పతంజలి వార్షిక టర్నోవర్ @ 10,000 కోట్లు
►ఏపీలోని విజయనగరంలో పతంజలి ఉత్పత్తుల ప్లాంట్ ఏర్పాటు
►యోగా గురు బాబా రాందేవ్
సాక్షి, న్యూఢిల్లీ: ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి సంస్థ వార్షిక టర్నోవర్ రూ. 10,000 కోట్లు దాటిందని, ప్రతి ఏడాది వంద శాతం వృద్ధితో ముందు కెళుతున్న పతంజలి రానున్న ఏడాదిలో రూ. 20 వేల కోట్ల రూపాయలకు మించగలదని ఆ సంస్థ వ్యవస్థాపకుడు యోగా గురు బాబా రాందేవ్ చెప్పారు. గురువారం ఢిల్లీలో పతంజలి సీఈఓ ఆచార్య బాలకిషన్ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏపీ లోని విజయనగరంలో పతంజలి ఉత్పత్తుల ప్లాంట్ త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు.
అమర సైనికుల పిల్లల కోసం పతంజలి రెసిడెన్షియల్ సైనిక్ స్కూళ్ల ను ఈ ఏడాది ఏర్పాటు చేస్తామని బాబా రాందేవ్ వెల్లడించారు. 2016–17 కు గాను పతంజలి సంస్థ రూ. 10, 561 కోట్ల టర్నోవర్ సాధించిందని వంట నూనెలు, నెయ్యి, తేనె, గోధుమపిండి లాంటి అనేక విభాగాలలో మార్కెట్ లీడర్‌గా ఎదిగిందని రాందేవ్ చెప్పారు. రాబోయే ఒకటి,రెండేళ్లలో పతంజలి దేశంలోనే అతి పెద్ద బ్రాండ్ అవుతుందని రాందేవ్ ధీమా వ్యక్తం చేశారు. పతంజలి ఆవు నెయ్యి రూ.1,467 కోట్ల టర్నోవర్ సాధించిందని, నెయ్యి ఉత్పత్తుల మార్కెట్లో పతంజలి అగ్రగామిగా నిల్చిందని రాందేవ్ చెప్పారు.
విస్తరణ ప్రణాళిక..
ప్రస్తుతం ఉన్న రూ. 35 వేల కోట్ల రూపాయల మేరకు ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని రూ. 60 వేల కోట్ల మేరకు పెంచాలన్నది లక్ష్యమని బాబా రాందేవ్ వివరించారు.అందు కోసం త్వరలో నోయిడా, నాగ్‌పూర్,ఇండోర్, విజయనగరంలలో భారీ సామర్ద్యంతో ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసే దిశలో ముందు కెళుతున్నామన్నారు. ప్రత్యేకించి విజయనగరంలో సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులతో పాటుగా ఆహార ఉత్పత్తుల కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. మసాలా దినుసుల రంగంలో పతంజలి సంస్థ ఇంతవరకూ పూర్తిగా దృష్టి సారించలేదని, అయితే దక్షిణాది రాష్ట్రాల మార్కెట్ లక్ష్యంగా విజయనగరంలో పతంజలి ఉత్పత్తుల కేంద్రం ఏర్పాటవుతుందని బాబా రాందేవ్ చెప్పారు. పతంజలి సంస్థకు ప్రస్తుతం 6 వేల మంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారని, వచ్చే సంవత్సరానికి వీరి సంఖ్యను 12 వేలకు పెంచుతామన్నారు.
5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తాం...
ప్రస్తుత పతంజలి సంస్థ వద్ద లక్ష మంది ఉద్యోగులు పని చేస్తున్నారని,త్వరలోనే 5 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తామని రాందేవ్ చెప్పారు. పరిశోధనకు పతంజలి పెద్ద పీట వేస్తోందని, ఆయుర్వేదంలో 200 మంది నిపుణులు పరిశోధనలు జరుపుతున్నారన్నారు. త్వరలోనే పతంజలి రెస్టారెంట్లు, జీన్స్ ప్రవేశపెట్టడానికి మార్కెట్ రీసెర్చ్ కొనసాగుతోందన్నారు. ఈ విలేకరుల సమావేశం సందర్భంగా బేబి కేర్, బియ్యం, నూనె తదితర ఉత్పత్తుల కొత్త బ్రాండ్లను రాందేవ్ ఆవిష్కరించారు.