panneru sealvam
-
పన్నీరు సెల్వం కీలక నిర్ణయం
-
పన్నీరు సెల్వం కీలక నిర్ణయం
చెన్నై: తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకే రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అన్నా డీఎంకే చీఫ్ శశికళ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవడంతో పాటు ప్రత్యర్థిని దెబ్బతీసేందుకు వీరిద్దరూ పావులు కదుపుతున్నారు. పోయెస్ గార్డెన్‌లోని జయలలిత నివాసాన్ని అమ్మ మెమోరియల్‌గా మార్చాలని పన్నీరు సెల్వం నిర్ణయించారు. గురువారం ఆయన ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయనున్నారు. పోయెస్ గార్డెన్లో ప్రస్తుతం శశికళ నివాసం ఉంటున్నారు. జయలలిత నివాసాన్ని అమ్మ మెమోరియల్‌గా మారిస్తే శశికళ పోయెస్ గార్డెన్‌ను ఖాళీ చేయాల్సి ఉంటుంది. అన్నా డీఎంకేలో శశికళ, పన్నీరు సెల్వం వర్గాల మధ్య పరస్పర ఆరోపణలతో చీలికదిశగా సాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవికి తనచేత బలవంతంగా రాజీనామా చేయించారని, జయలలిత మృతిపై విచారణ చేయించాలంటూ శశికళపై సెల్వం తిరుగుబాటు చేశారు. శశికళ వెంటనే పన్నీరు సెల్వంను పార్టీ కోశాధికారి పదవి నుంచి తొలగించి, పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కాగా పార్టీ నుంచి తనను తొలగించే అధికారం శశికళకు లేదని, తాను పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేసిన సెల్వం.. తన అనుమతి లేకుండా అన్నా డీఎంకే ఖాతాల నుంచి డబ్బులు తీసుకునేందుకు ఎవరికీ అనుమతించవద్దని బ్యాంకులకు లేఖ రాశారు. -
ముందు సెల్వం, తర్వాత శశికళ..
-
పన్నీరు సెల్వంకు ఫస్ట్ ఛాన్స్!
చెన్నై: అనూహ్య మలుపులు తిరుగుతున్న తమిళనాడు రాజకీయాల్లో గవర్నర్ పాత్ర కీలకంగా మారింది. ఈ రోజు (గురువారం) చెన్నై వెళ్తున్న మహారాష్ట్ర, తమిళనాడు ఉమ్మడి గవర్నర్ విద్యాసాగర్ రావు నిర్ణయం కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠంపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని అన్నా డీఎంకే చీఫ్ శశికళ చెబుతుండగా.. తనకు 45 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చెబుతున్నారు. ఇరు వర్గాలు గవర్నర్ అపాయింట్మెంట్ కోరాయి. గవర్నర్ విద్యాసాగర్ రావు తొలుత పన్నీరు సెల్వంకు అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశముంది. తనచేత బలవంతంగా రాజీనామా చేయించారని ఆరోపించిన పన్నీరు సెల్వం.. సభలో బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరనున్నారు. సభలో బలనిరూపణ జరిగితే ఎమ్మెల్యేలు తనవైపే వస్తారని ఆయన ధీమాగా ఉన్నారు. మరోవైపు శశికళ వర్గం కూడా గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరనున్నారు. శశికళకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలను ఇప్పటికే ఓ హోటల్‌కు తరలించారు. పార్టీలో 134 మంది ఎమ్మెల్యేలకుగాను 131 మంది శశికళ క్యాంప్‌లో ఉన్నారు. ఎమ్మెల్యేలందరితో కలసి శశికళ రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బలనిరూపణకు పన్నీరు సెల్వానికి అవకాశం ఇస్తారా? లేక ప్రభుత్వ ఏర్పాటుకు శశికళను ఆహ్వానిస్తారా? లేక అన్నా డీఎంకేలో చీలిక కారణంగా రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తారా? గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.