Justice khehar
-
అవగాహన పెంచుకోండి...
భావి లాయర్లకు సీజేఐ జస్టిస్ ఖేహర్ పిలుపు సాక్షి, న్యూఢిల్లీ: సమాజాన్ని అర్థం చేసుకోలేని న్యాయవాది తన వృత్తిలో రాణించలేడని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ అన్నారు. బ్రిటిష్ పాలన నుంచి భారత్ విముక్తి పొందినా, స్వాతంత్య్రం నుంచి లభించే నిజమైన కీర్తి, ప్రతిష్టలను ఇంకా చూడలేదని పేర్కొన్నారు. శనివారం ఢిల్లీ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఐదో స్నాతకోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ, పీహెచ్‌డీలు పూర్తిచేసిన వారికి పట్టాలు ప్రదానం చేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అందజేసిన మొత్తం 25 బంగారు పతకాలు, 5 నగదు బహుమానాల్లో సీవీ ఆరాధన అనే విద్యార్థినికి 11 బంగారు పతకాలు దక్కాయి. అనంతరం సీజేఐ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ‘సమాజంలో పరిణామాలను అర్థం చేసుకోలేకపోతే న్యాయవాద వృత్తిలో రాణించలేరు. మీరు ప్రజాస్వామ్య పరిరక్షణలో ముందుండాలి’ అని అన్నారు. కార్యక్రమంలో ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి, విశ్వవిద్యాలయం చాన్స్‌లర్ తదితరులు పాల్గొన్నారు. -
పరారీలోనే పదవీ విరమణ
జస్టిస్ కర్ణన్ మరో రికార్డు న్యూఢిల్లీ: కలకత్తా హైకోర్టుకు చెందిన వివాదాస్పద న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్(62) సోమవారం పదవీ విరమణ సందర్భంగా మరో రికార్డు సొంతం చేసుకున్నారు. అరెస్టును ఎదుర్కొంటూ అజ్ఞాతంలో ఉండి పదవీ విమరణ చేసిన తొలి న్యాయమూర్తిగా దేశ న్యాయచరిత్రలో కర్ణన్ నిలిచిపోయారు. పదవిలో ఉండగా అరెస్టును ఎదుర్కొన్న న్యాయమూర్తిగా ఇప్పటికే పేరుపొందిన ఆయన.. కోర్టు ధిక్కారం నేరంపై సుప్రీంకోర్టు విధించిన జైలు శిక్ష నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. మే9న సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం కర్ణన్‌ను అరెస్టు చేయాలని ఆదేశించినప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. జైలు శిక్షపై స్టే కోసం సుప్రీం సెలవుకాల ధర్మాసనానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఊరట లభించలేదు. కోర్టు ధిక్కారనేరంపై తనను శిక్షించడం కుదరదని, తీర్పును రద్దు చేయాలని, తదుపరి విచారణపై స్టే విధించాలని మే 12న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం తీర్పుపై జోక్యం చేసుకోవాలని కర్ణన్ తరఫు న్యాయవాదులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. కాగా జస్టిస్ కర్ణన్ అరెస్టుకు సహకరించాలని కోరుతూ తమిళనాడు డీజీపీ రాజేంద్రన్‌కు పశ్చిమ బెంగాల్ డీజీపీ సోమవారం లేఖ రాశారు. ఆదినుంచీ వివాదాస్పదమే.. వివాదాస్పద ప్రవర్తన కారణంగా మద్రాస్ హైకోర్టులో పనిచేస్తున్న కర్ణన్‌ను గతేడాది మార్చి 11న కలకత్తా హైకోర్టుకు బదిలీ చేశారు. ఆ ఆదేశాల్ని కర్ణన్ ధిక్కరించడంతో ఆయనకు ఎలాంటి విధులూ అప్పగించొద్దని మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు సుప్రీం ఆదేశాలు జారీచేసింది. తమ ఆదేశాలు పాటించనందుకు కోర్టు ధిక్కరణకేసులో తమ ముందు హాజరుకావాలంటూ ఈ ఏడాది మార్చి 10న బెయిలబుల్ వారంట్ జారీచేసింది. మార్చి 31న సుప్రీంకోర్టుకు హాజరైన కర్ణన్ తన అధికారాల్ని పునరుద్ధరించాలని కోరగా కోర్టు తిరస్కరించింది. తనను జైల్లో పెట్టినా బెంచ్ ముందు హాజరుకానని కర్ణన్ స్పష్టం చేయడంతో.. అతని మానసిక స్థితిపై పోలీసుల సమక్షంలో వైద్యపరీక్షలు నిర్వహించాలని సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. వైద్యపరీక్షలు చేయించుకోవడానికి తిరస్కరిస్తూ మే 4న కర్ణన్ లేఖ ఇవ్వడంతో పాటు సుప్రీం న్యాయమూర్తుల్ని అరెస్టు చేయాలంటూ తన ఇంటి నుంచే ఆదేశాలు జారీచేశారు. -
విశ్వసనీయత తగ్గుతోంది!
పేదలకు న్యాయసహాయం అందకపోవడం వల్లేనన్న సీజేఐ న్యూఢిల్లీ: పేదలకు, నిరక్షరాస్యులకు సకాలంలో న్యాయ సహాయం అందకపోవడం వల్ల న్యాయ వ్యవస్థ విశ్వసనీయత దెబ్బతింటోందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఖేహర్ అన్నారు. పారా లీగల్ వాలంటీర్స్ (పీఎల్వీ) ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ సీజేఐ ఈ మేరకు అభిప్రాయపడ్డారు. సాధారణ, నిస్స హాయ వ్యక్తుల బాధలు తొలగించడానికి, వారికి జరిగే అన్యాయాన్ని రూపుమాపేం దుకు న్యాయ వ్యవస్థ తోడ్పడే విధంగా పీఎల్వీలు సహకరిస్తారని అన్నారు. పీఎల్‌వీల రెండు రోజుల జాతీయ సదస్సును సీజేఐ జస్టిస్ ఖేహర్ శనివారం ప్రారంభించి, ప్రసంగించారు. ‘న్యాయమూర్తుల పవిత్ర తీర్పు’ కంటే వలంటీర్లు పేదలకు చేసే సేవే ‘అత్యుత్తమమైనది’ అని ఆయన అన్నారు. పీఎల్వీ పథకం కింద సమర్థులైన పీఎల్వీలు గ్రామస్తులకు సహాయపడతారని అన్నారు. వారు న్యాయవాదులు కాకున్నా సమర్థులైన న్యాయనిపుణులు వారికి చట్టాలు, న్యాయవ్యవస్థపై అవగాహన కల్పిస్తారని అన్నారు. పీఎల్‌వీల పరిజ్ఞానానికి అందని వివాదాలుంటే వాటి పరిష్కారానికి దగ్గరలోని లోక్ అదాలత్ వంటి లీగల్ సర్వీస్ అథారిటీలను సంప్రదిస్తారని పేర్కొన్నారు. -
ఎన్నికల హామీలకు మీరే జవాబుదారీ
రాజకీయ పార్టీలకు సీజేఐ జస్టిస్ ఖేహర్ హితవు న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు హామీలు గుప్పించడం.. ఆ తర్వాత వాటిని నెరవేర్చకపోవడం రాజకీయ పార్టీలకు పరిపాటిగా మారిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ అన్నారు. మేనిఫెస్టోలు చిత్తు కాగితాలుగా మారుతున్నాయన్నారు. ఎన్నికల సమయాల్లో ఇచ్చే హామీలకు రాజకీయ పార్టీలు జవాబుదారీగా ఉండాలని సూచించారు. ‘ఎన్నికల సమస్యలు–ఆర్థిక సంస్కరణలు’ అనే అంశంపై శనివారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. అమలు సాధ్యం కాని హామీలను గుప్పిస్తూ పార్టీలు అధికారంలోకి వచ్చి వాటిని నెరవేర్చకుండా కుంటిసాకులు చెబుతున్నాయని పేర్కొన్నారు. మేనిఫెస్టోలోని అంశాలను ఒకవేళ ప్రజలు మర్చిపోయినా.. రాజకీయ పార్టీలను వాటికి జవాబుదారీగా చేయాలని అన్నారు. 2014 ఎన్నికల సందర్భంగా పార్టీలు విడుదల చేసిన మేనిఫెస్టోలు రాజ్యాంగ లక్ష్యాలకు దూరంగా ఉన్నాయని, బలహీన వర్గాలకు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించేలా లేవని చెప్పారు. సమాజంలో గ్రూపులను పోగుచేయడం, రాజకీయం చేయడం చుట్టూనే పార్టీలు తిరుగుతున్నాయని ఆయన విమర్శించారు. ఎన్నికల్లో గెలవడానికి కులాన్ని ఒక్కో నియోజక వర్గంలో ఒక్కోలా వాడుకుంటున్నారని ఖేహర్ అన్నారు. పార్టీలు ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెడుతున్నందువల్ల వారు పెద్దగా ఆలోచించకుండా ఓట్లేస్తున్నారనీ, అందువల్లే ఇంతకు ముందెన్నడూ లేని విధంగా, అస్థిర ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన పార్టీలు వాగ్దానాలను నెరవేర్చినా, నెరవేర్చకపోయినా తర్వాతి ఎన్నికల సమయంలో అది పెద్ద విషయమే కాకుండా పోయిందనీ, ఎందుకంటే దాదాపుగా అన్ని పార్టీలు అలాగే వ్యవహరిస్తూ వాగ్దానాలను నెరవేర్చకపోవడానికి కుంటిసాకులను చెప్పుకొంటున్నాయని ఆయన అన్నారు. -
మీ ప్రతిపాదనలను ఆమోదించలేం..
⇒ జడ్జీల నియామకాల విధివిధానాల మార్పునకు సుప్రీంకోర్టు కొలీజియం విముఖత ⇒ మా సిఫారసును జాతీయ భద్రతా కారణంతో తిరస్కరించలేరు ⇒ ఆధారాలిస్తే మేమే ఆ పని చేస్తాం.. మీకు వీటో అధికారం ఇవ్వలేం ⇒ అలా ఇస్తే రాజకీయ జోక్యం పెరిగిపోతుంది ⇒ ఎంఓపీపై కేంద్ర ప్రభుత్వానికి కొలీజియం స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకాల విషయంలో ఏళ్లతరబడి కొనసాగుతూ వస్తున్న కొన్ని విధివిధానాల్ని మార్చేందుకు సుప్రీంకోర్టు కొలీజియం విముఖత వ్యక్తం చేసింది. ఈ విషయంలో కేంద్రప్రభుత్వం చేసిన పలు సూచనలను, ప్రతిపాదనలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని కొలీజియం తిరస్కరించినట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా న్యాయ మూర్తుల పోస్టుకు సిఫారసు చేసిన వ్యక్తుల్లో ఎవరి పేరునైనా జాతీయ భద్రత కారణంతో తిరస్కరించే వెసులుబాటు తమకు కల్పించా లన్న కేంద్ర సూచనను నిర్ద్వంద్వంగా తోసి పుచ్చింది. అలాగే న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేసిన వ్యక్తుల పేర్లపై పరిశీలన జరిపేందుకు శాశ్వత సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలన్న సూచననూ తిరస్కరిం చింది. న్యాయమూర్తుల మీద వచ్చే ఫిర్యాదులపై విచారణ జరిపేందుకు కొలీజియంలో సభ్యులు కాని ముగ్గురితో కమిటీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదననూ తోసిపుచ్చింది. అయితే న్యాయమూర్తులుగా నియమితులయ్యేవారి వయోపరిమితి విషయంలో మాత్రం కేంద్రం సిఫారసులను ఆమోదించింది. ఈ విషయాలన్నింటినీ సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల కేంద్రానికి లేఖద్వారా తెలియచేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కేంద్రం ప్రతిపాదనలపై సుదీర్ఘ చర్చ న్యాయమూర్తుల నియామకాల విషయంలో కొలీజియం వ్యవస్థకు స్వస్తి పలికే దిశగా జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్‌జేఏసీ)ను కేంద్రం తీసుకురావడం, దీనిపై పిటిషన్ దాఖలవగా.. ఎన్‌జేఏసీ చెల్లదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునివ్వడం విదితమే. కొలీజియమే న్యాయమూర్తుల నియామకాలను చేపడుతుందని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన విధివిధానాల తాలూకు మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్ (ఎంఓపీ)ను రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఆ మేరకు కేంద్రం ఎంఓపీని తయారుచేసి సుప్రీంకోర్టు కొలీజియం ముందుంచింది. ఈ ఎంఓపీపై కేంద్రానికి, సుప్రీంకోర్టు కొలీజియానికి పలు అంశాల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. ఇరువర్గాలూ వెనక్కి తగ్గకపోవడంతో న్యాయమూర్తుల నియామకాల్లో అసాధారణ జాప్యం చోటు చేసుకుంది. ఎంఓపీపై జరుగుతున్న జాప్యాన్ని దృష్టిలో పెట్టుకున్న సీజే జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం ఇటీవల సమావేశమై కేంద్రం చేసిన పలు సూచనలు, ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించింది. కొలీజియం సిఫార్సులను కేంద్రం ఆమోదించి తీరాల్సిందే.. న్యాయమూర్తుల పోస్టుకు తాము సిఫారసు చేసిన వ్యక్తుల్లో ఎవరైనా వ్యక్తి నియామకం జాతీయ భద్రతకు ముప్పు కలిగించేలా ఉందని కేంద్రం భావిస్తే, అందుకు ఆధారాలను తమ ముందుంచితే కొలీజియం వాటిని ఎన్నటికీ పక్కనపెట్టదని తెలిపింది. కానీ జాతీయ భద్రతా కారణంతో కేంద్రం తమ సిఫారసులను వీటో చెప్పడానికి వీల్లేదని కొలీజియం తేల్చిచెప్పింది. ఇందుకు అనుమతినిస్తే న్యాయ నియామక ప్రక్రియ మొత్తం రాజకీయజోక్యంతో నిండిపోతుందని తన అభిప్రాయాన్ని కేంద్రానికి స్పష్టంచేసింది. అలాగే న్యాయమూర్తుల పేర్లపై విచారణ జరిపేందుకు ఎన్నో ఏళ్లనుంచి అనుసరిస్తూ వస్తున్న విధానం సక్రమంగానే ఉందని, అందువల్ల శాశ్వత సెక్రటేరియట్ ఏర్పాటు ఎంతమాత్రం అవసరం లేదంది. కొలీజియం తన సిఫారసులను మరోసారి కేంద్రానికి పంపినప్పుడు వాటిని కేంద్రం తప్పనిసరిగా ఆమోదించి తీరాల్సిందేనని కూడా స్పష్టంచేసింది. వయోపరిమితికి పచ్చజెండా.. న్యాయమూర్తుల నియామకాలకు పరిగణనలోకి తీసుకునే న్యాయవాదుల కనీస, గరిష్ట వయస్సుల విషయంలో కేంద్రం ప్రతిపాదనలకు కొలీజియం పచ్చజెండా ఊపింది. కనీసం 45 ఏళ్లు, గరిష్టంగా 55 ఏళ్లు ఉన్న న్యాయవాదినే న్యాయమూర్తిగా నియమించాలన్న ప్రతిపాదనను అంగీకరించింది. జల్లా జడ్జీల కోటా నుంచి న్యాయమూర్తిగా నియమించే వ్యక్తి గరిష్ట వయస్సు 58 ఏళ్లు ఉండాలన్న ప్రతిపాదననూ కొలీజియం ఆమోదిం చింది. ఇప్పుడు దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి. -
‘సుప్రీం’కు ఐదుగురు సిట్టింగ్ హైకోర్టు జడ్జీలు!
