ఆర్ఎస్ఎస్ చీఫ్ కు త్రుటిలో తప్పిన ప్రమాదం
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న కాన్వాయిలోకి ఓ టాటా సుమో అకస్మాత్తుగా వచ్చి... కాన్వాయిలోని ఓ కారును ఢీ కొట్టింది. అయితే భగవత్‌కు ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు. దక్షిణ ఢిల్లీలో జరిగే ఓ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలోని పేరెడ్ రోడ్డులో ఆ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. అయితే మోహన్ భగవత్ కాన్వాయిలోకి ప్రవేశించిన టాటా సుమో హర్యానా నెంబర్ కలిగి ఉందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.