మబ్బు కమ్మిన మాట
మబ్బొస్తే ఉరుమొస్తుందికానీ, ఈ మాట మబ్బు వేస్తే ఎందుకు మూగబోయింది?మనసుకున్న పొరలు మాటను కూడా కమ్మేస్తాయి.ఆ పొరలు విడిపోతేనే మాట మెరుపవుతుంది.
‘‘మీ వారికి మేం రావడం ఇష్టం లేనట్టుంది’’ పూర్ణ మాటలు చెవుల్లో గింగరుమంటున్నాయి స్వర్ణకు. పాప కీర్తన బర్త్‌డే పార్టీకి అన్ని ఏర్పాల్లు చేసింది స్వర్ణ. తన ఆఫీసు ఫ్రెండ్స్‌ని పిలిచింది. వచ్చినవారు సరిగ్గా భోజనాలు కూడా చేయకుండా వెళ్లిపోయారు. దీనికంతటికీ భర్త మురళి కారణమయ్యాడన్నది స్వర్ణ బాధ.
మూగబోతోన్న మాట
కొన్నాళ్లుగా మురళి ప్రవర్తన విసుగ్గా ఉంటోంది స్వర్ణకు. తమ పెళ్లై ఐదేళ్లవుతోంది. మురళి బంధువులబ్బాయే. ‘ఐటీ కంపెనీలో జాబ్, మంచి ప్రవర్తన గలవాడు’ అంటూ ఏరికోరి ఈ సంబంధం చేశారు తల్లిదండ్రి. తనకూ అన్నీ అనువుగానే అనిపించాయి. పెళ్లై మూడునెలలైనా సరిగా మాట్లాడింది లేదు. తనే చొరవ తీసుకొని మాటలు కలిపింది. గంటల గంటలు కూర్చొని కబుర్లు చెప్పేది. కానీ, మురళి ఏ విషయమైనా పొడి పొడిగా మాట్లాడేవాడు. అతనిలో ఆ కాస్త మార్పు తేవడానికి చాలానే కష్టపడింది. ఏడాది తిరక్కుండానే ఇంట్లోనే ఉండి వర్క్స్ చేస్తానని ఉద్యోగం మానేశాడు. జాబ్ చూసుకోమంటే ‘ఇంట్లో ఉండే సంపాదిస్తున్నాను’ కదా అంటాడు. ఏ చిన్న వస్తువైనా తనే బయటకె ళ్ళాలి. తను గర్భవతిగా ఉన్నప్పుడు హాస్పిటల్‌కి రమ్మన్నా వచ్చేవాడు కాదు. నెలల బిడ్డప్పటి నుంచీ పాప కేం కావాలన్నా బయట నుంచి తనే తెచ్చుకునేది.
పాపకు ఆరోగ్యం బాగోలేకపోయినా తనే ఎవరో ఒకరి సాయం తీసుకొని ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందే తప్ప మురళి రాడు. పాపను స్కూల్లో వేయడానికి రమ్మని అడిగితే ‘‘అదేదో నువ్వే వెళ్లి చూడు..’’ అని సమాధామిచ్చాడు. అడిగి అడిగి విసుగొచ్చి తనే స్కూల్ పనులు కూడా పూర్తి చేసింది. ఇంటా బయట పనులన్నీ తనే చూసుకుంటోంది. ఆ తర్వా త్తర్వాత అడగడమే మానేసింది. విసిగిపోయి తనే ఓ ఉద్యో గం చూసుకుంది. పాపకు మూడో ఏడు. బర్త్‌డే పార్టీ చేద్దామంటే మురళి వినిపించుకోడు. ‘ఎందుకు, డబ్బులు దండగ’అనేవాడు. ఇప్పుడు తను సంపాదిస్తోంది. డబ్బుకు ఇబ్బంది లేదు. మురళి వద్దని చెప్పినా పాప బర్త్ డేకి తన ఫ్రెండ్స్ అందరినీ పిలిచింది స్వర్ణ. అంతా ఇంటికి వచ్చారు. మురళి చాలాసేపటి వరకు రూమ్‌లో నుంచి బయటకే రాలేదు. బలవంతపెడితే తప్పదన్నట్టుగా వచ్చాడు. తన స్నేహితులందరినీ పరిచయం చేసింది. ముభావంగా, కొద్దిసేపు అతి కష్టంగా ఉన్నాడు.
