ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం నుంచి 11 మంది రోగుల పరారీ
హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ మానసిక రోగుల చికిత్సాలయం (మెంటల్ ఆస్పత్రి)లో కలకలం చెలరేగింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా పదకొండు మంది మానసిక రోగులు ఆస్పత్రి నుంచి తప్పించుకున్నారు. వారిలో ఏడుగురిని పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురి ఆచూకీ మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.
ఇక్కడి జైల్ బ్యారెక్‌లో మొత్తం 60 మంది రోగులు ఉంటారు. అక్కడినుంచే మొత్తం 11 మంది రోగులు పరారయ్యారు. ఆస్పత్రికి ఉన్న గ్రిల్స్ తొలగించుకుని మరీ వారు పరారు కావడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పరారీ వెనుక ఖురేషీ అనే వ్యక్తి ప్రధాన సూత్రధారి అని తెలుస్తోంది. కాగా, ఆక్సిజన్ సిలిండర్‌తో గోడను పగుల గొట్టి పరారైనట్లు సమాచారం.
అర్ధరాత్రి రెండు గంటల తర్వాత వీరంతా ఒకరి తర్వాత ఒకరిగా పరారయ్యారు. నగరంలోని పాతబస్తీకి చెందిన ఖురేషీ, వరంగల్ జిల్లాకు చెందిన జీవరత్నం, తిరుమలేష్ తదితరులున్నారు. గతంలోనూ ఆరుగురు ఇక్కడినుంచి తప్పించుకున్నారు. అంతకుముందు గుర్తుతెలియని వ్యక్తి మహిళావార్డులో ప్రవేశించారు. మొత్తమ్మీద ఇక్కడ భద్రతాపరమైన లోపాలు కనిపిస్తున్నాయి. పోలీసులకు ఫోన్లు చేసినా ఎవరూ స్పందించలేదని స్థానికులు చెబుతున్నారు.
ఇక పాతబస్తీకి చెందిన ఖురేషీ అనే వ్యక్తి ఈ మొత్తం సంఘటనకు సూత్రధారి అని భావిస్తున్నారు. అతడు ఇక్కడినుంచి పారిపోయి పాతబస్తీలోని మీర్ చౌక్ వైపు వెళ్లినట్లు చెబుతున్నారు. అతడు తన రెండో భార్యను తీసుకుని ముంబై వైపు పారిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.