పూర్తిగా మార్చనవసరం లేదు
♦ కొలీజియం విధానంపై సుప్రీంకోర్టు
♦ ఇప్పుడున్న వ్యవస్థ పరిధిలోనే మార్పులు చేయాలని వ్యాఖ్య
న్యూఢిల్లీ: ఉన్నత కోర్టుల్లో జడ్జీల నియామకాలకు సంబంధించిన కొలీజియం విధానాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్ స్పష్టం చేసింది. అయితే ఇప్పుడున్న వ్యవస్థలోనే నియామకంలో మరింత పారదర్శకత కోసం అనుసరించాల్సిన విధానాలపై సూచనలను ఆహ్వానించింది. జడ్జీల నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం చేసిన ‘జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ)’ చట్టాన్ని సుప్రీం గత నెల 16న కొట్టివేయడం తెలిసిందే. ఈ అంశంపై జస్టిస్ జె.ఎస్.ఖేహర్, జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ ఎం.బి.లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఎ.కె.గోయల్‌లతో కూడిన రాజ్యాంగ బెంచ్ మంగళవారం తిరిగి విచారణ జరిపింది.
అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, సొలిసిటర్ జనరల్ రంజిత్‌కుమార్, మరికొందరు ప్రభుత్వం తరఫు న్యాయవాదులతో పాటు ఎన్‌జేఏసీని వ్యతిరేకిస్తూ పిటిషన్లు వేసిన న్యాయవాదులు ఫాలీ నారీమన్, అనిల్ దివాన్ తదితరులు వాదనలు వినిపించారు. కొలీజియం విధానంలో పూర్తిస్థాయిలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని రోహత్గీ పేర్కొన్నారు. ‘ఎవరినైనా జడ్జీగా నియమించడంపై అందుకు తగిన కారణాలను స్పష్టంగా పేర్కొనాలి.స్పష్టమైన నిబంధనలతో కూడిన విధానం ఉండాలి. కొలీజియానికి ప్రత్యేక సచివాలయం ఉండాలి. దరఖాస్తులు స్వీకరించాలి. దీనిపై బార్ అసోసియేషన్ సభ్యులను పిలిచి చర్చించి.. నియామకాలు జరపాలి’ అని వాదించారు.
నారీమన్ వాదిస్తూ.. నియామకాలను కొలీజియం పూర్తిస్థాయి బాధ్యతగా చేపట్టాలని.. ఆ తర్వాత పారదర్శకతపై చర్యలు చేపట్టవచ్చని పేర్కొన్నారు. వాదనలు విన్న బెంచ్.. ‘ఈ అంశంలో ఎన్నో విభిన్నమైన సూచనలు వచ్చాయి. వాటిని పరిగణనలోకి తీసుకోవడం, తీసుకోకపోవడం సాధ్యం కాదు. అందువల్ల ఈ సూచనలు, సలహాలన్నింటినీ ఇరువర్గాలు (ఎన్‌జేఏసీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పిటిషన్లు వేసిన లాయర్లు, ప్రభుత్వం) కలసి పరిశీలించి.. ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది’ అని జస్టిస్ ఖేహర్ పేర్కొన్నారు. విచారణను గురువారానికి వాయిదా వేశారు.
జడ్జి ఉద్యోగం చచ్చేంత కష్టం: జస్టిస్ ఖేహర్
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు జడ్జిగా రోజూ 8 గంటలు పనిచేయడం చచ్చేంత కష్టమని సుప్రీం జడ్జి జస్టిస్ ఖేహర్ అన్నారు. ‘ఈ కుర్చీలో మనుగడ సాగించటం అనేది ఆషామాషీ కాదు, మాపై ఆకాంక్షలు ఎక్కువగా ఉంటాయి. విరోధులూ ఎక్కవే. ఒత్తిడి భయంకరం. సుప్రీం కోర్టులో ఏడెనిమిదేళ్లు పనిచేయటం అంటే ప్రాణం పోయినంత పని’ అని అన్నారు. కొలీజియం వ్యవస్థపై దాదాపు రెండు గంటల పాటు జరిగిన వాదోపవాదాల్లో అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ మాట్లాడుతూ, నైపుణ్యాన్ని పరిగణలోకి తీసుకోరాదనుకుంటే, కనీసం 40 నుంచి 42 ఏళ్ల లోపు వయసులో జడ్జీలకు అవకాశం ఇవ్వటం సబబుగా ఉంటుందని అన్నారు. దీనికి ఖేహర్ బదులిస్తూ 20 ఏళ్లు న్యాయమూర్తిగా ఉండటం అనేది చాలా కఠినమైనదని అంటూ పై వ్యాఖ్యలు చేశారు.