురవుతున్నారు. 2011 ఆగస్టు నెలతో పాత పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి పంచాయతీలకు అన్ని రకాల నిధులు నిలిచిపోయాయి. ఎన్నికలు పూర్తయ్యాకే నిధుల విడుదలంటూ కేంద్రం షరతులు విధించింది. దీంతో వివిధ గ్రాంట్లు మొత్తం ఆగిపోయాయి. అయితే పది రోజుల కిందటే రాష్ట్రస్థాయిలో సమావేశమైన పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు గ్రాంట్ల విషయం కూలంకుషంగా సమీక్షించి కేంద్రాన్ని కోరిన దరిమిలా అన్ని జిల్లాలకు నిలిచిపోయిన గ్రాంట్ల విడుదల పూర్తయ్యింది. ఇందులో భాగంగా జిల్లాకు రూ.25,49,39,469 విడుదలయ్యాయి.
ఆర్థిక సంఘం నిధులే ఎక్కువ..
విడుదలైన నిధుల్లో ఎక్కువ భాగం 13వ ఆర్థిక సంఘం నిధులే ఉన్నాయి. 2011-12 ఆర్థిక సంవత్సరంలోని రెండో విడత నిధుల కింద వీటిని కేంద్రం మంజూరు చేసింది. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు మాత్రం రెండు విడతలవీ విడుదలయ్యాయి. మూడు, నాలుగు గ్రాంట్ల కింద విడుదలైన నిధులు జనాభా ప్రాతిపదికన మంజూరయ్యాయి. ఇందులో మేజర్ పంచాయతీలకు రూ. 2 నుంచి రూ.5 లక్షల వరకూ, మైనర్ పంచాయతీలకు రూ.30 నుంచి 50 వేల వరకూ కేటాయించే అవకాశాలున్నాయి. ఈ నిధులతో కొత్త సర్పంచులు గ్రామాల్లో వివిధ రకాల సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. ఉదాహరణకు మాడిపోయిన వీధిలైట్లను మార్చి కొత్తలైట్లు ఏర్పాటు చేసుకోవడం, బురదరోడ్లను బాగు చేసుకోవడం, మంచినీటి పైప్లైన్లు, మోటార్లకు మరమ్మతులు, ఫిల్టర్బెడ్లలో ఇసుక మార్పించడం, పంచాయతీ భవనాల నిర్మాణం తదితర పనులన్నీ చేసుకోవచ్చు. సర్పంచితో పాటు పంచాయతీ కార్యదర్శుల సంయుక్త సంతకాలతో చెక్కులు పాసవుతాయి.
నేడు మండలాల్లో సమావేశం..
నిధుల వినియోగంపై సర్పంచులు, కార్యదర్శులకు సరైన అవగాహన కల్పించేందుకు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు వివిధ మండలాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖరరావు ఎంపీడీవోలకు సూచించారు. మేడికొండూరు, చేబ్రోలు, దుగ్గిరాల వంటి మండలాల్లో ఈ ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యిందని, మిగతా మండలాల్లో సమావేశాలు జరగాలని పేర్కొన్నారు. మరో రెండు నెలల్లో పంచాయతీలకు ఇప్పుడు విడుదలైన నిధుల కంటే నాలుగు రెట్లు అధికంగా మళ్లీ నిధులు విడుదలయ్యే అవకాశముందన్నారు.
విడుదలైన నిధులు ఇవీ...
13వ ఆర్థిక సంఘం నిధులు రూ. 16,82,44,100
రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రూ. 5,55, 52,200
వృత్తి పన్ను నిధులు రూ. 2,41,89,400
జనాభా గ్రాంటు రూ. 63,53,768
-----------------------------------
మొత్తం నిధులు రూ. 25,49,39,468