‘మనుషుల్ని బతికించకపోయినా ఫరవాలేదు కానీ చంపకండి’
తెలంగాణ ముఖ్యమంత్రి సెక్యూరిటీల కండకావరం... దాదాపు చావు నుంచి బయటపడ్డాను. గొంతు తొక్కి, తోసి బయట పారేశారు. నా మిత్రుడి కాలు తొక్కి పడేశారు. ఆదివారం నాడు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఆవరణలో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమం మా ప్రాణానికి వచ్చింది. సెక్యూరిటీ అంటే చంపడమా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తూ ఉంటే చుట్టూ ఉన్నవాళ్లు పోలీసులా? లేక ప్రైవేట్ సైన్యమా? సీఎం కోసం అక్కడ ఉన్న ప్రతివాడినీ చంపేయాలా? అదృష్టవశాత్తూ చావు తప్పి, బయటపడ్డాం. ఈ పరిస్థితి నాకు (మాడభూషి శ్రీధర్), సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరికీ ఎదురైంది. గవర్నర్ బండారు దత్తాత్రేయ స్వయంగా ఫోన్ చేస్తే వెళ్ళకపోవడం భావ్యం కాదనుకుని ‘అలయ్ బలయ్’కి వెళ్ళాం. సీఎం వస్తున్నదశ. నేను, పాశం యాదగిరి దూరం నుంచి వేదిక వద్దకు రాకముందే సెక్యూరిటీ వారి అతి వల్ల ప్రమాదం వచ్చిపడింది. సీఎం చుట్టూ ఎవరు చచ్చిపోయినా ఫరవాలేదన్నట్టుగా రక్షకభటులు వ్యవహరించారు. నా గొంతు నొక్కేయడంతో నొప్పిగా ఉంది. యాదగిరి కాలిపైన నెత్తురు గాయమైంది. మందులు వాడుతున్నాం. ఇలాంటి రక్షణలో ఉండే సీఎం సామాన్యులకు రక్షణ ఏమిస్తారు? సీఎం చుట్టూ ఉన్నవారు మమ్మల్ని తొక్కిపారేశారు. ఒక దశలో నేను చనిపోతాననే అనిపించింది. అసలే ఆరోగ్యం పూర్తిగా బాగుకాని దశలో ఉన్నవాణ్ణి. నన్ను నేను ఏ విధంగా రక్షించుకోవాలి? నిజానికి సెక్యూరిటీ వారు మమ్మల్ని పక్కకు వెళ్లమని చెప్పి, ముఖ్యమంత్రిని భద్రంగా తీసుకువెళ్ళవచ్చు. ఆ మాత్రం కనీసపు ఇంగితం వాళ్ళకు లేకపోయింది. వీరు రక్షకులా, రజాకార్లా, కిరాయి గూండాలా? మా ప్రాణాలు పోతే ఈ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకుంటారా? ఒకవేళ చస్తే ఏం చేస్తారు? సంతాపం చెబుతారు. లేదంటే కుటుంబానికి కొన్ని లక్షలు ఇస్తారు. మనుషుల ప్రాణాల విలువ అంతేగా! సీఎం గారూ! వేదిక వద్దకు వచ్చే ముందు జనాన్ని చంపేయకండి. మీ అలయ్ బలాయ్ లేకపోతే మానె... సామాన్యుల్ని చంపకండి. బండారు దత్తాత్రేయ గారూ! మీ అలయ్ బలయ్ పేరుతో మీ మిత్రులనుకునే వారిని కూడా చావుకు సిద్ధం కమ్మనడం న్యాయం కాదు. ఈ పని బదులు తిండిలేని వారికి అన్నదానం చేయండి. ఇంకేం వద్దు. ఇదేదో అనుకోకుండా జరిగిన చిన్నతప్పు అని తోసిపారేయకండి. ఇక ముందు ఏ వేదిక దగ్గరా ఏ మనిషినీ తోసి, తొక్కేయకండి. నా వయసు 69. యాదగిరి 73 దాటిన వారు. పదిమంది కండలు పెంచుకున్న వారి దాడులకు మేం తట్టుకోలేం. ఈ రాష్ట్రం తట్టుకోలేదు. గొంతు నొక్కకుండా, కొట్టకుండా వీలు కాకపోతే ఈ అలయ్ బలయ్ లేకపోయినా ఫరవా లేదు. మనుషుల్ని బతికించకపోయినా ఫరవాలేదు కానీ చంపకండి. - మాడభూషి శ్రీధర్, రచయిత, ప్రొఫెసర్ - పాశం యాదగిరి, సీనియర్ జర్నలిస్ట్