బాబు వచ్చాడు ... జాబులు ఊడాయి
– ప్రతి నిరుద్యోగికి రూ.60 వేల బకాయి చెల్లించాలి
– వైఎస్సార్సీపీ పట్టభధ్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస
కదిరి టౌన్ : ఎన్నికల్లో జాబు కావాలంటే బాబు రావాలని నిరుద్యోగులకు హామీ ఇచ్చి ఇప్పుడు దాన్ని తుంగలో తొక్కారని వైఎస్సార్సీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి విమర్శించారు. ఒక్కో నిరుద్యోగికి రూ.2 వేలు ఇస్తామని మాటతప్పారన్నారు. ఒక్కో నిరుద్యోగికి రూ. 60 వేల చొప్పున సీఎం చంద్రబాబు బకాయి పడ్డారన్నారు. సోమవారం సాయంత్రం వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డా.పీవీ సిద్దారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తనను ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపిస్తే వెనుకబడిన రాయలసీమలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. విభజన చట్టంలోని హామీ ప్రకారం కడపలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పడానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. ఉపాధ్యాయులకు సీపీఎస్ విధానం రద్దు అయ్యేవరకు పోరాటం చేస్తామని చెప్పారు. అన్ని శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణకై నిరంతర పోరాటం చేస్తామనీ, మహిళా ఉపాధ్యాయ, ఉద్యోగులకు 22 నెలల ఛైల్డ్ కేర్ లీవ్‌లను సాధన కోసం కృషిచేస్తామని తెలిపారు.
విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టుల భర్తీ కోసం కృషి చేస్తామన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతాన్ని ఫ్రీజోన్‌గా ప్రకటించేలా సర్కారుపై మరింత ఒత్తిడి పెంచుతామని చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డా.పీవీ సిద్దారెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగాల లోకోశ్వర్రెడ్డి, పట్టణ అ«ధ్యక్షుడు కేఎస్ బహవుద్దీన్, కౌన్సిలర్ ఖాదర్‌బాషా, కదిరి, గాండ్లపెంట మండల కన్వీనర్లు ప్రకాష్, చంద్రశేఖర్రెడ్డిలు పాల్గొన్నారు.