సాక్షి, న్యూఢిల్లీ : కావేరీ జలాల పంపిణీపై తమిళనాట రాజకీయాలు వేడెక్కాయి. ఎండ వేడికి ఇవి మరింత మంటెక్కనున్నాయి. కావేరి బోర్డును ఏర్పాటు చేయాల్సిందిగా పార్లమెంట్‌లో ప్రతిరోజు అన్నాడిఎంకే సభ్యులు ఆందోళన చేస్తున్నా, తమిళనాడు వీధుల్లో కేంద్రం వైఖరికి నిరసనగా డీఎంకే కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి రాస్తారోకోలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వంలో మాత్రం ఉలుకూ లేదు. పలుకూ లేదు. ఏప్రిల్ ఐదవ తేదీన తమిళనాడు బంద్‌కు డీఎంకే పిలుపు కూడా ఇచ్చింది.
కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య ఎలా కావేరి జలాలను పంపిణీ చేయాలో కోర్టు ఉత్తర్వులను అమలు చేయడానికి వీలుగా ఓ ‘స్కీమ్’ను రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ ఫిబ్రవరి 16వ తేదీన సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 29వ తేదీన ఈ స్కీమ్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, జాప్యానికి ఎలాంటి సాకును చూపించడానికి వీల్లేదని, గడువులోగా కచ్చితంగా స్కీమ్‌ను రూపొందించాలని సుప్రీం కోర్టు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 29వ తేదీ వచ్చిందీ, వెళ్లింది. స్కీమ్ ఏర్పాటుకు పార్లమెంట్ లోపల, వెలుపలా ప్రతి రోజు ప్రజాందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా స్కీమ్ ఏర్పాటు దిశగా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
తీరిగ్గా ఈరోజు కోర్టు ముందుకు వచ్చి అసలు ‘స్కీమ్’ అంటే ఏమిటీ? ఎలాంటి స్కీమ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం ఎంతో అమాయకంగా సుప్రీం కోర్టు ముందకు వచ్చి వివరణ కోరింది. నదీ జలాల పంపిణీకి స్కీమ్ అంటే నిపుణులతో కూడిన ఓ బోర్డును ఏర్పాటు చేయడం అన్నది అటు కేంద్రానికి, ఇటు సుప్రీం కోర్టుకు తెలుసు. మరి మధ్యలో ఈ మాయా నాటకం ఎందుకు? కావేరీ జలాల పంపిణీ బోర్డును ఏర్పాటు చేయడం కర్ణాటకకు ఇష్టం లేదు. మిగులు జలాలను ఎలాగు వదిలేస్తామని, వాటిని వినియోగించుకోవాలన్నది కర్ణాటక ప్రభుత్వం వాదన. ఈ నెల 11వ తేదీన కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. ఈలోగా బోర్డును ఏర్పాటు చేస్తే కర్ణాటక ప్రజలు రాష్ట్రంలో బీజేపీకి ఓటు వేయరన్నది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అధిష్టానం భయం.
కావేరీ, జలాల విషయంలో గతంలో రక్తపాతం జరిగినందున ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ‘స్కీమ్’ అంటే అది ఎలా ఉండాలో చెబితే అమలు చేస్తామని కేంద్రం సుప్రీం కోర్టును కోరింది. మరి కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. తమిళనాడు బంద్ జరిగినా, పార్లమెంట్ సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేలోగా కేంద్రం స్పందించే అవకాశం లేదు.
Comments
Please login to add a commentAdd a comment