Para Legal Volunteers
-
విశ్వసనీయత తగ్గుతోంది!
పేదలకు న్యాయసహాయం అందకపోవడం వల్లేనన్న సీజేఐ న్యూఢిల్లీ: పేదలకు, నిరక్షరాస్యులకు సకాలంలో న్యాయ సహాయం అందకపోవడం వల్ల న్యాయ వ్యవస్థ విశ్వసనీయత దెబ్బతింటోందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఖేహర్ అన్నారు. పారా లీగల్ వాలంటీర్స్ (పీఎల్వీ) ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ సీజేఐ ఈ మేరకు అభిప్రాయపడ్డారు. సాధారణ, నిస్స హాయ వ్యక్తుల బాధలు తొలగించడానికి, వారికి జరిగే అన్యాయాన్ని రూపుమాపేం దుకు న్యాయ వ్యవస్థ తోడ్పడే విధంగా పీఎల్వీలు సహకరిస్తారని అన్నారు. పీఎల్‌వీల రెండు రోజుల జాతీయ సదస్సును సీజేఐ జస్టిస్ ఖేహర్ శనివారం ప్రారంభించి, ప్రసంగించారు. ‘న్యాయమూర్తుల పవిత్ర తీర్పు’ కంటే వలంటీర్లు పేదలకు చేసే సేవే ‘అత్యుత్తమమైనది’ అని ఆయన అన్నారు. పీఎల్వీ పథకం కింద సమర్థులైన పీఎల్వీలు గ్రామస్తులకు సహాయపడతారని అన్నారు. వారు న్యాయవాదులు కాకున్నా సమర్థులైన న్యాయనిపుణులు వారికి చట్టాలు, న్యాయవ్యవస్థపై అవగాహన కల్పిస్తారని అన్నారు. పీఎల్‌వీల పరిజ్ఞానానికి అందని వివాదాలుంటే వాటి పరిష్కారానికి దగ్గరలోని లోక్ అదాలత్ వంటి లీగల్ సర్వీస్ అథారిటీలను సంప్రదిస్తారని పేర్కొన్నారు. -
బ్యాంకుల వద్ద హెల్ప్‌డెస్క్‌లు
మచిలీపట్నం : పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకుల వద్ద ఖాతాదారులు ఇబ్బందులు పడకుండా పారా లీగల్ వాలంటీర్లతో వారికి సేవలు అందించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.లక్ష్మణరావు చెప్పారు. బుధవారం జిల్లా జడ్జి తన చాంబర్లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. పెద్ద నోట్ల రద్దుతో ఖాతాదారులు నగదు డిపాజిట్, తీసుకునే సమయంలో ఇబ్బందులు పడుతున్నారన్నారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ సూచనల మేరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పారా లీగల్ వాలంటీర్లను బ్యాంకుల వద్ద ఉంచి నగదు డిపాజిట్ చేసే సమయంలో, తీసుకునే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించడంతోపాటు సంబంధిత ఫారాలను పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. బుధవారం నుంచి ఈ సేవలు ప్రారంభమయ్యాయని, అవసరమైనన్ని రోజులు ఈ సేవలు అందజేస్తామన్నారు. మచిలీపట్నం ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్, ఆంధ్రాబ్యాంక్ ఫౌండర్స బ్రాంచ్, సిండికేట్ బ్యాంక్, గూడూరులో ఎస్బీఐ బ్యాంక్, పెడనలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ వద్ద పారాలీగల్ వాలంటీర్లను నియమించినట్లు చెప్పారు. జిల్లాలోని 11 మండల న్యాయసేవాధికార కమిటీల పరిధిలోని బ్యాంకుల వద్ద పారాలీగల్ వాలంటీర్ల సేవలను అందజేస్తామన్నారు. నగదు డిపాజిట్ చేసే సమయంలో దళారీల ప్రమేయం లేకుండా పారాలీగల్ వాలంటీర్లు చూస్తారని చెప్పారు. సమావేశంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పీఆర్ రాజీవ్ పాల్గొన్నారు. -
అందరికీ న్యాయ సహాయం
యాకుత్‌పురా: పారా లీగల్ వలంటీర్లందరూ ఇచ్చిన సూచనల ప్రకారం ప్రజలం దరికీ న్యాయ సహాయం అందించేందుకు కృషి చేయాలని సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి ఎన్.బాలయోగి సూచించారు. పురానీహవేలిలోని న్యాయసేవ సదస్సులో తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ, సిటీ సివిల్ కోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో గురువారం పారా లీగల్ వాలంటీర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. 65 మంది పారా లీగల్ వలంటీర్లకు గుర్తింపు కార్డులను అందజేశారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జడ్జి ఎన్ .బాలయోగి మాట్లాడుతూ... బస్తీలు, కాలనీల్లో వివిధ సమస్యలతో సతమతమవుతున్న ప్రజలకు న్యాయ వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు పారా లీగల్ లంటీర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించి వారికి న్యాయం చేకూర్చే విధంగా పని చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఏదైన సంఘటన జరిగినప్పుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు, కుటుంబ తగాదాలు తదితర అంశాలతో ఇబ్బందులు పడుతూ న్యాయ సహాయం కోరే వారికి వలంటీర్లు చేయూతనివ్వాలన్నారు. సదస్సులో తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇన్ చార్జి సభ్య కార్యదర్శి పీవీ రాంబాబు, అడ్మినిసే్ట్రటివ్ ఆఫీసర్ శ్రీనివాస శివరాం, సిటీ సివిల్ కోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి వై.వీర్రాజు, న్యాయవాదులు ఎస్.వేణుగోపాల్, మంజుష, విజేత తదితరులు పాల్గొన్నారు.