Patrol Bunks
-
త్వరలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్టోర్స్
సాక్షి, అమరావతి: త్వరలో స్కిల్ డెవలప్మెంట్ స్టోర్స్ ఏర్పాటు కానున్నాయి. జాతీయ రహదారులకు ఇరువైపులా పెట్రోల్ బంకుల ఆవరణలో ఈ స్టోర్స్ ఏర్పాటుకానున్నాయి. వీటిలో చేతివృత్తి కళాకారులు తయారుచేసిన వివిధ రకాల వస్తువుల అమ్మకాలు జరగనున్నాయి. సేంద్రియ ఎరువులతో పండించిన పంటలకు సంబంధించిన ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయి. చేతివృత్తి కళాకారుల ఆర్థిక పరిస్థితుల మెరుగుదలకు ప్రత్యేక పథకాలు అమల్లోకి తీసుకురావాలన్న సీఎం వైఎస్ జగన్ సూచనల మేరకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ ప్రతిపాదనలు తయారుచేసింది. పెట్రోల్, డీజిల్ కొనుగోలుకు వచ్చే వాహనదారులు ప్రత్యేకతలు కలిగిన ఈ స్టోర్స్‌లోని వస్తువులు, ఆహారపదార్థాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని స్కిల్ డెవలప్మెంట్ నిర్వహించిన సర్వేలో స్పష్టమైంది. ప్రయోగాత్మకంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు స్టోర్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఉపాధి అవకాశాలు, ఆర్థిక వెసులుబాటు రాష్ట్రంలోని జాతీయ రహదారులకు ఇరువైపులా హిందుస్థాన్, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్లు పెట్రోలు, డీజిల్ బంకులను డీలర్ల వ్యవస్థ ద్వారా నిర్వహిస్తున్నాయి. కొందరు నిర్వాహకులకు పెట్రోల్ బంకులతో పాటు.. కన్సూ్యమర్ ప్రొడక్ట్స్ విక్రయాలకు అదనంగా స్థలాలున్నాయి. ఈ స్టోర్స్‌లో మార్కెట్లో లభించే సాధారణ వస్తువులే లభిస్తుండటంతో వాహనదారులు వాటి కొనుగోలుకు ఆసక్తి చూపకపోవడంతో అవి నిరుపయోగంగా మిగిలిపోయాయి. వీటిలో స్టోర్స్ ఏర్పాటుకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్.. ఆయిల్ కంపెనీలతో ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ స్టోర్స్‌లో కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణలు, విజయనగరం జిల్లా గుడితికి చెందిన రాగి పాత్రలు, గొల్లప్రోలు కలంకారీ, సరసరాపురం లేసులు, మచిలీపట్నం గోల్డు కవరింగ్ ఆభరణాలు, ఏలూరు తివాచీలు, దుర్గి సాఫ్ట్ స్టోన్ క్వారింగ్ బొమ్మలు, నరసరావుపేట తోలుబొమ్మలు, తిరుపతిలో ఉడ్ కార్వింగ్‌తో చేసిన దేవుని బొమ్మలతో పాటు.. ఇతర ప్రాంతాల చేతివృత్తి కళాకారులు తయారుచేసిన బొమ్మలను విక్రయిస్తారు. లేపాక్షి సంస్థ నిర్వహిస్తున్న రీతిలోనే కళాకారుల నుంచి వస్తువులను తీసుకుని విక్రయానంతరం నగదు అందజేస్తారు. ఈ విధానం వలన ఉపాధి అవకాశాలతో పాటు.. చేతివృత్తి కళాకారుల వస్తువుల అమ్మకాలు పెరిగి వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఈ ప్రతిపాదనలు ముఖ్యమంత్రి పరిశీలనలో ఉన్నాయని.. అనుమతి రాగానే ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. -
పెట్రోల్ పంపుల్లో ఫాస్ట్యాగ్లు
న్యూఢిల్లీ: టోల్‌ప్లాజాల వద్ద వాహన క్యూలను తగ్గించే ఫాస్ట్యాగ్లు ఇకపై పెట్రోల్ పంపుల్లోనూ అందుబాటులోకి రానున్నాయి. వాహనం విండ్ స్క్రీన్‌పై అతికించే ఈ ఫాస్ట్యాగ్స్ ద్వారా టోల్ ప్లాజాల వద్ద రుసుము ఆటోమేటిక్‌గా జమ అవుతుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్ఎఫ్ఐడీ) విధానం ద్వారా లింక్ అయి ఉన్న ప్రీపెయిడ్ లేదా సేవింగ్ అకౌంట్ నుంచి నేరుగా లావాదేవీ జరిగిపోతుంది. దీనివల్ల ప్లాజాల వద్ద వాహనాలు ఆపే అవసరం ఉండదు. ఈ ఫాస్ ట్యాగ్‌లను దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ పంపుల వద్ద త్వరలోనే అందుబాటులో ఉంచుతారు. వీటితో పార్కింగ్ ఫీజు చెల్లింపులు, పెట్రోల్ కొనుగోలు కూడా చేసుకోవచ్చు. ఫాస్ట్యాగ్ల విక్రయం, పంపిణీకి సంబంధించి పలు కంపెనీలతో ఒప్పందం కుదుర్చున్న అనంతరం రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయం తెలిపారు. -
మూడేళ్లలో 35,600 కొత్త పెట్రోల్ బంకులు
న్యూఢిల్లీ: భారత్‌లో మూడేళ్లలో కొత్తగా 35,600 పెట్రోల్ అవుట్లెట్లు అందుబాటులోకి రానున్నాయి. పెట్రోలియం ఉత్పత్తుల లభ్యతను పెంచడంలో భాగంగా పెట్రోలియం అవుట్లెట్లను ప్రభుత్వం భారీగా ఏర్పాటు చేస్తోంది. వీటిల్లో 27 శాతం అవుట్లెట్లను బలహీన వర్గాల వారికి, 22.5 శాతం ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తామని చమురు మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. బీసీలకు 27 శాతం కేటాయించడం ఇదే మొదటిసారని పేర్కొన్నాయి. ఇప్పటికే 51,870 పెట్రోల్ పంపులున్నాయి. వీటిల్లో ఐఓసీ అవుట్లెట్లు 23,993, హెచ్‌పీసీఎల్ అవుట్లెట్లు 12,869, బీపీసీఎల్ అవుట్లెట్లు 12,123 ఉన్నాయి. ఇక ప్రైవేట్ రంగానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్వి 1,400, ఎస్సార్ ఆయిల్వి 1,400, షెల్ అవుట్లెట్లు మూడు చొప్పున ఉన్నాయి. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 13,896 ఎల్పీజీ అవుట్లెట్లను(ఐఓసీ-7,035, బీపీసీఎల్-3,355, హెచ్‌పీసీఎల్-3,506)ను నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతమున్న పెట్రోల్ రిటైల్ అవుట్లెట్లలో 2,140 అవుట్లెట్లలో లైటింగ్ కోసం సౌరశక్తిని వినియోగిస్తున్నారు. ఇలా సౌరశక్తి వినియోగిత రిటైల్ అవుట్లెట్లను 2017, మార్చి 31 నాటికి 7,200కు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో రిటైల్ అవుట్‌లెట్‌ను సౌర విద్యుదీకరణ చేయడానికి రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ ఖర్చవుతుందని అంచనా.