అమ్మానాన్న ఆత్మహత్య
- బాగోగులు పట్టించుకోని కుమారుడు
- పురుగుల మందు తాగిన వృద్ధ దంపతులు
- ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
- వెంకటగారిపల్లిలో దారుణం
మాయమైపోతున్నడమ్మా..మనిషన్నవాడు అన్న ఓ సినీ కవి ఘోష ఈ సంఘటన చూస్తే నిజమే అనిపిస్తుంది. కొడుకు, కోడలు, మనవుడూ, మనవరాళ్లు ఉన్నా ముసలి దంపతులు ఒంటరితనంతో అలమటించారు. మాట్లాడేవారు లేక లోలోన కుమిలిపోయారు. జబ్బు చేసి కదలలేని స్థితిలో ఉన్నా పిడికెడు మెతుకులు పెట్టేవారు కరువయ్యారు. కనీసం తాగునీళ్లు ఇచ్చే దిక్కు లేని దీనస్థితిలో బతికారు. చివరకు వారు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అందరూ ఉన్నా అనాథల్లా మృతిచెందారు. ఈ దారుణం బత్తలపల్లి మండలం వెంకటగారిపల్లిలో చోటుచేసుకుంది.
- బత్తలపల్లి
అసలే వృద్ధాప్యం...ఆపై బాగోగులు పట్టించుకోని కుమారుడు.. జీవితంపై విరక్తి చెందిన వృద్ధ దంపతులు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ధర్మవరం రూరల్ సీఐ శివరాముడు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటగారిపల్లి గ్రామానికి చెందిన నారాయణప్ప(70), సావిత్రమ్మ(65) దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ముగ్గురికీ వివాహాలు చేశారు. వీరిలో ఓ కుమార్తె భర్త పదేళ్ల క్రితం మృతిచెందాడు. రెండేళ్ల క్రితం ఒక కుమార్తె మృతి చెందింది. కుమారుడు మద్యానికి బానిసై వేరు కాపురం పెట్టాడు. పైగా మద్యం తాగొచ్చి రోజూ వారిని వేధించేవాడు. ఈ సమస్యలతో వృద్ధులు సతమతమయ్యేవారు. అయినా వృద్ధులు ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉంటూ జీవనం నెట్టుకొస్తున్నారు.
ఆపరేషన్‌తో కదలలేని స్థితి..
ఇలాంటి పరిస్థితుల్లో సావిత్రమ్మకు ఆరు నెలలు క్రితం ఆపరేషన్ జరిగి కదలలేని పరిస్థితి ఏర్పడింది. పక్షవాతంతో నారాయణప్పకు సైతం ఇదే పరిస్థితి. కనీసం కాలకృత్యాలు తీర్చుకోలేని పరిస్థితి. ఇక భోజనం సంగతి దేవుడి కెరుక. కుమారుడిని ప్రాధేయపడినా చేరదీయలేదు. తమ దీన పరిస్థితిపై విరక్తి చెంది గురువారం భార్యకు విషమిచ్చి నారాయణప్ప కూడా తాగి ఆత్మహత్యకు యత్నించారు. స్థానికులు గమనించి వారిని బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారి కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ నసీమాభేగం తెలిపారు. విషయం తెలుసుకున్న మాల్యవంతం పంచాయతీకి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకుని విచారం వ్యక్తం చేశారు.