మీరట్ ఆశ్రమంలో పనివాళ్లూ రేపిస్టులే.. కేసు నమోదు!!
ఈ రోజుల్లో ఏ ఆశ్రయాన్ని చూసినా రేపిస్టులే కనిపిస్తున్నారు. వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు, ఆయన సుపుత్రుడే కాదు.. మరికొందరు రేపిస్టులు కూడా బయటపడుతున్నారు. మీరట్లో ఉన్న ఓ ఆశ్రమంలో తొమ్మిది మంది పనివాళ్లు ఓ కాలేజి విద్యార్థినిపై అత్యాచారానికి ప్రయత్నించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థిని ఫిర్యాదు మేరకు ఆశ్రమ ఇన్చార్జి సహా మొత్తం తొమ్మిదిమందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
నవంబర్ మూడో తేదీన ఆ యువతి ఆరోగ్యం బాగోలేకపోయినా.. స్వామి చంద్రమోహన్ దర్శనం కోసం ఆమె పరమాధమ్ ఆశ్రమానికి వెళ్లింది. స్వామికి నాలుగు రోజుల పాటు సేవలు చేసుకోవాలని చెప్పిన ముగ్గురు మహిళలు.. ఆమెను ఓ గదిలో బంధించారు. అనంతరం నలుగురు పురుషులు వచ్చి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె అభ్యంతరం చెప్పగా, అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. ఆమె అరుపులు విన్న ఇతర భక్తులు అక్కడికొచ్చి ఆమెను కాపాడారు.