మార్కెట్లోకి కొత్త పుస్తకాలు
మ్యూజిక్ డైస్
కవి: అరుణ్ సాగర్; పేజీలు: 48(గ్లేజ్డ్ప్రింట్); వెల:70; ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు
‘మైదానవాసి నిర్వాసితుడవడం వేరు, ఆదివాసి నిర్వాసితుడవడం వేరు. విస్తాపన గిరిజనుడికి మరణమే’ అంటున్నాడు కవి. పోలవరం బ్యాక్‌వాటర్స్‌లో మునిగిపోనున్న ఆదివాసీలకు మద్దతుగా వెలువడిన ‘ఒక మరణవాంగ్మూలము’ ఇది. ‘ఉరికంబపు కొయ్యలకు వేలాడే నీడలు/... కోయలు కొండరెడ్లు గదబలు సవరలు’ కారుస్తున్న ‘కోట్ల క్యూసెక్కుల కన్నీ’ళ్లను చూస్తే కలిగిన తోడుదుఃఖం. ‘నీ జనమే పోరాడుతున్నచోట కనీసం గొంతయినా కలపకపోవడం నేరం’ అన్న ఎరుకతో చేస్తున్న ‘ఒక మద్దతు ప్రకటన’.
కిటికీ తెరిస్తే...
రచన: విహారి; పేజీలు: 130; వెల: 110; ప్రతులకు: చినుకు పబ్లికేషన్స్, గరికపాటివారి వీధి, గాంధీనగర్, విజయవాడ-520003; రచయిత ఫోన్: 9848025600
‘కొందరు కేవలం కథకులు. కొందరు కవులు. కొందరు లాక్షణికులు. కొందరు విమర్శకులు. ఇవన్నీ సమపాళ్లలో ఉన్న అరుదైన రచయిత విహారి’. ఇది విహారి కలంపేరుతో రాసే జె.ఎస్.మూర్తి 12వ కథానికా సంపుటి. ఇందులో 15 కథలున్నాయి. ‘రేపు సంక్రాంతి’(కిటికీ తెరిస్తే); ‘ఇప్పుడు హాలంతా వెలుతురు రేకలే’(దృశ్యం - అదృశ్యం); ‘ధారాళంగా వీస్తున్న కమ్మతెమ్మర ‘ప్రోత్సాహ’కు మరింత ఉల్లాసాన్ని పంచుతోంది’(లక్ష్యం తోడు)... ఇలా ఆశావహ ముగింపుతోసాగే ఈ కథలు ఫీల్ గుడ్ భావన కలిగిస్తాయి.
పరిగెచేను
రచన: ఎలికట్టె శంకర్రావు; పేజీలు: 110; వెల: 70; ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్ హౌస్, బండ్లగూడ, హైదరాబాద్-68. ఫోన్: 040-24224453
ఇందులో 25 కథలున్నాయి. ‘రచయిత తన బాల్యాన్ని, తను చదువుకున్న పాఠశాల జీవితాన్ని, తన సార్లను, టీచరమ్మలను, తన స్నేహితులను మన ముందు సజీవంగా నిలుపుతాడు’. ‘మనలోని హాస్యప్రియత్వాన్ని బహిర్గతం చేయడానికి ఈ కథలు తోడ్పడతాయి’. అలాగే, ‘తెలంగాణ రైతు ఈతి బాధల్ని, ఆలోచనల్ని, అతని సంస్కారాన్ని అద్భుతంగా చూపించాడు శంకర్రావు’.