Pandu Ranga Reddy
-
వచ్చే నెల 18 నుంచి పీజీ ప్రవేశ పరీక్షలు
ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష(సీపీజీఈటీ)–2021ను వచ్చే నెల 18 నుంచి 27 వరకు ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు సీపీజీఈటీ కన్వీనర్ ప్రొ.పాండురంగారెడ్డి ఆదివారం తెలిపారు. 84 సబ్జెక్టులకు రాష్ట్రంలోని 12 జోన్లలో ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షల షెడ్యూలును ఉస్మానియా, పీజీ అడ్మిషన్స్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఉదయం 9.30 నుంచి 11 వరకు, మధ్యాహ్నం ఒటి గంట నుంచి 2.30 వరకు, సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు మూడు విభాగాలుగా పరీక్షల సమయాన్ని నిర్ణయించినట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 14 నుంచి వెబ్సైట్ ద్వారా హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. 40 వేలకు చేరిన మొత్తం సీట్లు రాష్ట్రంలోని పలు వర్సిటీల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో కొత్తగా 7 వేల సీట్లు పెరగడంతో మొత్తం పీజీ కోర్సుల్లో సీట్ల సంఖ్య 40 వేలకు చేరిందని పాండు రంగారెడ్డి తెలిపారు. సీపీజీఈటీకు ఈ నెల 28తో దరఖాస్తు గడువు ముగిసిందని, ఇప్పటివరకు 75 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన వివరించారు. పరీక్షకు రూ.500 అపరాధ రుసుముతో సెప్టెంబర్ 6 వరకు, రూ.2000 అపరాధ రుసుముతో 12వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. -
హైదరాబాద్ కాదు చిచులం!
సాక్షి, హైదరాబాద్: చిచులం.. ఈ పదం చాలామందికి కొత్త! కానీ హైదరాబాద్ ‘కథ’మరోలా ఉంటే.. ఇప్పుడు దాని స్థానంలో ఈ పదమే మార్మోగిపోయి ఉండేది. వినటానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజమంటున్నారు చారిత్రక పరిశోధకుడు కెప్టెన్ లింగాల పాండురంగారెడ్డి! హైదరాబాద్ పూర్వపు పేరు ఇదేనట. ఈ మేరకు ఆయన తన పరిశోధన వ్యాసాన్ని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో రెండ్రోజులపాటు జరిగిన అంతర్జాతీయ హెరిటేజ్ సదస్సులో సమర్పించారు. చివరి రోజైన శనివారం ఇదే అంశంపై మాట్లాడారు. చిచులం (స్థానిక ప్రజలు దీన్ని చచలంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని పుస్తకాల్లో కూడా చచలంగానే ప్రచురితమైంది) అంటే చింత చెట్టు అని అర్థం. ది రాయల్ హిస్టారికల్ సొసైటీ ఫెలో అయిన పాండురంగారెడ్డి చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘భాగ్యనగరం అంటే హైదరాబాద్‌కు మరోపేరని అందరికీ తెలిసిందే. ఈ నగరానికి హైదరాబాద్‌గా నామకరణం చేయటానికి ముందు భాగ్యనగరంగా పిలిచేవారని, ఇబ్రహీం కులీకుతుబ్‌షా–భాగమతిల ప్రణయ కావ్యానికి నిదర్శనమని భావిస్తారు. కానీ ఇదంతా కాల్పనిక గాథ. వారిద్దరి ప్రణయానికి అవకాశమే లేదని కుతుబ్‌షా వయసు, అక్కడి పరిస్థితులను చూస్తే అవగతమవుతుంది. భాగమతిని కలిసేందుకే మూసీపై వంతెన నిర్మించారంటారు. కానీ వంతెన కట్టిన సమయంలో ఇబ్రహీం వయసు పదిన్నరేళ్లు. ఆ వయసులో ప్రేమ ఎలా సాధ్యం. చరిత్రలో నిచిపోయిన కుతుబ్‌షా వంశవృక్షం వివరాలు, వారి కుటుంబ సభ్యుల వివరాల్లో ఎక్కడా భాగమతి ప్రస్తావనే లేదు. అసలు హైదరాబాద్ నగరానికి కుతుబ్‌షాహీలు పునాది వేశారన్న విషయమూ తప్పే. ఈ నగరం వెలియకముందే మూసీ నదికి దక్షిణాన చిచులం పేరుతో ఓ పెద్ద గ్రామం ఉంది. గోల్కొండ నగరంలో జనాభా పెరిగిపోవటం, ఇంతలో ప్లేగువ్యాధి ప్రబలటంతో జనం దాన్ని ఖాళీ చేసి వెలుపల తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే తోటలూ పెంచుకున్నారు. మూడునాలుగేళ్ల తర్వాత మళ్లీ వాటిని ఖాళీ చేసి కోట లోపలికి చేరారు. ఆ తాత్కాలిక ఇళ్లను ప్రజలు ఆక్రమించేసుకున్నారు. అవి కాలనీలుగా వెలిశాయి. చార్మినార్ ఆర్కిటెక్ట్‌గా పనిచేసిన మీర్ ముమిన్ ఈ చిచులంలోనే నివసించారు. అక్కడే చనిపోయారు. ఇప్పు డాయన సమాధి అక్కడే ఉంది. ఈ చిచులం విస్త రించి నగరంగా మారింది. తదుపరి హైదర్ అలీకి చిహ్నంగా దాన్ని హైదరాబాద్‌గా పిలిచారు. వెరసి హైదరాబాద్ అసలు పేరు చిచులం మాత్రమే. ఫ్రెంచ్ వజ్రాల వ్యాపారి టావర్నియర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి తోట(బాగ్)లు చూసి ఇది బాగ్ల నగరిగా పేర్కొన్నారు. అదే భాగ్యనగరమైంది. చిచులంలో బ్రాహ్మణవాడి అన్న ప్రాంతముండేది. అక్కడే కుతుబ్‌షాహీల గురువు, సూఫీ తత్వవేత్త చిరాగ్ ఉండేవారు. ఇప్పటికీ ఆయన సమాధి అక్కడే ఉంది. చిచులం విషయం ప్రాచుర్యంలోకి రావాల్సి ఉంది. భాగమతి–కుతుబ్‌షా ప్రణయకావ్యం కాల్పనికంగా బాగానే అనిపించినా చరిత్రలో దానికి స్థానం ఉండరావు. ఎందుకంటే చరిత్ర వాస్తవాలపై లిఖించేది..’’ -
కర్నూలు జిల్లాపై పగ ఎందుకో..
నంద్యాల: రాష్ట్ర విభజన తర్వాత కర్నూలు జిల్లాకు మంజూరైన పథకం ఏమైనా ఉందా అని తెలుగుదేశం నాయకులను రాయలసీమ పార్టీ అధ్యక్షుడు పాండురంగారెడ్డి ప్రశ్నించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కర్నూలు జిల్లాకు మంజూరైన ట్రిపుల్ ఐటీ కళాశాను పశ్చిమ గోదావరి జిల్లాకు బదిలీ చేస్తున్న జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తితో పాటు అధికార పార్టీకి చెందిన నాయకులు నోరు మెదపకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా అంటే ముఖ్యమంత్రికి గిట్టడం లేదన్నారు. అందులో భాగంగానే రాజధాని ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్నా పరిగణనలోకి తీసుకోలేదన్నారు. అంతేగాక జిల్లా ప్రజలను తీవ్రంగా బాధపెట్టడానికి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కర్నూలుకు వచ్చి విజయవాడ రాజధానిని చేస్తానని ప్రకటించి మరింత మనోవేదనకు గురి చేశారన్నారు. ట్రిపుల్ ఐటీని మార్చొద్దు.. కర్నూలు జిల్లాకు మంజూరు చేసిన ట్రిపుల్ ఐటీని పశ్చిమగోదావరి జిల్లాకు తరలించాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై సీపీఐ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధాన విద్యాలయాన్ని కర్నూలేతర ప్రాంతాల్లో ఉన్నాయన్నారు. మంజూరైన ఒక విద్యాసంస్థను కూడా పశ్చిమ గోదావరి జిల్లాకు తరలించడం చూస్తుంటే జిల్లాపై ఆయనకున్న అభిమానం ఏపాటిదో అర్థమవుతుందని విమర్శించారు. ఇటువంటి ప్రయత్నాలతో రాయలసీమలో ప్రత్యేక రాష్ట్ర అవతరణ తలెత్తుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు ఓటు రాజకీయం కొనసాగిస్తున్నారని ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదని సీపీఎం నంద్యాల డివిజన్ కార్యదర్శి మస్తాన్‌వలి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వైపు రాష్ట్ర విభజన తర్వాత కర్నూలు జిల్లాకు ఎలాంటి పథకాలు, విద్యాసంస్థలు మంజూరు కావడం లేదన్నారు. -
