Parvatinayar
-
పార్వతీనాయర్‌కు లక్కీచాన్స్!
తమిళసినిమా: నటి పార్వతీనాయర్ కోలీవుడ్‌లో లక్కీచాన్స్ కొట్టింది. దుబాయ్‌లో పుట్టి పెరిగిన ఈ అమ్మడు మోడలింగ్ రంగం నుంచి నటిగా సినీరంగప్రవేశం చేసింది. మలయాళం, కన్నడ, తమిళ్ అంటూ పలు భాషల్లో నటించినా కథానాయకిగా చెప్పుకోదగ్గ అవకాశాలేమీ ఇప్పటి వరకూ అందుకోలేకపోయిందనే చెప్పాలి. అయితే కమలహాసన్ నటించిన ఉత్తమవిలన్, జయంరవితో నిమిర్న్దునిల్, అజిత్ చిత్రం ఎన్నై అరిందాల్ వంటి పలు తమిళ చిత్రాల్లో మెరిసింది. ఇటీవల కొడిట్ట ఇడంగళ్ నిరప్పుగా చిత్రంలో కథానాయకిగా నటించింది. ఆ చిత్రం అంతగా పేరు తెచ్చి పెట్టలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఉదయనిధిస్టాలిన్‌తో రొమాన్స్ చేసే అవకాశం దక్కించుకుంది. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ చిన్న గ్యాప్ తరువాత తమిళంలో దర్శకత్వం వహించనున్న చిత్రం ఇది. మలయాళంలో గత ఏడాది విడుదలై మంచి విజయాన్ని సాధించిన మహేషింటే ప్రతీకారం చిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం.ఇందులో నమిత మరో నాయకిగా నటించనున్నారు. ప్రమోద్, సముద్రఖని, ఎంఎస్.భాస్కర్ ముఖ్య పాత్రలను పోషించనున్న ఈ చిత్రాన్ని మూన్‌షాట్ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై సంతోష్ నిర్మించనున్నారు. మలయాళ చిత్రానికి తమిళంలో చిన్నచిన్న మార్పులు, చేర్పులు చేసి వినోదాన్ని మరింత పెంచి రూపొందించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. పార్వతీనాయర్ ఈ చిత్రంతో పాటు తెలుగులోనూ ఒక చిత్రం చేస్తోందట. మొత్తం మీద దక్షిణాది చిత్ర పరిశ్రమను చుట్టేస్తోందన్న మాట ఈ మలయాళీ బ్యూటీ. -
నాలోని నటనను బయటకు తీశారు!
నాలో నిగూఢమై ఉన్న నటనను దర్శకుడు పార్తిబన్ వెలికి తీసేలా చేశారని నటి పార్వతీనాయర్ పేర్కొన్నారు. ఎన్నై అరిందాల్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన మరో మలయాళీ భామ పార్వతీనాయర్. సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ చదివిన ఈ అమ్మడు ఆనక మోడలింగ్ రంగంలోకి ప్రవేశించారు. ఆ రంగంలో పేరు సినీరంగం వైపు మళ్లించింది. మిస్ కర్ణాటక, మిస్ నేవీ క్వీన్ కిరీటాలను గెలుచుకున్న పార్వతీనాయర్ ఎన్నై అరిందాల్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమయ్యారు. తాజాగా పార్తిబన్ దర్శకత్వం వహించిన కోడిట్ట ఇడంగళ్ నిరప్పగా చిత్రంలో నటుడు శాంతనుతో జత కట్టారు. ఈ చిత్రం పొంగల్ సందర్భంగా శనివారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా పార్వతీనాయర్ ఈ చిత్రంలో నటించిన అనుభవాన్ని పంచుకుంటూ కోడిట్ట ఇడంగళ్ నిరప్పుగా చిత్రంలో మోహిని అనే మలయాళీ అమ్మాయిగా నటించానని చెప్పారు. అయితే ఎవరి ఛాయలు లేకుండా ఈ చిత్రంలో నాయకి పాత్రను పోషించానని తెలిపారు. చిత్ర దర్శకుడు పార్తిబన్ తనకు ఎంతో నమ్మకం కలిగించి తనలోని నటనను వెలికి తీసేలా చేశారన్నారు. ఎలాంటి రిహార్సల్స్ లేకుండా నెల రోజుల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. తానిప్పటి వరకూ నటించిన కథా పాత్రల్లోనే కోడిట్ట ఇడంగల్ నిరప్పుగా చిత్రంలోని మోహిని పాత్ర ఛాలెంజ్‌తో కూడిందని పేర్కొన్నారు. చిత్ర హీరో శాంతను తనకు పక్క బలంగా నిలిచారని, తమ జంట నటన ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకంతో ఉన్నట్లు చెప్పారు. ఈ చిత్రంలో నటించిన తరువాత తాను తమిళ అమ్మాయిగా మారిపోయానని అంటున్న పార్వతీనాయర్ కోడిట్ట ఇడంగల్ నిరప్పుగా చిత్రం అందించే విజయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. -
వారి చిత్రాల విడుదలే ఓ పండుగ!
పండుగ రోజుల్లో పెద్ద హీరోల చిత్రాల విడుదల అవసరం లేదని ప్రముఖ దర్శక నిర్మాత, నటుడు పార్తిబన్ వ్యాఖ్యానించారు. కథై తిరైకథై వచనం ఇయక్కం వంటి విజయవంతమైన చిత్రం తరువాత ఈయన కీలక పాత్రలో నటిస్తూ దర్శక నిర్మాణ బాధ్యతలు, నిర్వహిస్తున్న చిత్రం కోడిట్ట ఇడంగళై నిరప్పుగ. పది మంది ఫండింగ్ నిర్మాతలతో కలిసి రీల్ ఎస్టేట్ కంపెనీ ఎల్ఎల్పీ, బైయోస్కోప్ ఫిలిం ఫ్రేమ్స్ సంస్థలపై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు బుధవారం సాయంత్రం ఆయన చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దర్శక నటుడు కే.భాగ్యరాజ్ వారసుడు, యువ నటుడు శాంతను కథానాయకుడిగా పార్వతీనాయర్ నాయకిగా నటించిన ఈ చిత్రంలో తంబిరామయ్య, సింగంపులి, ఆనవి ముఖ్య పాత్రలు పోషించారు. పార్తిబన్ కీలక పాత్రలోనూ, నటి సిమ్రాన్, అరుణ్‌విజయ్ అతిథి పాత్రల్లోనూ నటించిన ఈ చిత్రానికి అర్జున్ జెనా ఛాయాగ్రహణం, సత్య సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర వివరాలను పార్తిబన్ తెలియజేస్తూ కథై తిరైకథై వచనం ఇయక్కం చిత్రాన్ని చూసిన కొందరు కాస్త కన్ఫ్యూజన్గా ఉందని అన్నారన్నారు.అరుుతే ప్రేక్షకులు చాలా తెలివిగా ఉన్నారని, వారు ఆ చిత్రాన్ని విజయవంతం చేశారని పేర్కొన్నారు. ఈ చిత్రం ఇచ్చిన ధైర్యంతోనే ఈ కోడిట్ట ఇడంగళై నిరంపుగ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి ఏ ఫిలిం విత్ మిస్టెక్స్ అనే టాగ్‌ను పెట్టినట్లు తెలిపారు. చిత్రంలో ముద్దు సన్నివేశాలు ఉన్నట్లున్నాయన్న ప్రశ్నకు ముద్దు సన్నివేశాలే కాదు మొత్తం రొమాన్స సన్నివేశాలతో చిత్రం యమ కిక్ ఇస్తుందని బదులిచ్చారు. ఒక శిష్యుడిగా తన గురువు కే.భాగ్యరాజ్‌కు ఏదైనా చేయాలనుకున్నానని, అందులో భాగంగా ఆయన వారసుడు శాంతనును ఈ చిత్రంలో హీరోగా తీసుకున్నానని తెలిపారు. ఇది తనకు మంచి టేకాఫ్ ఆరుుతే తనకంటే సంతోషించేవారెవరూ ఉండరని పేర్కొన్నారు. ఈ చిత్ర ఆడియోను డిసెంబర్ నాలుగవ తేదీన, చిత్రాన్ని అదే నెల 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మండలికి ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నానన్నారు. పండగల సందర్భాల్లో పెద్ద హీరోల చిత్రాలు విడుదలవ్వాల్సిన అవసరం లేదన్నారు.వారి చిత్రాల విడుదలే పండగ అని, అందువల్ల ఆ సందర్భాల్లో చిన్న చిత్రాల విడుదలకు అవకాశం ఇస్తే చిన్న నిర్మాతలు నాలుగు డబ్బులు సంపాదించుకుంటారని పార్తిబన్ అన్నారు. -
శాంతనుకు జంటగా పార్వతినాయర్
యువ నటుడు శాంతనుకు జంటగా నటి పార్వతీనాయర్ నటించనున్నారు. సీనియర్ దర్శకుడు, నటుడు కె.భాగ్యరాజ్ కొడుకు శాంతను అన్న విషయం తెలిసిందే. ఈయన కథానాయకుడిగా పలు చిత్రాలలో నటించారు. ఇటీవల తన తల్లిదండ్రులతో కలిసి వాయ్‌మై అనే చిత్రంలోనూ నటించారు. అయినా హీరోగా తనకంటూ ఒక స్థానాన్ని అందుకోలేకపోయారు. కాగా కె.