విరాళం ముసుగు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం డబ్బులు ఇవ్వాలంటూ రేషన్ డీలర్లపై తెలుగు తమ్ముళ్లు ఒత్తిడి తెస్తున్నారు. అందుకోసం ఓ వ్యూహం కూడా సిద్ధం చేసుకున్నారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం లక్ష రూపాయల విరాళం ఇస్తున్నట్లు గుంటూరు జిల్లా తెనాలిలో ఓ రేషన్ డీలర్ ప్రకటించారు. ఇక్కడే లొసుగు ఉంది. ప్రకటించిన వ్యక్తి తెలుగుదేశం పర్టీ నాయకుడు. అతని పేరుతో రేషన్ షాపు లేదు. బినామీ పేరుతో నడుపుతున్నాడు. అతను చేసిన ప్రకటనను అడ్డం పెట్టుకుని రేషన్ డీలర్లంతా విరాళం ఇవ్వాలంటూ వారిపై జిల్లా నాయకత్వం ఒత్తిడి తెస్తోంది. తెనాలికి చెందిన రేషన్ డీలర్ చేసిన ప్రకటనతో తమకు సంబంధం లేదని ఒక పక్క పేర్కొంటున్నా.. టీడీపీ ఒత్తిడికి మాత్రం తలొగ్గుతున్నారు.
స్వచ్ఛందం పేరిట నిర్బంధంగా విరాళాలు సేకరించే ప్రక్రియకు తెలుగు తమ్ముళ్లు తెరలేపారు. అందుకోసం అధికారుల నుంచి తమపై ఒత్తిడి తెస్తున్నారని పలువురు డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేని పక్షంలో రేషన్ డీలర్ లెసైన్స్ రద్దు చేయిస్తామని బెదిరింపులు, వ్యాపారం ఎలా నిర్వహిస్తారంటూ హెచ్చరికలు, ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తిగా ముద్ర.. వంటి తదితర అంశాలు డీలర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. డీలర్లెవరూ తమ పేరును బహిర్గతం చేయకుండా ఎంతో కొంత ముట్టజెప్పడమే మంచిదన్న అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం.
ఇలా.. చేద్దాం
నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం రేషన్ డీలర్లు ఓ సరికొత్త ప్రతిపాదనపై చర్చిస్తున్నారు. జిల్లాలోని రేషన్ డీలర్లకు 1995 నుంచి ఇప్పటి వరకూ దాదాపు రెండు కోట్ల రూపాయల పైచిలుకు కమీషన్ రూపంలో లేదా ఇతరత్రా పౌరసరఫరాలశాఖ నుంచి రావాల్సి ఉంది. మధ్యాహ్న భోజన పథకం బియ్యానికి సంబంధించి 1995 నుంచి రేషన్ డీలర్లకు రూ. 60 లక్షల నగదు అందాల్సి ఉంది. ఇక 2001 నుంచి పనికి ఆహార పథకానికి సంబంధించి రూ.1.20 కోట్లు అందాలి. మత్స్యకారుల వేటకు విరామం, చేనేతలకు 35 కేజీల ఉచిత బియ్యం పంపిణీ, అన్నపూర్ణ, అంత్యోదయ కార్డుదారులకు ఉచిత బియ్యం తదితరాలకు సంబంధించి కమీషన్ రూపంలో మరో రూ.20 లక్షల వరకు రేషన్ డీలర్లకు పౌరసరఫరాలశాఖ చెల్లించాల్సి ఉంది.
ఆ మొత్తాన్ని మంజూరు చేస్తే అందులో కొంత నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇచ్చేందుకు డీలర్లు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు అధికారుల నుంచి అంగీకారం లభిస్తే జాయింట్ కలెక్టర్కు రాతపూర్వకంగా సంబంధిత విషయాన్ని తెలియజేయాలని తీర్మానించారు. నవ్యాంధ్ర ప్రదేశ్ నిర్మాణం కోసం తాము విరాళం ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఏ రూపంలో ఇవ్వాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని రేషన్ డీలర్ల సంఘ నాయకులు పేర్కొంటున్నారు.