వైఎస్సార్ సీపీ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావం
తిరుపతి అర్బన్: వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక సోమవారం జరిగింది. తిరపతి సమీపంలోని దుర్గసముద్రం ధర్మరాజుల గుడి వద్ద జరిగిన సమావేశానికి వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పాండురంగారెడ్డి అధ్యక్షత వహించారు. ఎనిమిది జిల్లాలకు సంబంధించి డిస్కం అధ్యక్షులుగా తిరుపతి ఈఆర్వో-టి2 సీనియర్ అసిస్టెంట్ ఆర్.రమేష్‌బాబు, తిరుపతి కన్స్ట్రక్షన్ డివిజన్ సీనియర్ అసిస్టెంట్ బి.బాలాజి కార్యదర్శిగా ఏకగ్రీవంగా నామినేట్ అయ్యారు. రాబోయే డిస్కం ఎన్నికల వరకు వీరు వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీస్‌బేరర్లుగా పనిచేస్తారని, డిస్కం ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో కీలకపాత్ర పోషిస్తారని పాండురంగారెడ్డి తెలిపారు. నూతనంగా ఎన్నికైన ఈ కార్యవర్గం రీజినల్ కార్యవర్గాన్ని ఎన్నుకుంది. చిత్తూరు ఈఆర్వో-టి సీనియర్ అసిస్టెంట్ బి.వెంకోబరావు రీజనల్ అధ్యక్షులుగా, తిరుపతి రూరల్ సెక్షన్ లైన్‌మేన్ ఎస్.జయప్రకాష్‌ను రీజనల్ కార్యదర్శిగా ఎన్నుకున్నారు. వీరు జరగబోవు రీజనల్ ఎన్నికల వరకు పై పదవులలో కొనసాగుతారని వైఎస్సార్సీపీ డిస్కం అధ్యక్షులు రమేష్‌బాబు తెలిపారు. వైఎస్సార్సీపీ ఆశయాలకు, సిద్ధాంతాలకు అనుగుంణంగా పనిచేస్తూ, విద్యుత్ కార్మికుల హక్కుల సాధనకు చిత్తశుద్ధితో పోరాడుతామని నూతన కార్యవర్గం వెల్లడించింది. -
యూనియన్ బలోపేతానికి కృషి చేద్దాం
పులివెందుల రూరల్, న్యూస్‌లైన్ :వైఎస్ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ బలోపేతానికి నాయకులు, కార్మికులు కృషి చేయాలని ఆ యూనియన్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పాండు రంగారెడ్డి పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని వైఎస్ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో నూతన డివిజనల్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూనియన్ స్థాపించిన అనతి కాలంలో ఎంతో బలపడిందని, మరింత బలోపేతానికి కృషి చేయాలన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఐక్యంగా పోరాటం చేసి సాధించాలన్నారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండు చేశారు. రాష్ట్ర వైఎస్ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు బాషా మాట్లాడుతూ కార్మికుల డిమాండ్లు పరిష్కరించడంలో యాజమాన్యం మొండివైఖరి ప్రదర్శిస్తోందన్నారు. అనంతరం 327 యూనియన్ నుంచి కొండారెడ్డి, మోహన్ రామిరెడ్డి, పెద్దన్నతోపాటు మరికొంతమంది వైఎస్ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్‌లో చేరారు. నూతన కార్యవర్గం ఎంపిక : పులివెందుల డివిజనల్ వైఎస్ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డివిజనల్ అధ్యక్షుడుగా నాగేంద్ర ప్రసాద్, డివిజనల్ సెక్రటరీగా మంజునాథరెడ్డి, ట్రెజరర్‌గా గంగాధర, అదనపు సెక్రటరీగా బాబావల్లితో పాటు సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు మహేశ్వరరెడ్డి, సుధాకర్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.