parvathalu
-
కన్నకొడుకే కాలయముడు.. రోకలితో..
మంచిర్యాల: మద్యం మత్తులో జరిగిన తగవు ఓ ప్రాణాన్ని బలితీసుకుంది. తండ్రీకొడుకుల మధ్య జరిగిన గొడవలో కన్నతండ్రినే కుమారుడు రోకలితో మోది హత్యచేసిన ఘటన కౌటాల మండల కేంద్రంలోని నదిమాబాద్ కాలనీలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కాలనీకి చెందిన పంబాల పర్వతాలు (51) పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి కుమారుడు రవి, కుమార్తె స్వప్న సంతానం. రవి మద్యానికి బానిస కావడంతో అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా పర్వతాలు ఇటీవల గేదెను కొనుగోలు చేశాడు. సోమవారం తండ్రి ఇంట్లోలేని సమయంలో రవి గేదెను తీసుకెళ్లి సంతలో విక్రయించాడు. వచ్చిన డబ్బులతోనే మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు. విషయం తెలుసుకున్న తండ్రి కుమారుడిని నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న రవి విచక్షణ కోల్పోయి తండ్రిపై దాడికి పాల్పడ్డాడు. వంటగదిలో ఉన్న రోకలితో తండ్రి తలపై బాదడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రవిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలాన్ని కౌటాల సీఐ సాధిక్ పాషా పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మృతునికి భార్య వెంకక్క ఉన్నారు. -
అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో...
ముత్తారం: సాగు కోసం చేసిన అప్పులు ఓ రైతు ఆత్మహత్యకు దారితీశాయి. కరీంనగర్ జిల్లా ముత్తారం మండలం సీతంపల్లి గ్రామానికి చెందిన నూనేటి పర్వతాలు (45) తనకున్న మూడెరాలతోపాటు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని వివిధ పంటలు సాగు చేశాడు. నీటి కోసం బావి తవ్వించిన ఫలితం లేకపోవడంతో.. ఐదు బోర్లు వేయించాడు. అయినా చుక్కనీరు పడలేదు. దీంతో సుమారు రూ.5 లక్షల వరకు అప్పులు అయ్యాయి. వీటిని తీర్చలేని పరిస్థితిని తలచుకుని మనస్తాపం చెందిన పర్వతాలు శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఇంటి వద్ద పురుగుల మందు సేవించాడు. కుటుంబ సభ్యులు గమనించి కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.