విశ్వసనీయత తగ్గుతోంది!
పేదలకు న్యాయసహాయం అందకపోవడం వల్లేనన్న సీజేఐ
న్యూఢిల్లీ: పేదలకు, నిరక్షరాస్యులకు సకాలంలో న్యాయ సహాయం అందకపోవడం వల్ల న్యాయ వ్యవస్థ విశ్వసనీయత దెబ్బతింటోందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఖేహర్ అన్నారు. పారా లీగల్ వాలంటీర్స్ (పీఎల్‌వీ) ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ సీజేఐ ఈ మేరకు అభిప్రాయపడ్డారు. సాధారణ, నిస్స హాయ వ్యక్తుల బాధలు తొలగించడానికి, వారికి జరిగే అన్యాయాన్ని రూపుమాపేం దుకు న్యాయ వ్యవస్థ తోడ్పడే విధంగా పీఎల్‌వీలు సహకరిస్తారని అన్నారు. పీఎల్‌వీల రెండు రోజుల జాతీయ సదస్సును సీజేఐ జస్టిస్ ఖేహర్ శనివారం ప్రారంభించి, ప్రసంగించారు.
‘న్యాయమూర్తుల పవిత్ర తీర్పు’ కంటే వలంటీర్లు పేదలకు చేసే సేవే ‘అత్యుత్తమమైనది’ అని ఆయన అన్నారు. పీఎల్‌వీ పథకం కింద సమర్థులైన పీఎల్‌వీలు గ్రామస్తులకు సహాయపడతారని అన్నారు. వారు న్యాయవాదులు కాకున్నా సమర్థులైన న్యాయనిపుణులు వారికి చట్టాలు, న్యాయవ్యవస్థపై అవగాహన కల్పిస్తారని అన్నారు. పీఎల్‌వీల పరిజ్ఞానానికి అందని వివాదాలుంటే వాటి పరిష్కారానికి దగ్గరలోని లోక్ అదాలత్ వంటి లీగల్ సర్వీస్ అథారిటీలను సంప్రదిస్తారని పేర్కొన్నారు.