ఆరుగురు సజీవ సమాధి
లుథియానా: దేశమంతా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల్లో మునిగి తేలుతోంటే పంజాబ్లోని ఓ కుటుంబం మాత్రం సజీవ సమాధి అయింది. అర్థరాత్రి ఓ వాహనం పటియాలాలోని కుటుంబం ముంగిట మృత్యుఘంటికలు మోగించింది. దీంతో నలుగురు చిన్నారులు సహా దంపతులు ఈ ప్రమాదంలో మరణించారు.
వివరాల్లోకి వెళితే...నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశానికి ఇసుకలోడ్తో వెళుతున్న ఓ టిప్పర్ వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది. దీంతో గుడిసెలో నిద్రిస్తున్న రాజు(32) భార్య మాన్సి(30) నలుగురు పిల్లలు ఖుషి(1) షీతల్ (3) నిహాల్(5) అశు(10) ఆ ఇసుక కింద కూరుకుపోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే వారు అప్పటికే చనిపోయినట్టుగా వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.