ఇదో విచిత్రమైన 'క్యూ'
న్యూఢిల్లీ: డీమానిటైజేషన్ ప్రభావంతో ప్రజల కష్టాలకు అద్దం పట్టే సన్నివేశం ఒకటి మధ్యప్రదేశ్ లోచోటుచేసుకుంది. నగదు మార్పిడి కోసం బ్యాంకుల ముందు బారులు తీరుతున్న జనం లైన్లలో గంటల తరబడి నిలబడలేక, తమకు బదులుగా పాస్ బుక్ లను లైన్లలో ఉంచడం ఆసక్తికరంగా మారింది.
మధ్యప్రదేశ్ లోని శివపురిలో ఈ అరుదైన క్యూ లైన్ ప్రజల బాధలకు అద్దం పట్టింది. లైన్లలో బ్యాంకు ఖాతాదారులకు బదులుగా బ్యాంక్ పాస్ బుక్ లను ఉంచారు. నవంబరు 8 రాత్రి నుంచి అమల్లోకి వచ్చిన పెద్ద నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా ప్రజల్లోతీవ్ర ఆందోళన నెలకొంది. పాత నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల వద్ద నగదు విత్ డ్రాల కోసం ఏటీఎం సెంటర్ల దగ్గర జనం బారులు తీరడం విదితమే.
కాగా రద్దయిన పాత నోట్లను మార్చుకునే నగదుపరిమితిని కుదిస్తూ కేంద్రం గురువారం ప్రకటించింది. ఇప్పటివరకూ ఉన్న 4500 మార్పిడి పరిమితిని 2000 వేలకు కుదించింది. దీంతో ప్రజలనుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. పరిమితిని పెంచాల్సింది పోయి, తగ్గించడం తప్పుడు నిర్ణయమన్న విమర్శలు చెలరేగాయి.