parents protests
-
పాఠశాలకు బొట్టు, పూలు పెట్టుకెళ్లారని..
తిరువణ్ణామలై: ఓ ప్రైవేట్ పాఠశాలకు బొట్టు, పూలు పెట్టుకెళ్లిన విద్యార్థినులను మోకాళ్లపై నిలబెట్టడాన్ని ఖండిస్తూ తల్లిదండ్రులు, హిందూ మున్నని కార్యకర్తలు ఆ పాఠశాల ముందు శుక్రవారం రాస్తారోకో చేశారు. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా సేత్తుపట్టు సమీపంలోని దేవికాపురంలో ఓ ప్రైవేట్ క్రైస్తవ మెట్రిక్ పాఠశాల ఉంది. ఇక్కడ సుమారు ఐదు వేల మందికి పైగా విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాలకు పూలు, బొట్టు పెట్టుకోవద్దని నిబంధనలు పెట్టినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దేవికాపురానికి చెందిన ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు గురువారం ఉదయం బొట్టు, పూలు పెట్టుకొని పాఠశాలకు వెళ్లారు. గమనించిన టీచర్ వాటిని తొలగించాలని తెలిపడంతో వారు పూలు, బొట్టును తొలగించారు. దీంతో వారిని పాఠశాల ఆవరణంలో మోకాళ్లపై నిలబెట్టారు. సాయంత్రం ఇంటికి వెళ్లిన ఇద్దరు విద్యార్థినులు తల్లిదండ్రులకు ఈ విషయం తెలిపారు. ఆగ్రహించిన తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. నిబంధనలు పాటించనందుకే దండన.. పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా రావడంతోనే ఇలా చేశామని పాఠశాల యాజమాన్యం తెలిపింది. దీంతో పాఠశాల యాజమాన్యంతో తల్లిదండ్రులు వాగ్వాదం చేశారు. విషయం తెలుసుకున్న హిందూ మున్నని కార్యకర్తలు పాఠశాల వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలూరు డీఎస్పీ చిన్నరాజ్, పోలీసులు తల్లిదండ్రులతో చర్చలు జరిపి రాస్తారోకోను విరమింప జేశారు. పోలీసులు పాఠశాల యాజమాన్యం వద్ద విచారణ చేస్తున్నారు. -
పెంచిన ఫీజులను ఉపసంహరించిన వాసవి కాలేజ్
సాక్షి, హైదరాబాద్ : విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనతో వాసవి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం దిగొచ్చింది. పెంచిన ఫీజులను ఉపసంహరించుకుంది. టీఎఫ్ఆర్సీ 2016-17 విద్యాసంవత్సరంలో చేరిన విద్యార్థులకు 86వేల ఫీజును నిర్ణయించినప్పటికీ, కాలేజ్ యాజమాన్యం లక్ష అరవై వేలు చెల్లించాల్సిందిగా విద్యార్థులపై ఒత్తిడి పెంచింది. దీనికి నిరసనగా విద్యార్థుల తల్లిదండ్రులు, తెలంగాణ పేరెంట్స్ అసోషియేషన్‌తో కలిసి ఆందోళనకు దిగారు. విద్యార్థులు కూడా తరగతులు బహిష్కరించి పేరెంట్స్‌తో పాటు నిరసనలో పాల్గొన్నారు. తల్లిదండ్రుల, విద్యార్థుల ఆందోళనతో దిగొచ్చిన కళాశాల యాజమాన్యం వారితో చర్చలు జరిపింది. పెంచిన 63వేల ఫీజును ఉపసంహరిస్తామని యాజమాన్యం తెలిపింది. నాలుగు సంవత్సరాల పాటు ఫీజులు కోసం విద్యార్థులపై ఒత్తిడి చేయమని వారికి హామి ఇచ్చింది. -
ఆ పాఠాలు చెప్పే టీచర్లు మాకొద్దు..
దేవనకొండ (కర్నూలు జిల్లా): పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు ప్రేమ పాఠాలు చెబుతుండటంతో విద్యార్థులు తల్లిదండ్రులకు మాకొద్దు ఈ టీచర్లు అని చెప్పారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ఆందోళనకు దిగారు. ఈ సంఘటన బుధవారం కర్నూలు జిల్లా దేవనకొండ మండలం జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో జరిగింది. ఈ పాఠశాలలో 713 మంది విద్యార్థులుండగా 21 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. కాగా, వీరిలో ఎక్కువ మంది ప్రేమ పాఠాలే చెబుతున్నారని విద్యార్థులు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకొని మాకొద్దు ఈ ఉపాధ్యాయులు అంటూ ఆందోళనకు దిగారు. విషయం తెలిసిన డీఈవో సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులను సముదాయించారు. ఈ సంఘటనపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఈవో హామి ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.