డిప్యూటీ డీఎంహెచ్‌వో ఇళ్లల్లో సోదాలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం/బొబ్బిలి: పార్వతీపురం ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌వో మల్లిడి మార్కండేయ రవికుమార్‌రెడ్డి ఆదాయానికి మించి రూ.2.10 కోట్ల మేర ఆస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ అధికారుల సోదాల్లో బయటపడింది. బొబ్బిలి, పార్వతీపురం, తెర్లాం, విజయనగరం, విశాఖ ప్రాంతాల్లోని రవికుమార్ ఇళ్లు, కార్యాలయాలు, బంధువుల నివాసాలు కలిపి మొత్తం 8 చోట్ల ఏసీబీ సిబ్బంది బుధవారం తనిఖీలు నిర్వహించారు.
రవికుమార్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యులకు నాలుగు ఇళ్లు, ఒక ఇంటిస్థలం, 28 ఎకరాల వ్యవసాయ భూమి, ఒక కారు, 250 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. బ్యాంకులోని నగదు నిల్వతో కలిపి మొత్తం ఆస్తి విలువ రూ.3.70 కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. దానిలో ఆదాయానికి మించి సంపాదించిన ఆస్తి విలువ సుమారు రూ.2.10 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. డాక్యుమెంట్ల పరిశీలన, పూర్తి స్థాయిలో ఆస్తుల లెక్కింపు ప్రక్రియ బుధవారం అర్ధరాత్రి కూడా కొనసాగుతూ ఉంది.
8 ఏళ్ల కిందట కెరీర్ ప్రారంభం..
పశ్చిమగోదావరి జిల్లా మార్టేరుకు చెందిన రవికుమార్‌రెడ్డి 2003 నవంబర్‌లో ప్రభుత్వ వైద్యాధికారిగా కెరీర్ ప్రారంభించారు. విజయనగరం జిల్లా జియ్యమ్మవలసలో 2009 వరకు సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా పనిచేశారు. తర్వాత బొబ్బిలి మండలం పక్కి ఆస్పత్రిలో విధులు నిర్వర్తించారు. 2018లో పార్వతీపురం ఐటీడీఏలో డిప్యూటీ డీఎంహెచ్‌వోగా చేరారు. ప్రసుత్తం బొబ్బిలి పట్టణంలోని గొల్లపల్లిలో నివసిస్తున్నారు.