పంచాయతీలకు నిధులు ఫుల్‌  | Full Funds For Panchayats | Sakshi
Sakshi News home page

పంచాయతీలకు నిధులు ఫుల్‌ 

Dec 19 2019 10:54 AM | Updated on Dec 19 2019 10:54 AM

Full Funds For Panchayats - Sakshi

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: గత ప్రభుత్వం ఉపాధి హామీ పథకం నిధులను పక్కదారి పట్టించడంతో కేంద్రం కన్నెర్ర చేసింది. మంజూరైన నిధులకు యూసీలు సమర్పించకపోవడంతో తదు పరి నిధుల మంజూరుకు బ్రేక్‌ వేసింది. దీంతో ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కాంపోనెంట్‌ పనులకు కూడా నిధుల కొరత ఏర్పడింది. సాధారణంగా ఉపాధి హామీ పథకం కింద మంజూరైన నిధులలో 60 శాతం వేతన పనుల కింద, 40 శాతం మెటీరియల్‌ కాంపోనెంట్‌ పనుల కింద ఖర్చు పెట్టాలి. ఈ రకంగా చేయాల్సిన గత ప్రభుత్వం వచ్చిన ఉపాధి నిధులను నిబంధనలకు 

విరుద్ధంగా వేరే వాటికి వినియోగించడం వలన పూర్తి స్థాయిలో నిధులు విడుదల కాని దుస్థితి చోటు చేసుకుంది. దీంతో 40 శాతం మెటీరియల్‌ కాంపోనెంట్‌ పనులకు నిధుల సమస్య ఏర్పడింది. దీంతో ఆ పనులు చేపట్టిన కొందరు కాంట్రాక్టర్లు బిల్లులు రావడం లేదని కొన్ని పనులు నిలిపివేయగా, మరికొందరు ఇష్టారీతిన, నాణ్యత లేకుండా పనులు చేపట్టి మమ అనిపించేశారు. ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన పనులకు దాదాపు రూ.80 కోట్ల బకాయిలున్నట్టు సమాచారం

 కొత్త ప్రభుత్వంలో కదలిక..  
గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్ది, మిగిలిపోయిన మెటీరియల్‌ కాంపోనెంట్‌ పనులతో కలిపి కొత్త పనులు చేపట్టేందుకు ప్రస్తుత ప్రభుత్వం ఉపక్రమించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిపోయిన రూ.300 కోట్ల మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులతోపాటు మరో రూ.700 కోట్ల పనులు (మొత్తం రూ.1000 కోట్ల) పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంది. ఈ  మేరకు జిల్లా మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు, అధికారులతో రాష్ట్ర పంచాయతీరాజ్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం వెలగపూడిలోని సచివాలయం 5వ బ్లాక్‌లో సమావేశం నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మూడు నెలల్లోగా పనులు పూర్తి చేయాలని టార్గెట్‌ కూడా ఇచ్చారు.

పంచాయతీలకు తగ్గిన భారం.. 
గతంలో మెటీరియల్‌ కాంపోనెంట్‌ పనులు చేపట్టాలంటే నిర్దేశించిన అంచనా వ్యయంలో గ్రామ పంచాయతీలు మ్యాచింగ్‌ గ్రాంటుగా కొంత చెల్లించాల్సి వచ్చేది. 2 వేల జనాభా ఉన్న పంచాయతీలోనైతే 90 శాతం మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులు, 10 శాతం గ్రామ పంచాయతీలతో పనులు చేపట్టే పరిస్థితి ఉండేది. 2 వేల నుంచి 5 వేల జనాభా గల పంచాయతీల్లోనైతే 70 శాతం మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులు, 30 శాతం గ్రామ పంచాయతీలు భరించాల్సి ఉండేది.

5 వేల జనాభా దాటిన పంచాయతీల్లోనైతే 50 శాతం మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులు, 50 శాతం గ్రామ పంచాయతీలు తమ మ్యాచింగ్‌ గ్రాంటుగా సమకూర్చాల్సి ఉండేది. అంటే గ్రామ పంచాయతీల్లో మెటీరియల్‌ కాంపోనెంట్‌ పనులు జరగాలంటే పంచాయతీలు కొంత భారాన్ని మోయాల్సి ఉండేది. ఈ పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉండేది. అసలే నిధుల్లేక సతమతమవుతున్న పంచాయతీలకు ఇది అదనపు భారమయ్యేది. తమ వాటాగా ఇస్తేనే మెటీరియల్‌ కాంపోనెంట్‌ పనులు ఆయా పంచాయతీలకు దక్కేవి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్న పంచాయతీల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పంచాయతీలపై భారం మోపకుండా కన్వర్జెన్సీ లేకుండా మొత్తం మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులతోనే పనులు చేపట్టుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. దీంతో పంచాయతీలకు ఆర్థిక భారం తొలగినట్టయింది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement