అవగాహన పెంచుకోండి...
భావి లాయర్లకు సీజేఐ జస్టిస్ ఖేహర్ పిలుపు
సాక్షి, న్యూఢిల్లీ: సమాజాన్ని అర్థం చేసుకోలేని న్యాయవాది తన వృత్తిలో రాణించలేడని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ అన్నారు. బ్రిటిష్ పాలన నుంచి భారత్ విముక్తి పొందినా, స్వాతంత్య్రం నుంచి లభించే నిజమైన కీర్తి, ప్రతిష్టలను ఇంకా చూడలేదని పేర్కొన్నారు. శనివారం ఢిల్లీ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఐదో స్నాతకోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ, పీహెచ్‌డీలు పూర్తిచేసిన వారికి పట్టాలు ప్రదానం చేశారు.
ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అందజేసిన మొత్తం 25 బంగారు పతకాలు, 5 నగదు బహుమానాల్లో సీవీ ఆరాధన అనే విద్యార్థినికి 11 బంగారు పతకాలు దక్కాయి. అనంతరం సీజేఐ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ‘సమాజంలో పరిణామాలను అర్థం చేసుకోలేకపోతే న్యాయవాద వృత్తిలో రాణించలేరు. మీరు ప్రజాస్వామ్య పరిరక్షణలో ముందుండాలి’ అని అన్నారు. కార్యక్రమంలో ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి, విశ్వవిద్యాలయం చాన్స్‌లర్ తదితరులు పాల్గొన్నారు.