పాస్టర్ కుమారుడిని విడుదల చేసిన మావోయిస్టులు
ఎట్టకేలకు పాస్టర్ కొడుకు ఇసాక్ను మావోయిస్టులు విడిచిపెట్టారు. అక్టోబర్ 30వ తేదీన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన చర్చి పాస్టర్ కన్నయ్యను కిడ్నాప్ చేయడానికి వచ్చిన మావోయిస్టులు, ఆయన దొరక్కపోవడంతో కొడుకు ఇసాక్ను కిడ్నాప్ చేసిన విషయం విదితమే.
ఇసాక్ గురువారం ఉదయం స్వగ్రామానికి చేరుకున్నాడు. అయితే ఇసాక్ విడుదల కోసం పలువురు చర్చి పాస్టర్లు, మానవ హక్కుల వేదిక నాయకులు ప్రయత్నాలు చేశారు. ఆయన విడుదల కోసం మావోయిస్టులకు రాయబారాలు కూడా పంపారు. ఈ నేపథ్యంలోనే ఐదు రోజుల క్రితం 12 మంది పాస్టర్లను మావోయిస్టులు అదుపులోకి తీసుకుని, మరుసటి రోజున విడిచిపెట్టారు. 13 రోజుల తర్వాత ఇంటికి చేరుకుని ఇసాక్ విలేకరులతో మాట్లాడుతూ మావోయిస్టులు తనను బాగానే చూసుకున్నారని చెప్పాడు.