నిఘా నీడలో..
♦ ఓ వైపు సీఎం పర్యటన
♦ మరో వైపు పార్లమెంటేరియన్ సదస్సు
♦ దేశ విదేశీ ప్రముఖల రాక
♦ నగరంలో అసాధారణ భద్రత చర్యలు
సాక్షి, విశాఖపట్నం : ప్రపంచ దేశాల ప్రతినిధు లు, జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు, ఉన్నతాధికారులు జిల్లాకు రానుండటంతో పోలీసు యంత్రాంగం భద్రతా వ్యవస్థను పటిష్టం చేసింది. రాష్ర్టంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో ముందస్తు చర్యలు చేపట్టింది. లా అండ్ ఆర్డర్, క్రైమ్, ట్రాఫిక్ విభాగాలకు చెం దిన అధికారులు సిబ్బంది సంయుక్తంగా నగరంలో రక్షణ వలయాన్ని ఏర్పరిచారు. సీఎం ప ర్యటనతో పాటు కామన్వెల్త్ పార్లమెంటేరియన్ సదస్సు కూడా ఉండటంతో పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.
నల్గొండ ఘటన తర్వాత వరుసగా జరుగుతున్న పరిణామాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం పోలీసు కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు, కొంతమంది ఎర్ర చందనం స్మగర్లు వేర్వేరు సంఘటనల్లో చనిపోయారు. ఈఎన్కౌంటర్లతో ఒక్కసారిగా రాష్ట్రంలో వాతావరణం వేడెక్కింది. దీంతో హై అలర్డ్ ప్రకటించిన ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు జిల్లాల ఎస్పీలు, సీపీలతో సమీక్షిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు బుధవారం నగరానికి రానున్నారు.
పలు ముఖ్య కార్యక్రమాలతో పాటు పార్లమెంటేరియన్ సదస్సులో ఆయన పాల్గొననున్నారు. సీఎం పర్యటనకు సాధారణంగా తీసుకునే భద్రత చర్యలతో పాటు మరింత పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ అమిత్ గార్గ్ ‘సాక్షి’తో అన్నారు. ఇక 10 దేశాలకు చెందిన వందలాది మంది స్పీకర్లు, ఎంపీలు, ఉన్నతాధికారులు నగరానికి వస్తుండటంతో వారి భద్రతకు ప్రాధాన్యమిస్తున్నామని సీపీ తెలిపారు.
సీఎం పర్యటన, విదేశీ ప్రముఖుల రాక, రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జిల్లా, నగర పోలీసులు గతంతో పోల్చితే అత్యంత అప్రమత్తమయ్యారు. ప్రముఖులందరూ నగరానికి వస్తుండటంతో జిల్లా ఫోర్స్‌ను కూడా నగరానికి రప్పిస్తున్నారు. జిల్లా ఎస్పీ పరిధిలోని అధికారులను, కానిస్టేబుళ్లను నగరంలో వివిధ ప్రాంతాలకు తరలించారు. ముఖ్యంగా ఈ సారి తనిఖీలు నిర్వహించే పోలీసులకు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు ఇచ్చారు.
ప్రతి ఎస్సై, ఆపై స్థాయి అధికారులు విధిగా తుపాకీ ధరించాల్సిందేనని ఆదేశాలివ్వడంతో అందరూ ఆయుధాలు చేతపట్టారు. నాకా బందీని ముమ్మరం చేశారు. లాడ్జీలు, హోటళ్లలో తనిఖీలు చేస్తున్నారు. బాంబ్ స్క్వాడ్, ఫైర్ సిబ్బందిని సిద్ధం చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సీఎం కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని నియమించారు. నగరం మొత్తం సీపీ పర్యవేక్షణలో పోలీసులు పహారా కాస్తున్నారు.