భాగ్యరాజ్ శిష్యులలో ఒకరు పార్తీపన్. దర్శకుడిగా, కథానాయకుడిగా పలు విజయవంతమైన చిత్రాలను చేసిన పార్తీపన్ కథై, తిరైకథై వచనం, ఇయక్కం చిత్రం తరువాత దర్శకుడు మరో చిత్రం చేయలేదు. చాలా గ్యాప్ తరువాత తాజాగా కొడిట్ట ఇడంగలై నిరప్పుగా అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో తన గురువు వారసుడు శాంతనుని కథానాయకుడిగా ఎంచుకున్నారు. ఇక కథానాయకిగా చాలా మందిని పరిశీలించిన పార్తీపన్ చివరికి నటి పార్వతినాయర్ను ఎంపిక చేశారు. మొదట ఈ చిత్రంలో కొత్త నటిని నాయకిగా పరిచయం చేయాలని భావించినా పార్వతినాయర్ తన కథలోని నాయకి పాత్రకు చక్కగా నప్పుతారని ఆమెను ఎంపిక చేసినట్లు పార్తీపన్ స్పష్టం చేశారు. ఇక నటుడు శాంతనును హీరోగా ఎంపిక చేయడంపై వివరిస్తూ శాంతను విజయం కోసం చాలా సిన్సియర్‌గా కృషి చేస్తున్నారన్నారు.అయినా ఎందుకనో అది ఆయనకు దూరం అవుతూనే ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందుకే శాంతను విజయం వెనుక తాను ఉండాలని భావించానన్నారు. గురువుకి శిష్యుడిగా అది తన బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రం చాలా బ్లాంక్లను పూర్తి చేస్తుందనే నమ్మకాన్ని దర్శకుడు పార్తీపన్ వ్యక్తం చేశారు. ఈ చిత్రం ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లిందన్నది గమనార్హం. -
పంది ఇతివృత్తంతో జట్లీ
నోరు లేని జీవాల ఇతివృత్తంతో ఇంతకు ముందు చాలా చిత్రాలు వచ్చాయి. శునకాలు, వానరాలు, ఏనుగులు, పాములు, పిల్లులు, గుర్రాలు ఇలా పలు జంతువులు ప్రధాన భూమికను పోషించిన చిత్రాలను చూశాం. వాటిలో అత్యధిక చిత్రాలు విశేష ప్రజాదరణ పొందాయి. అయితే పంది ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రాన్ని తొలి సారిగా త్వరలో చూడబోతున్నాం. ఈ చిత్రం పేరే జట్లీ. దర్శకుడు గౌతమ్‌మీనన్ వద్ద శిష్యరికం చేసిన జగన్‌సాయి తొలిసారిగా మెగాఫోన్ పట్టి ప్రధాన పాత్రను పోషిస్తూ తెరపై నవ్వులు పూయించడానికి సిద్ధం చేస్తున్న చిత్రం ఇది. ఇందులో ఉత్తమవిలన్ చిత్రం ఫేమ్ పార్వతీనాయర్, అరుంధతి కథానాయికలుగా నటిస్తున్నారు. కన్నన్ కన్నయ్య తదితరులు ముఖ్యపాత్రల్ని ధరిస్తున్న ఈ చిత్రం వివరాలను దర్శకుడు తెలిపారు. మనుషుల మూఢనమ్మకాలను ఎత్తి చూపే చిత్రంగా జట్లీ ఉంటుందన్నారు. శుభ శకునాలు, అపశకునాల నమ్మకాలతో ప్రజలు జీవనం సాగిస్తున్నారన్నారు. వాటిని సొమ్ము చేసుకునే ప్రయత్నంలో మరి కొందరుంటున్నారన్నారు. ఇలాంటి అంశాలను వినోదభరితంగా తెరపై ఆవిష్కరిస్తున్న చిత్రం జట్లీ అని తెలిపారు. ఇందులో ఒక తెల్లని పంది,గ్రాఫిక్స్ పంది గలాటా ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తాయన్నారు. హాలీవుడ్ సాంకేతిక కళాకారులు పని చేస్తున్న జట్లీ చిత్రంలో సాంకేతిక పరిజ్ఞానం అబ్బురపరుస్తుందనీ చెప్పారు. హాలీవుడ్ చిత్రాలు నార్నియా, లయన్ చిత్రాలకు పనిచేసిన మోడల్ యానిమేటర్ ఈ చిత్రానికి పని చేయడం విశేషమని పేర్కొన్నారు. జట్లీ చిత్ర ప్రధానోద్ధేశం ప్రేక్షకుల్ని నవ్వించడమేనని అన్నారు. చిత్ర షూటింగ్‌ను చెన్నై, తిరునెల్వెలీ ప్రాంతాలలో నిర్వహిస్తున్నట్లు దర్శక నటుడు జగన్‌సాయి వెల్లడించారు. దీనికి సత్య సంగీతాన్ని అందిస్తున్నారు.