న్యూఢిల్లీ: నలుగురు హైకోర్టు చీఫ్ జస్టిస్‌లు సహా మొత్తం ఐదుగురు సిట్టింగ్ హైకోర్టు జడ్జీల పేర్లను ఉన్నత న్యాయస్థానానికి సుప్రీంకోర్టు కొలీజియం ఖరారుచేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహార్ నేతృత్వంలోని కొలీజియం ఈ జాబితాకు ఆమోదం తెలిపింది. ఇందులో మద్రాస్, రాజస్థాన్ , కేరళ, ఛత్తీస్‌గఢ్ హైకోర్టుల చీఫ్ జస్టిస్‌లు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ నవీన్ సిన్హా, జస్టిస్ మోహన్ , జస్టిస్ దీపక్ గుప్తలతోపాటుగా కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్‌లు ఈ జాబితాలో ఉన్నారు. -
జస్టిస్ ఖేహర్‌కు ‘ఎన్ జేఏసీ’ అడ్డుకాదు: సుప్రీం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఖేహర్ నియామకాన్ని అడ్డుకునేందుకు ఎన్ జేఏసీ తీర్పును సాకుగా చూపడం సరికాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ‘ఎన్ జేఏసీ తీర్పు’లో జస్టిస్ ఖేహర్ కీలక పాత్ర పోషించినందున సీజేఐగా ఆయన నియామకం చెల్లదంటూ పలువురు లాయర్లు వేసిన పిటిషన్ ను జస్టిస్ ఆర్కే అగర్వాల్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం కొట్టివేసింది. నాడు తీర్పునిచ్చిన ధర్మాసనంలో ఖేహర్‌తో పాటు మరో నలుగురు న్యాయమూర్తులు కూడా ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. అందులో నలుగురు ఎన్ జేఏసీకి వ్యతిరేకించగా, ఒక జడ్జి ఎన్ జేఏసీకి మద్దతిచ్చినట్లు పేర్కొంది. -
సీజేఐగా జస్టిస్ ఖేహర్
న్యూఢిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) 44వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాలులో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయనతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. 64 ఏళ్ల జస్టిస్ ఖేహర్ ఆంగ్లంలో దేవుని పేరిట ప్రమాణం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ పదవీ కాలం జనవరి మూడుతో ముగియడం తెలిసిందే. తన స్థానంలో సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ అయిన జస్టిస్ ఖేహర్ పేరును గత నెలలో జస్టిస్ ఠాకూర్ సిఫార్సు చేయడమూ విదితమే. దేశ చరిత్రలో సిక్కు వర్గానికి చెందిన వ్యక్తి సీజేఐగా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఆగస్టు 27 వరకు జస్టిస్ ఖేహర్ సీజేఐగా కొనసాగుతారు. జస్టిస్ ఖేహర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోపాటు పలువురు కేంద్రమంత్రులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. పలు కీలక ధర్మాసనాల్లో.. జస్టిస్ ఖేహర్ సుప్రీంకోర్టులో కీలక తీర్పులు వెలువరించిన పలు ధర్మాసనాల్లో పాలుపంచుకున్నారు. జాతీయ జ్యుడీషియల్ నియామకాల కమిషన్(ఎన్‌జేఏసీ)ను రద్దు చేయడమేగాక.. అత్యున్నత న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల నియామకం కోసం కొలీజియం వ్యవస్థను పునరుద్ధరిస్తూ తీర్పు చెప్పిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి జస్టిస్ ఖేహర్ నేతృత్వం వహించడం తెలిసిందే. -
పూర్తిగా మార్చనవసరం లేదు
