పార్లమెంట్ లో నోరు విప్పని రేఖ!
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలకు గైర్హాజరులో బాలీవుడ్ సీనియర్ సినీ నటి రేఖ అందరికంటే ముందు నిలిచారు. ఆమె హాజరు శాతం 5 శాతం మాత్రమేనని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ వెల్లడించింది. 2012, ఏప్రిల్ లో రాజ్యసభకు నామినేటయిన రేఖ ఇప్పటివరకు ఒక్క ప్రశ్న అడగలేదు. ఒక్క చర్చలోనూ ఆమె పాల్గొనలేదు. రేఖ తర్వాతి స్థానంలో మిథున్ చక్రవర్తి నిలిచారు. పార్లమెంట్ సమావేశాల్లో ఆయన హాజరు శాతం పది శాతం మాత్రమే.
చండీగఢ్ నుంచి లోక్సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న కిరణ్ ఖేర్ సినిమా నటుల్లో ఎక్కువసార్లు పార్లమెంట్ సమావేశాలకు హాజరయారు. ఆమె హాజరు శాతం 85గా ఉంది. 76 శాతంతో తర్వాతి స్థానాల్లో అహ్మదాబాద్ ఈస్ట్ బీజేపీ ఎంపీ పరేశ్ రావల్, టీఎంసీ ఎంపీ శతాబ్దిరాయ్, బీజేపీ ఎంపీ మనోజ్ తివారి నిలిచారు.
లోక్సభలో సగటు హాజరు 82 శాతం కాగా, రాజ్యసభలో 79 శాతంగా నమోదైంది. హేమమాలిని హాజరు 37 శాతంగా ఉంది. ఆమె 10 చర్చల్లో పాల్గొన్నారు. 113 ప్రశ్నలు అడిగారు. 68 శాతం హాజరు నమోదు చేసుకున్న షాట్ గన్ శత్రుఘ్నసిన్హా ఒక్క ప్రశ్న కూడా సంధించలేదు, ఏ చర్చలోనూ పాల్గొనలేదు.