ఎన్నికల హామీలకు మీరే జవాబుదారీ
రాజకీయ పార్టీలకు సీజేఐ జస్టిస్ ఖేహర్ హితవు
న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు హామీలు గుప్పించడం.. ఆ తర్వాత వాటిని నెరవేర్చకపోవడం రాజకీయ పార్టీలకు పరిపాటిగా మారిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ అన్నారు. మేనిఫెస్టోలు చిత్తు కాగితాలుగా మారుతున్నాయన్నారు. ఎన్నికల సమయాల్లో ఇచ్చే హామీలకు రాజకీయ పార్టీలు జవాబుదారీగా ఉండాలని సూచించారు. ‘ఎన్నికల సమస్యలు–ఆర్థిక సంస్కరణలు’ అనే అంశంపై శనివారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. అమలు సాధ్యం కాని హామీలను గుప్పిస్తూ పార్టీలు అధికారంలోకి వచ్చి వాటిని నెరవేర్చకుండా కుంటిసాకులు చెబుతున్నాయని పేర్కొన్నారు.
మేనిఫెస్టోలోని అంశాలను ఒకవేళ ప్రజలు మర్చిపోయినా.. రాజకీయ పార్టీలను వాటికి జవాబుదారీగా చేయాలని అన్నారు. 2014 ఎన్నికల సందర్భంగా పార్టీలు విడుదల చేసిన మేనిఫెస్టోలు రాజ్యాంగ లక్ష్యాలకు దూరంగా ఉన్నాయని, బలహీన వర్గాలకు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించేలా లేవని చెప్పారు. సమాజంలో గ్రూపులను పోగుచేయడం, రాజకీయం చేయడం చుట్టూనే పార్టీలు తిరుగుతున్నాయని ఆయన విమర్శించారు.
ఎన్నికల్లో గెలవడానికి కులాన్ని ఒక్కో నియోజక వర్గంలో ఒక్కోలా వాడుకుంటున్నారని ఖేహర్ అన్నారు. పార్టీలు ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెడుతున్నందువల్ల వారు పెద్దగా ఆలోచించకుండా ఓట్లేస్తున్నారనీ, అందువల్లే ఇంతకు ముందెన్నడూ లేని విధంగా, అస్థిర ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన పార్టీలు వాగ్దానాలను నెరవేర్చినా, నెరవేర్చకపోయినా తర్వాతి ఎన్నికల సమయంలో అది పెద్ద విషయమే కాకుండా పోయిందనీ, ఎందుకంటే దాదాపుగా అన్ని పార్టీలు అలాగే వ్యవహరిస్తూ వాగ్దానాలను నెరవేర్చకపోవడానికి కుంటిసాకులను చెప్పుకొంటున్నాయని ఆయన అన్నారు.