వేదనిలయం నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న దీప
వేదనిలయం తాళాలను ప్రభుత్వం ఎట్టకేలకు వారసులకు అప్పగించింది. మాజీ సీఎం జయలలిత మరణం తర్వాత ఆమె ఉంటున్న వేద నిలయాన్ని అప్పటి ప్రభుత్వం స్మారక మండపంగా మార్చింది. దానిపై జయలలిత అన్న కుమార్తె, కుమారుడు కోర్టులో సవాలు చేశారు. వేద నిలయం వారసులదేనని కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే..
సాక్షి ప్రతినిధి, చెన్నై : న్యాయపోరాటం అనంతరం ఎట్టకేలకు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఇంటి తాళాలు ఆమె అన్న కుమార్తె, కుమారుడు దీప, దీపక్ చేతికి వచ్చాయి. ఆమె శుక్రవారం గృహ ప్రవేశం చేశారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత 2015 డిసెంబర్ 5న ఆకస్మిక మరణంతో రూ.కోట్ల ఆస్తికి వారసులు ఎవరన్న అంశం చర్చకు వచ్చింది. జయ కు చెన్నై పోయస్‌గార్డెన్‌లో సుమారు రూ.100 కోట్లు విలువ చేసే వేద నిలయం పేరున భవంతి ఉంది.
జయలలిత మరణించే వరకు అందులోనే ఉన్నారు. అక్కడి నుంచే రాజకీయ కార్యకలాపాలు సాగించేవారు. అలాగే మరికొన్ని కోట్ల ఆస్తులున్నట్లు ప్రచా రంలో ఉంది. జయ మరణం తర్వాత ఆస్తి వివాదం వేద నిలయం చుట్టూనే తిరిగింది. సీఎంగా అధికారం చేపట్టిన ఎడపాడి పళనిస్వామి వేద నిలయాన్ని జయ స్మారకమండపంగా మార్చేందుకు ప్రయత్నించారు. వారసులం మేముండగా తమ అనుమతి లేకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారని జయ అన్న సంతానమైన దీప, దీపక్ కోర్టులో పిటిషన్ వేశారు.
ఒక దశలో కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రావడంతో వేద నిలయం జయ స్మారక మండపంగా మారిపోయింది. అంతేగాక అప్పటి ప్రభుత్వం ప్రారంభోత్సవం చేసి వేద నిలయం వద్ద జయ స్మారక మండపం అనే బోర్డు పెట్టేసింది. వివాదం పూర్తిగా సమసిపోయే వరకు సందర్శకులను అనుమతించరాదని కోర్టు నిషేధాజ్ఞలు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని దీప, దీపక్ మద్రాసు హైకోర్టులో సవాలు చేశారు. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు చెల్లదని, మూడువారాల్లోగా వేద నిలయాన్ని వారసులకు అప్పగించాలని ఇటీవల తీర్పు చెప్పింది.
ఈ ఆదేశాలను అనుసరించి దీప, దీపక్ ఇరువురూ శుక్రవారం చెన్నై జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. జిల్లా కలెక్టర్ విజయరాణి వేద నిలయం తాళాలను వారికి అప్పగించారు. ‘కోర్టు ఆదేశాలను అనుసరించి వేద నిలయం తాళాలను అప్పగించాల్సిందిగా తనకు ఇటీవల వినతి పత్రం సమర్పించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి విచారణ తర్వాత తాళాలు అప్పగించాను’ అని జిల్లా కలెక్టర్ విజయరాణి మీడియాకు తెలిపారు. తాళాలు స్వీకరించగానే దీప, దీపక్ నేరుగా వేద నిలయం చేరుకున్నారు. ఇల్లంతా కలియతిరగడంతోపాటు రోడ్డు వైపున ఉన్న బాల్కనీలోకి వచ్చి ఆనందంతో పరిసరాల్లోని ప్రజలకు అభివాదం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment