తటస్థంగా ఉండాలని టీడీపీ విప్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఓటింగ్ సమయంలో తటస్థ వైఖరిని అవలంభించాలని, టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు సమదూరం పాటించాలని టీడీపీ నిర్ణయించింది. ఈ ఎన్నికను బహిష్కరించాలని, హాజరైనా ఎవరికి ఓటు వేయకూడదని విప్ జారీ చేసింది. మండలిలో తెలుగుదేశానికి ఏడుగురు సభ్యులుండగా.. ఎన్నికలకు ముందే పట్నం నరేందర్ రెడ్డి(రంగారెడ్డి) టీఆర్ఎస్లో చేరారు.
ఇటీవలే మండలిలో పార్టీ ఫ్లోర్ లీడర్ బి. వెంకటేశ్వర్లు, మరో సభ్యుడు సలీం కూడా అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. వీరితో పాటు కాంగ్రెస్‌కు చెందిన ఏడుగురు సభ్యులు కూడా టీఆర్ఎస్ అభ్యర్థి స్వామిగౌడ్‌కే మద్దతివ్వనున్న నేపథ్యంలో టీడీపీ తాజా నిర్ణయం తీసుకుంది. పార్టీ సభ్యులందరికీ విప్ జారీ చేయడం ద్వారా టీఆర్ఎస్లో చేరిన వారిపై అనర్హత వేటు వేయించాలని ఆ పార్టీ భావిస్తోంది.