తర్వాత పని ఉందంటూ లోపలికెళ్లిపోయాడు. పార్టీ పూర్తయ్యేంతవరకు బయటకే రాలేదు. ‘‘మీ వారికి మేం రావడం ఇష్టం లేనట్టుంది’’ అంది స్నేహితురాలు పూర్ణ. ‘నిజమే!’ అన్నారు మిగతా అందరూ. ‘ఆయనకు ఒంట్లో బాగోలేద’ని అబద్ధం చెప్పిం ది వారితో. భర్త మీద విపరీతమైన కోపం వచ్చింది స్వర్ణకు. ‘‘ఇంటికి వచ్చినవారితో ఇలాగేనా ప్రవర్తించేది. మీరు అసలే లేకపోతే పిల్లకు తండ్రి లేడని ఎలాగోలా సర్దిచెప్పు కునేదాన్ని. మీ ప్రవర్తన వల్ల మేం ఎటూ కాకుండా పోతున్నాం.. ఈ రూమ్‌లోనే పడి చావండి’’ అంటూ తన బాధనంతా కోపంగా చూపించి అక్కణ్ణుంచి వెళ్లిపోయింది.
మాటలేదు.. ఉత్తరం ఉంది..
‘‘వరుణ్... బావగారిని ఆసుపత్రిలో చేర్చాం రా! నాకు భయంగా ఉంది’’ ఫోన్లోనే ఏడుస్తూ చెప్పింది స్వర్ణ తమ్ముడు వరుణ్‌తో. ఆఘమేఘాలమీద వచ్చాడు వరుణ్. రాత్రి మురళి నిద్రమాత్రలు మింగాడట. ఇరుగుపొరుగు సాయంతో హాస్పిటల్లో చేర్చానని చెప్పింది స్వర్ణ. మురళి రాశాడంటూ ఏడుస్తూనే ఓ ఉత్తరాన్ని తీసుకొచ్చి వరుణ్ చేతికిచ్చింది. ‘‘స్వర్ణా.. నన్ను క్షమించు. నా బాధ్యతలేవీ నిర్వర్తించలేకపోతున్నాను. కొత్తవారితో మాట్లాడాలంటే నాకు మాట పెగలదు. ఏదో భయంగా, గుండె దడగా ఉంటుంది. నత్తి వస్తుంది. చెమటలు పట్టేస్తాయి. ఈ భయం వల్లే ఉద్యోగానికి వెళ్లలేకపోయాను. బంధువుల అమ్మాయే అని నాకు నచ్చజెప్పి నీతో పెళ్లి జరిపించారు అమ్మానాన్న. నీతో సర్దుకుపోవడానికే నాకు కొన్నాళ్లు పట్టింది.
ఉద్యోగం మానేశాక నలుగురిలో కలవడమే మర్చిపోయాను. పార్టీకి వచ్చినవారితో అలాగే మాట్లాడలేకపోయాను. నేను నత్తి నత్తిగా మాట్లాడితే ఏదో లోపం ఉందనుకుంటారు. అది నీకు అవమానం అని భయపడ్డాను. నా వల్ల ఎవరికీ ఉపయోగం లేదని, నేను చచ్చిపోతే బాగుండు.. అని పదే పదే అనిపిస్తోంది. నేను లేకపోతే నీకేసమస్య ఉండదన్నావు. అదే సరైనది అనిపించింది. అందుకే వెళ్లిపోతున్నాను...’’ మురళి రాసిన ఉత్తరం చదివిన వరుణ్‌కి నోట మాటరాలేదు. ‘‘అక్కా, ఇన్నాళ్లూ బావగారు ఒంటరిగా ఉంటుంటే అంతర్ముఖుడని, గర్వమని అనుకున్నాను. ఇలా అని తెలియక నేనూ తప్పుపట్టాను. బావగారిలో గూడుకట్టుకున్న ఈ భయాన్ని బయటకు తరిమేసే మార్గముంది. ఆయన కోలుకునేంతవరకు ఆగుదాం’’అని స్వర్ణకు ధైర్యం చెప్పాడు వరుణ్.
గతం చేసిన గాయం థెరపీతో మాయం
కౌన్సెలర్ మురళితో ‘‘మీ భయం తాలూకు ‘బ్లాక్’ మీ ఈ జీవితంలోనో గత జన్మలోనూ ఉండి ఉంటుంది. దానిని తెలుసుకొని, అర్థం చేసుకొని బయటకు రావడానికి ప్రయత్నించండి’’ అన్నారు. అది పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ ఇచ్చే క్లినిక్. ఏళ్లుగా గూడుకట్టుకున్న ఆవేదనలు తొలగేచోటు ఇదే అనిపిం చింది మురళికి. మురళి సరే అనడంతో ధ్యానప్రక్రియ మొదలైంది. ప్రశాంతంగా నిద్రపోయినట్టుగా ఉంది మురళికి. తన కళ్లముందు ఎన్నో అందమైన దృశ్యాలు.. ఆందోళన పరిచిన ఘటనలు కనిపిస్తున్నాయి. మెల్ల మెల్లగా వాటి నుంచి విడివడుతున్నాడు. కాసేపటికి సూచనలు ఇవ్వడం మొదలుపెట్టారు కౌన్సెలర్. మురళి అంతర్గత ప్రయాణం మొదలైంది. 35 ఏళ్ల నుంచి పాతికేళ్లకు అటు నుంచి కాలేజీ రోజులకు, స్కూల్ వయసుకు చేరుకున్నాడు ఆ ప్రయాణంలో. అన్నేళ్లలో పట్టుచిక్కనిదేదో దొరికినట్టు ఉద్వేగపడిపోయాడు మురళి.
తనకు కలిగిన అనుభవాన్ని చెబుతున్నాడు.‘‘క్లాస్‌రూమ్‌లో ఉన్నాను. అప్పుడు నాకు ఎనిమిదేళ్లు. నేను నా ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నాను. టీచర్ నన్ను తిడుతోంది. ఆమె చాలా కోపంగా ఉంది. నా బట్టలు విప్పేసి బెంచీ మీద నిలబెట్టింది. అంతా నన్ను చూసి నవ్వుతున్నారు. నేను ఏడుస్తున్నాను. నేను మాట్లాడితే నన్ను కొడతారు, అందరూ హేళన చేస్తారు..’’ అని చెబుతున్న మురళి కళ్లు కన్నీళ్లు వర్షిస్తున్నాయి. ఆ ఉద్వేగం నెమ్మదించాక ‘ ఇంకా ప్రయత్నించండి... అమ్మ గర్భంలో ఉన్న క్షణాలు, ఆ తర్వాత కిందటి జన్మ రోజులను అవగతం చేసుకోండి...’ అని కౌన్సెలర్ సూచనలు అందుతున్నాయి మురళికి. అతని అంతర్గత ప్రయాణం మళ్లీ మొదలైంది. కాసేపటికి ఏదో దర్శించినట్టుగా మురళి చెప్పడం మొదలుపెట్డాడు. ‘‘నేను గూడెం నాయకుని కొడుకుని. నేనో అమ్మాయిని ప్రేమించాను.
మేం మాట్లాడుకోవడం చూసిన పెద్దలు మమ్మల్ని తీసుకొచ్చి అందరి ముందు నిలబెట్టారు. అందరూ మమ్మల్ని దోషులుగా చూస్తున్నారు. మమ్మల్ని తీవ్రంగా కొట్టారు. ఎదురు చెప్పానని నన్ను ఉరితీశారు’’ మురళి ఉద్వేగంగా చెబుతున్నాడు. కౌన్సెలర్ మాట్లాడుతూ -‘‘ఆ జీవితానికి ఈ జీవితానికి మధ్య ఉన్న అగాధాన్ని ఎలా పూడ్చుకుంటున్నారు?’’ అని అడిగారు. ‘‘టీచర్ నా పట్ల నిర్దయగా ప్రవర్తించింది. కానీ, ఆమెను క్షమిస్తున్నాను. అప్పటి గూడెం కట్టుబాట్లు ఆ జన్మకు మాత్రమే. వాటితో ఈ జన్మను బాధించుకోను. నన్ను నమ్ముకున్నవారికి అన్యాయం చేయను...’’ అని నెమ్మదించాడు మురళి.
కౌన్సెలర్ ఇచ్చిన సూచనలతో థెరపీ పూర్తయింది.
భయాలు తొలగిన సంబరం మురళి ఇంట్లో అంతా సందడిగా ఉంది. మురళి స్వర్ణల పెళ్లి రోజు పార్టీ సంబరంగా జరుగుతోంది అక్కడ. అందరితో నవ్వుతూ మాట్లాడుతున్న మురళిని కన్నార్పకుండా ఆనందంగా చూస్తోంది స్వర్ణ. - నిర్మల చిలకమర్రి
భయాల బంధనాలు
కొందరికి ఎత్తై ప్రదేశాలంటే భయం. మరికొందరికి నీళ్లంటే భయం. ఇంకొందరికి నిప్పు... ఇలా లోకంలో ఎంతో మందికి భయాల తాలూకు బాధలు ఉంటుంటాయి. అలాగే మురళికి నలుగురితో మాట్లాడాలంటే భయం ఉంది. దీనినే ‘సోషల్ ఫోబియా’ అంటారు. ఏ భయం ఎవరైతే అపరిమితంగా బాధిస్తుందో అది అప్పటిది అయి ఉండదు. తమ బాల్యంలోనో, గత జన్మలో అంతఃచేతనలోని పొరలలో పేరుకుపోయి ‘బ్లాక్స్’ రూపంలో ఉంటాయి. మురళికి ఉన్న సోషల్ ఫోబియా అతన్ని సమాజం నుంచి, తన ఇంటి నుంచి దూరం చేసింది.
ఒంటరితనంలో కూరుకుపోయి డిప్రెషన్‌కు గురై ఆత్మహత్య చేసుకునేదాకా వెళ్లాడు. సమస్యకు మూలం ఎక్కడ ఉందో తెలుసుకొని న్యాయాన్యాయాలు సరిచూసుకొని అవగతం చేసుకున్నాడు. ఆ గతం తాలూకు భయాలను విగతం చేశాడు. తిరిగి కుటుంబ జీవనాన్ని, సమాజంతో తన అనుబంధాన్ని మెరుగు పరుచుకునే ప్రయత్నాలు చేశాడు.- డాక్టర్ లక్ష్మీ న్యూటన్, పాస్ట్‌లైఫ్ రిగ్రెషన్ థెరపిస్ట్,లైఫ్ రీసెర్చి అకాడమీ, హెదరాబాద్
జీవితమే మార్పు
డాక్టర్ పీటర్ మ్యాక్ లండన్‌లోని వార్విక్ యూనివర్శిటీలో ప్రొఫెసర్. గత జన్మలో ఏర్పడిన బ్లాక్స్ ఈ జన్మపై చూపే ప్రభావాల గురించి విసృ్తతంగా పరిశోధనలు జరిపారు. మనుషుల్లో భయకంపితులను చేసే కలలు, నీళ్లు, పాములు అంటే ఉండే భయాలు, విజయం తాలూకు భయం, నలుగురితో మాట్లాడటం అంటే కలిగే భయాల గురించి క్షుణ్ణంగా పరిశోధించిన ఈ ప్రొఫెసర్ ‘లైఫ్ ఛేంజింగ్ మూవ్మెంట్ ఇన్ ఇన్నర్ హీలింగ్’ అనే పుస్తకాన్ని తీసుకువచ్చారు.