మెట్రో ఎలైన్‌మెంట్‌లో మరో మార్పు
మారనున్న బందరు రోడ్డు కారిడార్
కాలువ వైపు జరగనున్న ఎలైన్మెంట్
బస్టాండ్ - రైల్వే పార్శిల్ కార్యాలయం రూట్ సౌత్ గేటు వరకు మార్పు
పోలీస్ కంట్రోల్ రూమ్, ‘ఫైర్’ కార్యాలయం సేఫ్
విజయవాడ బ్యూరో : విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు ఎలైన్‌మెంట్‌లో మరో మార్పు చోటు చేసుకోనుంది. బందరు రోడ్డు కారిడార్‌లో పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి రాఘవయ్య పార్కు వరకు ఎలైన్‌మెంట్‌ను మార్చనున్నారు. ఇప్పటికే ఏలూరు రోడ్డు కారిడార్ ప్రారంభంలో మార్పులు చేశారు. తాజాగా కృష్ణలంక జాతీయ రహదారి విస్తరణ బందరు రోడ్డు కారిడార్‌కు అడ్డంకిగా మారడంతో అక్కడా మార్పులు ప్రతిపాదించనున్నారు. గతంలో కారిడార్‌ను బస్టాండ్ నుంచి రాఘవయ్య పార్కు వరకు కృష్ణలంక వైపు నిర్మించేందుకు ఎలైన్మెంట్ రూపొందించారు. కానీ ప్రస్తుతం ఈ రహదారిని విస్తరిస్తుండడంతో పాత ఎలైన్మెంట్ ప్రకారం కారిడార్ సరిగ్గా రోడ్డు మధ్యలో వస్తుంది. దీనివల్ల ఇబ్బంది వస్తుందనే కారణంతో రోడ్డుతో సంబంధం లేకుండా కారిడార్‌ను కాలువ వైపునకు జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి డీఎంఆర్సీ (ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్) సర్వే నిర్వహిస్తోంది. సర్వే అనంతరం ఎలైన్‌మెంట్‌లో మార్పులు చేయనుంది. గతంలో బస్టాండ్ నుంచి రైల్వే పార్శిల్ కార్యాలయం వరకు బందరు రోడ్డు కారిడార్‌లో ఒక భాగాన్ని నిర్మించాల్సి ఉండగా దాన్ని పక్కకు జరిపి రైవస్ కాలువ, తుమ్మలపల్లి కళాక్షేత్రం మీదుగా రైల్వే స్టేషన్ సౌత్ గేటు వరకు మార్చారు. దీనివల్ల పోలీస్ కంట్రోల్‌రూమ్, అగ్నిమాపక శాఖ రాష్ట్ర కార్యాలయాలను తొలగించాల్సిన అవసరం లేకుండా పోయింది.
మెట్రో భూసేకరణకు కసరత్తు
మరోవైపు మెట్రో కారిడార్ నిర్మాణానికి అవసరమైన భూమిని తీసుకునేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఏలూరు, బందరు రోడ్డులలో మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేయాల్సిన చోట భూమిని సేకరించాల్సి ఉంది. ఎక్కడెక్కడ భూమి అవసరమవుతుందనే దానిపై డీఎంఆర్సీ రూపొందించిన నివేదిక ప్రకారం రెవెన్యూ అధికారులు గతంలో సర్వే చేశారు. దాని ప్రకారం ఆ రోడ్ల పక్కనున్న భూములకు సంబంధించిన యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు. నిడమానూరు వద్ద కోచ్ డిపో కోసం 60 ఎకరాలు సేకరించాల్సి ఉండడంతో దానిపైనా రెవెన్యూ అధికారులు నోటీసులిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కానీ అక్కడి రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండడంతో కొంత వెనక్కు తగ్గినా వారిని ఒప్పించి ముందుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు.