కిరోసిన్ పోసుకొని వివాహిత ఆత్మహత్యాయత్నం
వనపర్తి (మహబూబ్నగర్) : ఇంటి పక్కన ఉన్న వారితో జరిగిన వాగ్వాదంతో మనస్తాపం చెందిన ఓ వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో 80 శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా వనపర్తిలోని పాతబజార్లో శనివారం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. పాతబజార్ కాలనీలో నివాసముంటున్న రాణి(38) శనివారం తమ ఇంటి పక్కన ఉన్నవారితో గొడవ పడింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపం చెందిన రాణి ఇంట్లోకి వచ్చి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. శరీరం పూర్తిగా కాలిపోవడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.