పన్నీరు సెల్వం కీలక నిర్ణయం
చెన్నై: తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకే రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అన్నా డీఎంకే చీఫ్ శశికళ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవడంతో పాటు ప్రత్యర్థిని దెబ్బతీసేందుకు వీరిద్దరూ పావులు కదుపుతున్నారు. పోయెస్ గార్డెన్లోని జయలలిత నివాసాన్ని అమ్మ మెమోరియల్‌గా మార్చాలని పన్నీరు సెల్వం నిర్ణయించారు. గురువారం ఆయన ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయనున్నారు. పోయెస్ గార్డెన్లో ప్రస్తుతం శశికళ నివాసం ఉంటున్నారు. జయలలిత నివాసాన్ని అమ్మ మెమోరియల్‌గా మారిస్తే శశికళ పోయెస్ గార్డెన్ను ఖాళీ చేయాల్సి ఉంటుంది.
అన్నా డీఎంకేలో శశికళ, పన్నీరు సెల్వం వర్గాల మధ్య పరస్పర ఆరోపణలతో చీలికదిశగా సాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవికి తనచేత బలవంతంగా రాజీనామా చేయించారని, జయలలిత మృతిపై విచారణ చేయించాలంటూ శశికళపై సెల్వం తిరుగుబాటు చేశారు. శశికళ వెంటనే పన్నీరు సెల్వంను పార్టీ కోశాధికారి పదవి నుంచి తొలగించి, పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కాగా పార్టీ నుంచి తనను తొలగించే అధికారం శశికళకు లేదని, తాను పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేసిన సెల్వం.. తన అనుమతి లేకుండా అన్నా డీఎంకే ఖాతాల నుంచి డబ్బులు తీసుకునేందుకు ఎవరికీ అనుమతించవద్దని బ్యాంకులకు లేఖ రాశారు.