♦ కొలీజియం విధానంపై సుప్రీంకోర్టు ♦ ఇప్పుడున్న వ్యవస్థ పరిధిలోనే మార్పులు చేయాలని వ్యాఖ్య న్యూఢిల్లీ: ఉన్నత కోర్టుల్లో జడ్జీల నియామకాలకు సంబంధించిన కొలీజియం విధానాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్ స్పష్టం చేసింది. అయితే ఇప్పుడున్న వ్యవస్థలోనే నియామకంలో మరింత పారదర్శకత కోసం అనుసరించాల్సిన విధానాలపై సూచనలను ఆహ్వానించింది. జడ్జీల నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం చేసిన ‘జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ)’ చట్టాన్ని సుప్రీం గత నెల 16న కొట్టివేయడం తెలిసిందే. ఈ అంశంపై జస్టిస్ జె.ఎస్.ఖేహర్, జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ ఎం.బి.లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఎ.కె.గోయల్‌లతో కూడిన రాజ్యాంగ బెంచ్ మంగళవారం తిరిగి విచారణ జరిపింది. అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, సొలిసిటర్ జనరల్ రంజిత్‌కుమార్, మరికొందరు ప్రభుత్వం తరఫు న్యాయవాదులతో పాటు ఎన్‌జేఏసీని వ్యతిరేకిస్తూ పిటిషన్లు వేసిన న్యాయవాదులు ఫాలీ నారీమన్, అనిల్ దివాన్ తదితరులు వాదనలు వినిపించారు. కొలీజియం విధానంలో పూర్తిస్థాయిలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని రోహత్గీ పేర్కొన్నారు. ‘ఎవరినైనా జడ్జీగా నియమించడంపై అందుకు తగిన కారణాలను స్పష్టంగా పేర్కొనాలి.స్పష్టమైన నిబంధనలతో కూడిన విధానం ఉండాలి. కొలీజియానికి ప్రత్యేక సచివాలయం ఉండాలి. దరఖాస్తులు స్వీకరించాలి. దీనిపై బార్ అసోసియేషన్ సభ్యులను పిలిచి చర్చించి.. నియామకాలు జరపాలి’ అని వాదించారు. నారీమన్ వాదిస్తూ.. నియామకాలను కొలీజియం పూర్తిస్థాయి బాధ్యతగా చేపట్టాలని.. ఆ తర్వాత పారదర్శకతపై చర్యలు చేపట్టవచ్చని పేర్కొన్నారు. వాదనలు విన్న బెంచ్.. ‘ఈ అంశంలో ఎన్నో విభిన్నమైన సూచనలు వచ్చాయి. వాటిని పరిగణనలోకి తీసుకోవడం, తీసుకోకపోవడం సాధ్యం కాదు. అందువల్ల ఈ సూచనలు, సలహాలన్నింటినీ ఇరువర్గాలు (ఎన్‌జేఏసీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పిటిషన్లు వేసిన లాయర్లు, ప్రభుత్వం) కలసి పరిశీలించి.. ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది’ అని జస్టిస్ ఖేహర్ పేర్కొన్నారు. విచారణను గురువారానికి వాయిదా వేశారు. జడ్జి ఉద్యోగం చచ్చేంత కష్టం: జస్టిస్ ఖేహర్ న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు జడ్జిగా రోజూ 8 గంటలు పనిచేయడం చచ్చేంత కష్టమని సుప్రీం జడ్జి జస్టిస్ ఖేహర్ అన్నారు. ‘ఈ కుర్చీలో మనుగడ సాగించటం అనేది ఆషామాషీ కాదు, మాపై ఆకాంక్షలు ఎక్కువగా ఉంటాయి. విరోధులూ ఎక్కవే. ఒత్తిడి భయంకరం. సుప్రీం కోర్టులో ఏడెనిమిదేళ్లు పనిచేయటం అంటే ప్రాణం పోయినంత పని’ అని అన్నారు. కొలీజియం వ్యవస్థపై దాదాపు రెండు గంటల పాటు జరిగిన వాదోపవాదాల్లో అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ మాట్లాడుతూ, నైపుణ్యాన్ని పరిగణలోకి తీసుకోరాదనుకుంటే, కనీసం 40 నుంచి 42 ఏళ్ల లోపు వయసులో జడ్జీలకు అవకాశం ఇవ్వటం సబబుగా ఉంటుందని అన్నారు. దీనికి ఖేహర్ బదులిస్తూ 20 ఏళ్లు న్యాయమూర్తిగా ఉండటం అనేది చాలా కఠినమైనదని అంటూ పై వ్యాఖ్యలు చేశారు.